నోయిడా శాపం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా వెంటాడుతోందా? కైరానా, నూర్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. నోయిడాకు వెళితే ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో పరాజయం తప్పదనేది ఉత్తరప్రదేశ్‌లో ఎప్పటినుంచో ఉన్న అపనమ్మకం. గతంలో ఇలా నోయిడాకు వెళ్లిన యూపీ సీఎంలు ఈ చేదు అనుభవాన్ని చవిచూశారు. దీంతో ఆ నగరానికి వెళ్లడం మానేశారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లో సీఎం పీఠం అధిష్టించిన అనతికాలంలోనే యోగి ఆదిత్యనాథ్ ఈ సంప్రదాయాన్ని చెరిపేశారు. డిసెంబర్‌లో నోయిడాలో మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి సీఎం యోగి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రెండు, మూడు సార్లు నోయిడా, గ్రేటర్ నోయిడాను సందర్శించారు. అయితే.. ఆ తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ బీజేపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. యోగి సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌తో పాటు, పుల్పూర్, కైరానా పార్లమెంట్ స్థానాలను, నూర్పూర్ అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. దీంతో ‘నోయిడా శాపం’ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. 1980లలో వీర్ బహదూర్ సింగ్ నోయిడాకు వెళ్లొచ్చిన మరుక్షణమే.. కాంగ్రెస్ పార్టీ అతణ్ని యూపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. దీంతో ‘నోయిడా శాపం’ తెరపైకి వచ్చింది. తదంనంతరం యూపీ సీఎం బాధ్యతలు చేపట్టిన వ్యక్తులు నోయిడా వెళ్లే సాహసం చేయలేకపోయారు. 2000 - 2002 మధ్య కాలంలో యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రాజ్‌నాథ్ సింగ్ తన పదవి కాలంలో ఒక్క పర్యాయం కూడా నోయిడాకు వెళ్లలేదు.ఆ తర్వాత యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ములాయం సింగ్ యాదవ్.. 2003లో నోయిడా వెళ్లి రాగా.. 2007లో పరాజయం పాలయ్యారు. 2011లో నోయిడాలో మెట్రో ప్రారంభానికి వెళ్లిన నాటి సీఎం మాయావతి 2012 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. దీంతో ‘నోయిడా శాపం’ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2012 - 2017 మధ్య యూపీ సీఎంగా ఉన్న అఖిలేశ్ యాదవ్.. నోయిడా వెళ్లే సాహసం చేయలేదు. ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేసినా.. నోయిడా అపనమ్మకానికి భయపడి నోయిడాలో కీలకమైన ప్రాజెక్టులన్నింటినీ లక్నోలోని తన అధికార నివాసం నుంచే ప్రారంభించడం గమనార్హం. అయితే హిందుత్వాన్ని బాగా అనుసరించే సీఎం యోగి మాత్రం ‘నోయిడా శాపం’ ఓ మూడనమ్మకమేనని కొట్టిపారేశారు. 2017 డిసెంబర్‌లో ప్రధానితో కలిసి నోయిడాలో కొత్త మెట్రో లైన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగిపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. అపనమ్మకాన్ని చెరిపేసిన ధైర్యవంతమైన సీఎం యోగి అని కొనియాడారు. కానీ, తాజాగా జరుగుతున్న పరిణామాలు యోగికి ప్రతికూలంగా మారడంతో నోయిడా శాపం మరోసారి తెరపైకి వచ్చింది.