ఏలూరు, ఏప్రిల్ 20
ఏపీలో కూటమి రాజకీయం కాకరేపుతోంది. సీట్ల సర్దుబాటులో ఒకటి రెండు మార్పులు ఉంటాయనే ప్రచారం అగ్గి రాజేస్తోంది. ముఖ్యంగా టీడీపీ ఫైర్‌బ్రాండ్ నేత సీటు కిందకు నీళ్లు వచ్చేలా పరిస్థితి కనిపిస్తుండటం.. పొలిటికల్ హైటెన్షన్‌గా మారింది. బీజేపీలోని కీలక నేత కోసం ఆ పార్టీ హైకమాండ్ ఏలూరు జిల్లాలో ఓ సీటు కేటాయించాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెస్తోందట. మరి బీజేపీ పెద్దల ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గుతారా? తన మాటే శాసనంగా భావించే నేతను సైడ్ చేస్తారా? ఇంతకీ బీజేపీ అడుగుతున్న నియోజకవర్గమేది? సీటు త్యాగం చేయాల్సిన నేత ఎవరు?ఏపీలో ఎన్‌డీఏ కూటమి సీట్లలో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం హీట్‌పుట్టిస్తోంది. సీట్లు సర్దుబాటు.. అభ్యర్థుల ప్రకటన పూర్తయిన తర్వాత వచ్చిన కొన్ని అభ్యంతరాలపై ఇప్పటికే మూడు పార్టీల మధ్య చర్చలు జరిగాయి. ఒకటి రెండు చోట్ల మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రధాన పార్టీల నేతల నుంచి క్యాడర్‌కు సంకేతాలు అందాయి. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఏలూరు జిల్లా దెందులూరు సీటులోనూ మార్పు జరగనుందనే ప్రచారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ ఫైర్‌బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తుండటం, రాష్ట్రవ్యాప్తంగా ఆ నియోజకవర్గంపై ఫోకస్ ఉండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఎక్కువవుతోంది.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో చింతమనేని కీలక నేత. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతమనేని టీడీపీలో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఆయన వ్యవహారశైలితో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కానీ, అవే వివాదాలు ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. గత ఎన్నికల్లో తొలిసారి ఓడిన చింతమనేని.. ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. తొలి జాబితాలోనే ఆయన టికెట్‌ను కన్ఫార్మ్ చేసింది టీడీపీ.. ఐతే ఇప్పుడు ఆ సీటు నుంచి బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి అలియాస్ తపనా చౌదరిని బరిలోకి దింపాలని కమలం పెద్దలు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్న తపనా చౌదరి ఏలూరు పార్లమెంట్ టికెట్ ఆశించారు. ఐతే జిల్లాలో నరసాపురం పార్లమెంట్‌ను బీజేపీకి కేటాయించింది టీడీపీ. దీంతో తపన చౌదరికి అవకాశం లేకపోయింది. ఐతే బీజేపీ టికెట్లు పొందిన వారిలో సంఘ్ నేపథ్యం ఉన్నవారు తక్కువగా ఉన్నారనే అభిప్రాయంతోపాటు వలస నేతలకు టికెట్లు ఎక్కువ ఇచ్చారనే ప్రచారం నేపథ్యంలో.. ఆ అపవాదను తొలగించుకోడానికి దెందులూరును తీసుకుని తపన చౌదరిని పోటీకి పెట్టాలని భావిస్తోంది బీజేపీ.ఇప్పటికే ఈ ప్రతిపాదనను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. దెందులూరును బీజేపీకి కేటాయిస్తే.. దానికి ప్రతిగా తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిని టీడీపీకి వదిలేస్తామని బీజేపీ పెద్దలు ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనపై టీడీపీ తర్జనభర్జన పడుతున్నట్లు చెబుతున్నారు. అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటం.. ఆయన ఎలాగైనా పోటీ చేస్తానని చెబుతుండటం వల్ల టీడీపీ అధిష్టానం ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా నల్లమిల్లి పోటీలో ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి అనుకూలంగా ఉంటుందని, ఆయన తిరుగుబాటు చేస్తే ఫలితం తేడాగా ఉంటుందనే ఆందోళన రెండు పార్టీల్లో కనిపిస్తోంది. దీంతో దెందులూరు సీటు విషయమై చింతమనేనితో మాట్లాడాలని పార్టీ నేతలను చంద్రబాబు పంపినట్లు చెబుతున్నారు.వివాదాస్పద వ్యాఖ్యలు, దూకుడు స్వభావంతో టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు చింతమనేని.. ఆయన తీరుతో కొన్నిసార్లు టీడీపీ చిక్కుల్లో పడింది. కానీ, కొన్నిసార్లు అదే పార్టీకి అడ్వాంటేజ్ అయిందనే వాదన కూడా ఉంది. దీంతో పోటీ నుంచి తప్పించడం టీడీపీకి అంత ఈజీ కాదనే ప్రచారం ఉంది. పార్టీ ప్రతిపాదనను చింతమనేని అంగీకరించే పరిస్థితి ఉందా? అన్న సందేహాలు ఎక్కువున్నాయి. ఐతే ఇదే సమయంలో దెందులూరును బీజేపీకి కేటాయించే విషయంలో టీడీపీలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఏలూరు పార్లమెంట్ పరిధిలో మూడు సీట్లను బీజేపీ, జనసేనకు కేటాయించారు. ఇక నాలుగో సీటు ఇవ్వడం అసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. తపన చౌదరిని పోటీకి పెట్టాలంటే కైకలూరు నుంచి బరిలోకి దింపాలని బీజేపీకి సూచిస్తున్నారు టీడీపీ నేతలు. కైకలూరులో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు 76 ఏళ్లు కావడం వల్ల ఆయనను తప్పించి తపనా చౌదరికి టికెట్ ఇస్తే.. ఈ సమస్య అధిగమించొచ్చని సలహా ఇస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి దెందులూరుపై గాలం వేయాలని బీజేపీ చూస్తుందనే ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. దీనిపై రెండు పార్టీల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేనప్పటికీ.. రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే ఏమైనా జరగొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది