ప్రముఖ ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా.. ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించింది. భవిష్యత్‌లో వ్యాపార వృద్ధికి బహుముఖ వ్యూహం అనుసరించాలని అనుకుంటోంది. ఇందుకోసం కేన్సర్ డ్రగ్స్, కాంప్లెక్స్ ఇంజెక్టిబుల్స్, రెస్పిరేటరీ ప్రొడక్టులు, పెప్టైడ్స్, టాపికల్స్, ట్రాన్స్‌డెర్మల్స్, బయో సిమిలర్స్‌తోపాటు మరిన్ని ఔషధ ఉత్పత్తుల విభాగాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో జరిగిన జెపి మోర్గాన్ హెల్త్‌కేర్ కాన్ఫరెన్స్‌లో అరబిందో ఫార్మా వెల్లడించిన భవిష్యత్ ప్రణాళికలు..
ఈ ఏడాది ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసుకోవడంతోపాటు రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ (ఆర్ అండ్ డి), ఉత్పత్తి సామర్థ్యం, సరఫరా, మార్కెటింగ్ వ్యవస్థపై ప్రధానంగా దృష్టి సారిస్తాం.
2019-21 మధ్యకాలంలో ప్రత్యేక, భిన్న ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఫైలింగ్‌లు పెంచనున్నాం. అలాగే కేన్సర్, రెస్పిరేటరీ, టాపికల్ ప్రొడక్ట్స్, కాంప్లెక్స్ ఇంజెక్టిబుల్స్‌ను అమెరికాలో, బయోసిమిలర్లను వర్ధమాన మార్కెట్లలో ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం.
ఇన్‌హేలర్లు, ట్రాన్స్‌డెర్మల్స్, బయోసిమిలర్లు, బ్రాండెడ్ ప్రిస్ర్కిప్షన్, ఓవర్ ది కౌంట్ (ఒటిసి) ఉత్పత్తులను 2022 తర్వాత లాంచ్ చేసే అవకాశం ఉంది.గడిచిన కొనాళ్లలో అరబిందో తన ఆర్ అండ్ డి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లో 5, అమెరికాలో 2 ఆర్ అండ్ డి సెంటర్లున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం(2016-17)లో 8.1 కోట్ల డాలర్లు (మొత్తం విక్రయాల్లో 4.3 శాతం) ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18) ప్రఽథమార్ధంలో 5 కోట్ల డాలర్లు వెచ్చించింది. 2016-17లో కంపెనీ ఆదాయం 225 కోట్ల డాలర్లుగా నమోదైంది. అందులో 45శాతం అమెరికా మార్కెట్ నుంచి సమకూరింది.