బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి తన కంటే తక్కువ స్థానాలు సాధించిన జేడీఎస్‌కు హస్తం పార్టీ సీఎం పదవి సైతం కట్టబెట్టింది. అయితే కాంగ్రెస్ సాయంతో గద్దెనెక్కిన జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రతి విషయానికీ రాహుల్ గాంధీని సంప్రదించి, జరగబోయే పరిణామాలకు ఆయన్ను బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తనకు సీఎంగా అవకాశం కల్పించిన 'పుణ్యాత్మ' రాహుల్ గాంధీకి తాను రుణపడివుంటానే తప్ప, ఆరున్నర కోట్ల కన్నడిగులకు కాదని ఇటీవలే కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు కేటాయింపు నుంచి కీలకమైన రైతు రుణ మాఫీ వరకూ ఇలా ప్రతి విషయానికీ, మాజీ సీఎం సిద్ధ రామయ్య, మలికార్జున ఖర్గే లాంటి స్థానిక కాంగ్రెస్ నేతలను పక్కనబెట్టి, నేరుగా రాహుల్ గాంధీతోనే మాట్లాడుతున్నారు. తాను భావించినట్టు పాలన సాగకుంటే, ఆ తప్పిదాన్నంతా కాంగ్రెస్ అధ్యక్షుడిపై నెట్టేసి, తప్పించుకోవాలనే ఆలోచన కుమారస్వామిలో కనిపిస్తున్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కుమారస్వామి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన తెలివిగా మైండ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోందని, మొత్తం తప్పును రాహుల్ గాంధీపై నెట్టేసే ఆలోచనలో ఉన్నారని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ హామీ తాను ఇవ్వలేదని కుమారస్వామి అంటున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వాధినేతగా ఉండి, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకుండా, మద్దతిస్తున్న వారిని బలి చేయాలని చూస్తున్న ఆయన వైఖరి సమంజసం కాదని మరో కాంగ్రెస్ నేత అన్నారు. అంతేకాదు తన తప్పిదాలను ఇతరులపై నెట్టేయడం సీఎం కుమారస్వామికి అలవాటేనని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు కుమారస్వామి చర్యలపై కర్ణాటక కాంగ్రెస్ అధికార ప్రతినిధి వీఎస్ ఉగ్రప్ప సానుకూలంగా స్పందించారు. మతత్వ శక్తులను అడ్డుకోడానికి సీఎం పదవిని సైతం త్యాగం చేసిన తమ పార్టీ, రాహుల్‌పై కుమారస్వామి ప్రశంసలు కురిపించడంలో తప్పేముందని అన్నారు. ఆయన తమ పార్టీని, అధినేతను పొగుడుతూ క్షేత్రస్థాయిలో జేడీఎస్ కార్యకర్తలు శాంతిని నెలకొల్పాలని సందేశం ఇస్తున్నారని ఉగ్రప్ప వివరించారు. రెండు రోజుల కిందట రుణ మాఫీపై రైతులతో సమావేశమైన కర్ణాటక కుమారస్వామి తాను కాంగ్రెస్ దయతో ముఖ్యమంత్రి అయ్యాను, తప్ప ప్రజల ఓట్లతో కాదని వ్యాఖ్యానించారు.