బెజవాడ దుర్గగుడిలో చెలరేగిన వివాదం సద్ధుమణిగింది. క్షురుకుల ఆందోళన విషయం తెలుసుకున్న పాలకమండలి ఛైర్మన్ గౌరంగాబు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు రంగంలోకి దిగారు. నాయా బ్రాహ్మణ సేవా సంఘ ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి డిమాండ్ మేరకు పాలకమండలి సభ్యుడు పెంచలయ్య క్షమాపణ చెప్పడంతో.. ఈ వ్యవహారానికి పుల్‌స్టాప్ పడింది. ఇదే సందర్భంలో క్షురకులు తమ సమస్యల్ని ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పరిష్కరిస్తామని గౌరంగబాబు హామీ ఇచ్చారు. ఆలయంలోని కేశఖండనశాలలో ఓ క్షురకుడు భక్తుడి నుంచి రూ.10 తీసుకున్నాడు. దీన్ని గమనించిన పాలకమండలి సభ్యుడు.. డబ్బు ఎందుకు తీసుకున్నావని అతడ్ని ప్రశ్నించాడు. భక్తులు ఇష్టపూర్వకంగా ఇస్తే తప్పేం లేదని సమాధానం ఇచ్చాడు.క్షురకుడు చెప్పిన సమాధానంతో పాలకమండలి సభ్యుడు కోపంత ఊగిపోయాడట. వెంటనే అతడి చొక్కాపట్టుకొని దుర్భాషలాడి, దాడి చేశాడని బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనపై వివాదం రాజుకోగా.. క్షురకులంతా ఇవాళ విధులు బహిష్కరించారు. కేశఖండనశాల ఎదుట బైఠాయించారు.