ర్నూలు, ఏప్రిల్ 20,
తెలుగుదేశం పార్టీ ఈసారి వైసీీపీ నుంచి వచ్చి చేరిన ముగ్గురు కీలక నేతలకు మళ్లీ టిక్కెట్ ఇచ్చింది. అయితే ఈ ముగ్గురూ గెలిస్తే వాళ్లు వ్యక్తిగత బలంతోనే గెలిచినట్లు భావిస్తారు. తమకు వైసీపీ టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీ మారి పట్టుబట్టి టిక్కెట్లు తెచ్చుకున్నారంటే ఆషామాషీ విషయం కాదు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వీరు ముగ్గురు నేతలు తమకు ఈసారి ఆ పార్టీ సీటు ఇవ్వదని భావించి కొందరు.. ఇవ్వకపోవడంతో మరికొందరు పార్టీని వీడారు. నేరుగా పసుపు కండువాను కప్పేసుకున్నారు. అయితే అనేక కోణాల్లో పరిశీలించిన అనంతరమే వారిని పార్టీలోకి తీసుకుని మరీ టీడీపీ అధినాయకత్వం ఈ ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వ్యక్తిగత బలం ఉండబట్టే తమ నేతలకు సులువుగా టిక్కెట్ దక్కిందని వారి అనుచరులు చెప్పుకుంటున్నారు.. ముందుగా పెనమలూరు నుంచి పార్ధసారధి విషయాన్ని తీసుకుంటే . ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. బలమైన యాదవ కులానికి ప్రతీకగా ఉన్నారు. ఆయన మరోసారి పెనమలూరు నుంచి వైసీపీ తరుపున పోటీ చేయాలనుకున్నారు. కానీ జగన్ ఐదేళ్లలో రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ జరిపినా పార్ధసారధికి చోటు కల్పించలేదు. దీంతో కొంత అసంతృప్తితో ఉన్న పార్ధసారధి సర్దుకుపోదామని అనుకున్నా, ఆయన సీటుకే ఎసరు వచ్చేలా కనపడింది. పెనమలూరు సీటు ఇచ్చే పరిస్థితి లేదని గ్రహించిన పార్థసారధి టీడీపీలో చేరిపోయారు. అయితే టీడీపీలో ఆయనకు పెనమలూరు సీటు లభించలేదు. నూజివీడు నుంచి బరిలోకి దింపారు. నూజివీడులో సరైన అభ్యర్థి లేకపోవడంతో పార్థసారధిని నూజివీడుకు పార్టీ అధినాయకత్వం పంపింది. నూజివీడులో గెలిచి పార్థసారధి సత్తా చాటాలని చూస్తున్నారు.మరొక కీలక నేత వసంత కృష్ణ ప్రసాద్. ఈయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అదీ మైలవరం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. మాజీ మంత్రి దేవినేని ఉమను ఓడించారు. జెయింట్ కిల్లర్ గా పేరొందారు. కానీ ఈసారి వైసీపీ వసంతకు టిక్కెట్ ఇవ్వదన్న సంకేతాలు బలంగా వినిపించాయి. మరోవైపు మైలవరంలో మంత్రి జోగి రమేష్ జోక్యాన్ని కూడా ఆయన సహించలేకపోయారు. అధినాయకత్వానికి చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన పార్టీ నాయకత్వంపై తిరగబడ్డారు. పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ కండువా కప్పేసుకున్నారు. కానీ అనూహ్యంగా మైలవరం నుంచి దేవినేని ఉమను పక్కన పెట్టి మైలవరం టిక్కెట్ వసంత కృష్ణప్రసాద్ కు ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైనా, రేపు జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేసి తన లక్ ను ఆయన పరీక్షించుకుంటున్నారు. ఇక వివాదాస్పదమైన నేత, మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం కూడా అంతే. ఆయనకు ఆలూరు టిక్కెట్ వైసీపీ హైకమాండ్ ఇవ్వలేదు. కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయమని చెప్పారు. దీంతో ఆయన అలిగారు. చివరి మంత్రి వర్గ సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. అయితే అనూహ్యంగా ఆయన టీడీపీ పంచన చేరిపోయారు. కానీ ఆలూరు టిక్కెట్ గుమ్మనూరి జయరాంకు టీడీపీ ఇవ్వకుండా గుత్తి నుంచి పోటీ చేయాలని ఆదేశించింది. గుత్తిలో టీడీపీ క్యాడర్ ఆయన రాకను వ్యతిరేకిస్తున్నా జయరాంను అభ్యర్థిగా ప్రకటించింది. జగన్ హయాంలో పూర్తి కాలం మంత్రిగా పనిచేసిన గుమ్మనూరి ఆలూరు నుంచి తన మకాంను గుత్తికి మార్చి అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు. ఇలా ముగ్గురు నేతలు పార్టీలు మారి వివిధ నియోజకవర్గాల్లో వారు గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మిగిలిన పార్టీ మారి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలకు కూడా టిక్కెట్ ఇచ్చినా ఈ మూడు నియోజకవర్గాలపైనే చర్చ ఎక్కువగా నడుస్తుంది.