YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీసీ జనార్ధనరెడ్డిని బుజ్జగించిన టీడీపీ

బీసీ జనార్ధనరెడ్డిని బుజ్జగించిన టీడీపీ
ఆ టీడీపీ ఎమ్మెల్యే అలక పాన్పు ఎక్కారు. జిల్లాతో పాటూ విజయవాడలో జరిగిన మహానాడుకు కూడా డుమ్మా కొట్టారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు ఆయన వైసీపీలోకి కూడా వెళతారనే ప్రచారం జోరందుకుంది. ఈ పరిణామాలన్నీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో బుజ్జగింపులు మొదలయ్యాయట. తనను కవాలంటూ టీడీపీ అధినేత నుంచి పిలుపు కూడా వెళ్లడంతో.. అమరావతికి వెళ్లి చంద్రబాబును ఆయన కలవబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. బీసీ జనార్థన్ రెడ్డి.. కర్నూలు జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే. పార్టీకి ముఖ్యమైన నేత. 2014లో జిల్లావ్యాప్తంగా టీడీపీకి ఎదురుగాలి వీచినా.. ఈయన మాత్రం ప్రత్యర్థిపై భారీ మెజార్టీతోనే గెలిచారు. పార్టీకి ముఖ్యమైన ఈ నేత కొద్ది రోజులుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారట. ఎమ్మెల్యే అలకకు ఈ మధ్య కేటాయించిన నామినేటెడ్ పదవులే కారణమని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో జనార్థన్‌రెడ్డికి సహకరించి.. విజయంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డికి పంపకాల్లో ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పదవి కేటాయించారు. దీన్ని ఆయన తిరస్కరించగా... అధిష్టానం బుజ్జగించి పౌరసరఫరాలశాఖ ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పిందట. అయితే నియామకం మాత్రం ఆలస్యం అవుతోందట. అందుకే బీసీ అలిగారని జిల్లాలో టాక్. ఈ కారణంతోనే జనార్థన్ రెడ్డి మహానాడుకు డుమ్మా కొట్టారట. చల్లాకి పదవి వ్యవహారం అలా ఉంటే.. ఏకంగా ఎమ్మెల్యే బీసీ వైసీపీలోకి వెళతారంటూ ఊహాగానాలు కూడా వినిపించాయి. మహానాడు ముగియడంతో.. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లిందట. దీంతో అమరావతికి వచ్చి తనను కలవాలని ఆయన్ను అధినేత ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇవాళ జనార్థన్ రెడ్డి బాబును కలిసే అవకాశం ఉందట. మధ్యాహ్నం అధినేతతో పాటూ నారా లోకేష్‌తో కూడా భేటీ అవుతారని సమాచారం. 

Related Posts