YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొండగాలి చెత్త జీవితం..

 కొండగాలి చెత్త జీవితం..

 ‘వాలు ప్రాంతంలో కాఫీతోటలు పెంచేది వీరే. గింజలను కోసి, పొడిగా మార్చి ఇలా కాఫీ చేసేది ఈ చేతులే’ అన్నాడు అనిల్, అరకు నుంచి పాడేరు వెళ్ళే మలుపులో మాకు వేడిగా కాఫీలు ఇచ్చిన అమ్మాయిలను పరిచయం చేస్తూ! విశాఖలో ఉదయం ఐదుగంటలకు మొదలైన మా జర్నీ అరకు వ్యాలీకి వచ్చే సరికి మూడున్నర గంటలు పట్టింది. అక్కడ ఒక ప్రముఖ నేత దత్తత తీసుకున్న గ్రామాన్ని చూడాలని బయలుదేరాం కానీ, ‘దిక్కూ, మొక్కూ లేక దత్తత కోసం అలమటిస్తున్న మరో గ్రామం చూద్దాం’ అని పాడేరు వైపు వాహనాన్ని తిప్పాడు అనిల్. అతడు రామకృష్ణా మిషన్‌లో గిరిజన వికాసం కోసం పని చేస్తుంటాడు. అలా నూటయాభై కిలోమీటర్లు ప్రయాణించాక వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, కాలిబాటలో సిల్వర్ ఓక్ చెట్ల మధ్య నడవ సాగాం. 

తూర్పు కోస్తా తీరంలో విశాక ఏజన్సీలో విసిరేసినట్టున్న గ్రామం జంగంపుట్టు, 120 కుటుంబాలు ఇక్కడున్నాయి. కొండవాలులోని ఊటనీటి కుంటలే వీరికి జీవజలం. అవీ లేని వారు బావుల్లో అడుగంటిన మురికి నీళ్ళతో గొంతు తడుపుకుంటున్నారు. ఇక్కడి భూములన్నీ వాలుగా ఉంటాయి. అక్కడే, ఊట నీటితో ‘మెట్ల సాగు’ చేస్తూ వరి, వేరుశనగ, క్యాబేజీ పండిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేకానేక సంక్షేమ పథకాలు ఈ గిరిజన పల్లెలకు ఇంకా చేరలేదు. కిరోసిన్ గుడ్డి దీపాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒకటీ, అరా కరెంట్ పోల్స్ వేసినా వారానికోసారి విద్యుత్ వస్తుంది. సముద్ర మట్టానికి 900 నుంచి 1200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండ ప్రాంతంలో గాలులు విపరీతంగా వీయడం వల్ల కరెంట్ తీగలు తెగి పడుతుంటాయి. వీటిని సరిచేసే లైన్‌మేన్‌ల కోసం కబురు చేయాలన్నా సెల్‌ఫోన్‌లు పలకవు. ‘సెల్‌ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ లేదు. అరవై కిలోమీటర్ల దూరం పోయి, పది రూపాయలిచ్చి బ్యాటరీ ఫుల్ చేసుకుని రావాలి. 

ఎత్తయిన కొండ ఎక్కి మాట్లాడితే కానీ సిగ్నల్ అందదు’ అన్నాడు జన్ని రాజారావు. ‘జంగంపుట్టు నుంచి గత్తుం రోడ్డులోకి రావాలంటే అడవిలో ముళ్ళపొదల మధ్య మూడు కిలోమీటర్లు దూరం కాలిబాటలో నడిచి పోవాలి. మధ్యలో ఒక ఏరు కూడా ఉంది. వానాకాలంలో నీటి ప్రవాహం పెరిగిపోయి ఆ దారి కూడా మూసుకు పోతుంది. వృద్ధులకు రోగాలు వచ్చినా, గర్భిణీ స్త్రీలకు పురిటి నొప్పులు వచ్చినా ఆసుపత్రికి వెళ్ళడానికి దారిలేదు. మా కష్టాలను ప్రజాప్రతినిధుల దగ్గర ఎన్నిమార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు.

జంగంపుట్టు నుంచి గత్తుం వరకు రోడ్డు వేస్తే మాకు బయటి ప్రపంచంతో లింక్ ఏర్పడుతుంది. ఈ దారిలో పదికి పైగా పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. వాటిని తొలగించి రహదారి నిర్మించాలి. ప్రభుత్వం సాయం చేస్తే మేమంతా కలిసి శ్రమదానం చేస్తాం. ఈ రోడ్డు వల్ల సమీపంలోని గాలిపాడు, వెలగపాడు, దుర్గం గ్రామస్తులకు కూడా మేలు కలుగుతుంది.

‘ప్రభుత్వ అధికారులు కానీ, మీడియా కానీ ఇంతవరకు మా గిరిజన గూడెం వైపు తొంగి చూడలేదు. కనీసం మీ ద్వారా అయినా ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు వెళతాయని కొండంత ఆశతో ఉన్నాం’ అంటున్నారీ కొండ ప్రజలు.  నగరాల్లో హాస్టల్స్‌లో ఉండి డిగ్రీలు చదివిన ఇరవై మంది నిరుద్యోగులు ఇక్కడే పశువులను మేపుకుంటున్నారు. విద్యుత్ లేక పోవడం వల్ల టీవీ చూడలేరు. రహదారులు లేకపోవడం వల్ల పేపర్ చదవలేరు. ప్రపంచంతో సంబంధం లేకుండా బతికేస్తున్నారు.  పాడేరు ఐటిడిఎలోని హుకుంపేట మండలం లోని ఈ గిరిజన పల్లెల సమస్యలను పరిష్కరించడానికి ఈ గ్రామాలను ఎవరైనా దత్తత తీసుకుంటే వీరి జీవితాలు మారవచ్చు!

Related Posts