విశాఖపట్టణం, ఏప్రిల్ 20,
తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లకు టికెట్లు దక్కలేదు. అందులో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. దేవినేని ఉమా, ఆలపాటి రాజా, బండారు సత్యనారాయణమూర్తి, దాడి వీరభద్రరావు, గుండ అప్పల సూర్యనారాయణ వంటి నేతలు ఉన్నారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో టిక్కెట్ ఇవ్వలేకపోయానని చంద్రబాబు వారికి సర్ది చెప్పారు. అందరూ విన్నా ఒక్క బండారు సత్యనారాయణమూర్తి మాత్రం అలకపాన్పు ఎక్కారు. పార్టీ పుట్టిన నాటి నుంచి సేవ చేస్తున్నానని.. తనకు టికెట్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆ మనస్థాపంతో మంచం పట్టారు. విశాఖ వచ్చిన చంద్రబాబుతో నిట్టూర్పు మాటలు అనేశారు. దీంతో చంద్రబాబుకు ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది. బండారు విషయంలో సీరియస్ గా ఆలోచించడం అనివార్యంగా మారింది. ఆయనకు మాడుగుల అసెంబ్లీ సీటును కేటాయించాల్సి వచ్చింది.తెలుగుదేశం పార్టీలో బండారు సత్యనారాయణమూర్తి సీనియర్. పూర్వపు పరవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. ఓసారి మంత్రి పదవి కూడా పొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో పరవాడ కనుమరుగయ్యింది. పెందుర్తి తెరపైకి వచ్చింది. 2009లో తొలి ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసిన బండారు సత్యనారాయణమూర్తికి..ప్రజారాజ్యం అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు చేతిలో ఓటమి తప్పలేదు. 2014లో టిడిపి అభ్యర్థిగా బరిలో దిగిన బండారు సత్యనారాయణమూర్తి గెలుపొందారు. 2019లో మాత్రం ఓడిపోయారు. ఎన్నికల్లో గెలిచి కుమారుడు అప్పలనాయుడుకు బాధ్యతలు అప్పగించాలని చూశారు. కానీ పొత్తులో భాగంగా పెందుర్తి సీటు జనసేనకు వెళ్ళింది. గతంలో తనపై పోటీ చేసి గెలిచిన పంచకర్ల రమేష్ బాబు జనసేన అభ్యర్థి కావడాన్ని బండారు జీర్ణించుకోలేకపోయారు. తనకే టికెట్ కావాలని పట్టుబట్టారు. అల్లుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ద్వారా ఎంతలా ప్రయత్నించాలో అంతలా చేశారు.కానీ టికెట్ మాత్రం దక్కించుకోలేకపోయారు. బండారు సత్యనారాయణమూర్తి పెడుతున్న చికాకు చంద్రబాబు లొంగిపోయారు. ఆయనకు మాడుగుల టిక్కెట్ కేటాయించారు. ఇప్పటికే ఎన్నారై పైలా ప్రసాద్ కు అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఆయన ప్రచారంలో వెనుకబడ్డారన్న నివేదికలు వచ్చాయి. దీంతో అక్కడ అభ్యర్థి మార్పు అనివార్యంగా మారింది. ఆ నియోజకవర్గంలో వెలమ సామాజిక వర్గం కూడా అధికం. బండారు సత్యనారాయణమూర్తి అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. చంద్రబాబు ఆయన అభ్యర్థిగా డిసైడ్ చేశారు. అయితే మాడుగుల వెళ్ళేందుకు బండారు సత్యనారాయణమూర్తి తటపటాయిస్తున్నారు. సన్నిహితులు మాత్రం అక్కడికి వెళ్లడమే ఉత్తమం అని సూచిస్తున్నారు. అయితే చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ను బండారు సత్యనారాయణమూర్తి స్వీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.