YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నేతల ఆస్తులు కారు లేని కిషన్... బంగారం లేని చంద్రబాబు

నేతల ఆస్తులు కారు లేని కిషన్... బంగారం లేని చంద్రబాబు

హైదరాబాద్, ఏప్రిల్ 20
 తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈనెల 18వ తేదీ నుంచి పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్‌ వేసిన  అభ్యర్థులు... తమ ఆస్తులు.. అప్పులు.. కేసులు. ఇలా పూర్తి వివరాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. అఫిడవిట్‌ ప్రకారం... ప్రముఖ అభ్యర్థుల వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆస్తులు వివరాలు
కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి  ఆస్తుల విలువ 19.22 కోట్ల రూపాయలు. గత ఐదేళ్లలో ఆయన కుటుంబం ఆస్తులు 136శాతం పెరిగాయి. 2019లో కిషన్‌రెడ్డి ఆస్తులు రూ.8.1 కోట్లు ఉండగా... ఇప్పుడు రూ.19.2 కోట్లకు  పెరిగాయి. కిషన్‌రెడ్డి చరాస్తుల విలువ రూ.8.3 కోట్లు కాగా... స్థిరాస్తుల విలువ రూ.10.8 కోట్లు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో కిషన్‌రెడ్డికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. రూ.1.1 లక్షల విలువైన 1995 నాటి మారుతీ 800  కారు ఉంది. 2022 నుంచి 2023లో అతని ఆదాయం రూ.13.5 లక్షలు. అతనిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. కిషన్‌రెడ్డి టూల్స్ డిజైన్‌లో డిప్లొమా చేశారు.
పద్మారావుకు రూ.4.19 కోట్ల ఆస్తులు
సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు  కు రూ.4.19 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిలో చరాస్తుల విలువ 3.62 కోట్లు. వ్యవసాయ భూములు, వాణిజ్య భవనాలు లేవు. 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉంది. అప్పులు రూ.50లక్షల  వరకు ఉన్నాయి. ఆయన దగ్గర 60 తులాలు, ఆయన భార్య దగ్గర 75 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. 17 కిలోల వెండి వస్తువులు కూడా ఉన్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ఆస్తుల విలువ రూ.3.33 కోట్లుగా ఉంది.
బండి సంజయ్‌ ఆస్తుల వివరాలు
కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌  కుటుంబ ఆస్తుల విలువ 1.12 కోట్ల రూపాయలు. ఆయనకు స్థిరాస్తులు లేవు. సొంత ఇల్లు కూడా లేదట. అంతేకాదు.. బండి సంజయ్‌పై ఒకటి, రెండు కూడా మొత్తం 41 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఆయన చరాస్తుల విలువ కోటి రూపాయలు. మూడు కార్లు, రెండు బైక్‌ ఉన్నాయి. ఆయన భార్యకి 43 తులాల బంగారం ఉంది. ఇక అప్పుల విషయానికి వస్తే... బండి సంజయ్‌ కుటుంబానికి అప్పులు రూ.13.4లక్షలుగా ఉన్నాయి. ఆయన...  పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏ చేశారు.
ధర్మపురి అర్వింద్‌ ఆస్తుల వివరాలు
బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌  పై 22 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.109 కోట్లు. చరాస్తుల విలువ రూ.59.9 కోట్లు కాగా... స్థిరాస్తుల విలువ రూ.49.8 కోట్లు. అరవింద్‌ పొలిటికల్‌ సైన్స్‌లో  ఎంఏ చేశారు. ఆయన భార్య దగ్గర 85 తులాల బంగారం ఉంది. ఎక్కడా భూములు లేవు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వాణిజ్య, నివాస భవనాలు ఉన్నాయి. ఇక... అప్పులు రూ.30.66 కోట్లు ఉన్నాయి.
బాజిరెడ్డి ఆస్తుల విలువ
నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌  కు రూ.4.61 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిలో 42.11 ఎకరాల వ్యవసాయ భూములు, వెయ్యి గజాల ఇంటి స్థలాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.1.41 కోట్లు కాగా... స్థిరాస్తుల విలువ  రూ.3.20 కోట్లు. అప్పులు లేవు. బాజిరెడ్డి కుటుంబ సభ్యులకు 100 తులాల బంగారం ఉంది.
అసదుద్దీన్‌ ఒవైసీ ఆస్తులు
హైదరాబాద్‌ ఎంపీగా పోటీచేస్తున్న  అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ  కి రూ.23.87 కోట్ల ఆస్తులున్నాయి. స్థిరాస్తుల విలువ రూ.20.91 కోట్లు కాగా... చరాస్తులు ఏమీ లేవు. ఆయన కుటుంబం పేరుతో వ్యవసాయ భూములు కూడా లేవు. పాతబస్తీ  మిస్రీగంజ్‌, మైలార్‌దేవ్‌పల్లిల్లో ఇళ్లు ఉన్నాయి. అసదుద్దీన్‌ అప్పులు రూ.7.05 కోట్లు. ఆయన దగ్గర ఒక పిస్టల్‌, రైఫిల్‌ ఉన్నాయి. ఆయనపై 5 కేసులు ఉన్నాయి.
ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ఆస్తులు
నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌  కుటుంబ ఆస్తులు రూ.1.41 కోట్లు. ఆయనపై ఐదు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సర్వీసు పింఛను వస్తుంది. చరాస్తుల విలువ రూ.73.39  లక్షలు. ప్రవీణ్‌కుమార్‌ దగ్గర ఐదు తులాల బంగారం, ఆయన భార్యకు 15 తులాలు, కుమారుడికి ఐదు తులాలు, కుమార్తెకు 15 తులాల బంగారం ఉంది. భూములు, వాణిజ్య భవనాలు లేవు. రూ.51.80 లక్షల అప్పులు ఉన్నాయి.
వినోద్‌రావు ఆస్తులు
ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్‌రావు ఆస్తులు రూ.16.25 కోట్లు. వినోద్‌రావు దంపతులకు 6.8 కిలోల బంగారం, 61.3 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆయన చరాస్తుల వివుల రూ.9.95 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.6.30 కోట్లు. రూ.3.42  లక్షల అప్పులున్నాయి. కొత్తగూడెం, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో విలువైన వ్యవసాయ భూములు, మేడ్చల్‌లో వ్యవసాయేతర భూములు ఉన్నాయి.
బూర నర్సయ్యగౌడ్‌ ఆస్తుల వివరాలు
భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌  కుటుంబానికి 39 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిలో చరాస్తుల విలువ 9.1కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ 30 కోట్లు. ఆయనకు 3.22 కోట్ల అప్పులు ఉన్నాయి. 2.64 కిలోల బంగారు  ఆభరణాలు, 7 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వ్యవసాయ భూములు, ప్లాట్లు, నివాస భవనాలు కూడా ఉన్నాయి. అనేక సంస్థల్లో వాటాలు కూడా ఉన్నాయి.
గడ్డం వంశీకృష్ణ ఆస్తుల వివరాలు
పెద్దపల్లి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆస్తులు రూ.24 కోట్లు. వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ కుమారుడు. నగదు, డిపాజిట్ల రూపంలో రూ.93.27లక్షలు, వివిధ కంపెనీల్లో షేర్ల రూపంలో రూ.11.39 కోట్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా  మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లో 4.18 ఎకరాలు, ఒడిశాలోని సంబల్‌పుర్‌లో 10.09 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. సొంతగా ఆయన పేరుతో ఇల్లు లేదు. అప్పులు రూ.17.76 లక్షలు ఉన్నాయి.
కొప్పుల ఈశ్వర్‌ ఆస్తుల వివరాలు
పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌  ఆస్తులు రూ.5.22 కోట్లు. ఇందులో చరాస్తుల విలువ రూ.3.59 కోట్లు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో ఇంటి స్థలాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1.63 కోట్లు. అప్పులు రూ.2.3 కోట్లు. కొప్పుల  ఈశ్వర దగ్గర 6 తులాల బంగారం, ఆయన భార్య దగ్గర 20 తులాల బంగారం ఉంది. కిలో వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి.
ఇక ఏపీలో
ఏపీలో ఎన్నికల హడావుడి జోరుగా కొనసాగుతోంది. రోజురోజుకీ నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. అన్ని పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తుండగా.. ఆస్తులు- అప్పుల వివరాలు బయటకొస్తున్నాయి.ఏపీలో ఎన్నికల వేళ ప్రధాన పార్టీలనేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఆస్తుల వివరాలను తెలియజేస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబం ఆస్తి విలువ ఈ ఐదేళ్లలో దాదాపు 40శాతం పెరిగింది. ఇది కేవలం ఆయన, భార్య భువనేశ్వరి పేరిట ఉన్న ఆస్తులు మాత్రమే. గత ఎన్నికల సమయంలో 545 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా...ఇప్పుడు ఆ విలువ 931 కోట్లకు పెరిగింది. అలాగే ఆయనపై ఈ ఐదేళ్లలో ఏకంగా 22 కేసులు నమోదు అయ్యాయి. గతంలో చంద్రబాబుపై కేవలం రెండే కేసులు ఉండేవి.ఈ ఐదేళ్లలో చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. గత ఎన్నికల సమయంలో ఆయన అఫిడవిట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన, భార్య భువనేశ్వరి ఆస్తులు 545 కోట్లు కాగా....ఇప్పుడు ఏకంగా 40శాతం పెరిగి 931 కోట్లుకు చేరుకుంది. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం చంద్రబాబు పేరిట మొత్తం రూ.36.36 కోట్లు ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు రూ.4.80 లక్షలు కాగా రూ. 2,22,500 విలువైన అంబాసిడర్ కారు ఉంది. చంద్రబాబు  వద్ద ఎలాంటి బంగారం లేదు. అలాగే రూ.36.31 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.
చంద్రబాబు
చంద్రబాబు భార్య భువనేశ్వరి పేరిట ఏకంగా రూ.895 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌లోని 2.26 కోట్ల షేర్లు ఉండగా...వీటి విలువ రూ.763.93 కోట్లు. బంగారం, ఇతర ఆభరణాలు విలువ దాదాపు కోటిన్నర  ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్‌లోని రూ.85.10 కోట్ల  విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. మొత్తంమీద చంద్రబాబు కన్నా ఆయన భార్య భువనేశ్వరి పేరిటే ఎక్కువ ఆస్తులు ఉండటం విశేషం. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తో కలిసి  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు. ఇది ఒక్కటే చంద్రబాబుకు ఉన్న అప్పు. అటు భువనేశ్వరికి రూ.6.83 కోట్లు అప్పు  ఉండగా... కుమారుడు లోకేశ్‌ నుంచే రూ.1.27 కోట్లు అప్పు తీసుకోవడం విశేషం.
వేమిరెడ్డి
ఇప్పటివరకు ఏపీలో నమోదైన నామినేషన్లలో కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా చూపారు. అందులో ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరిట రూ.639.26 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నట్లు తెలిపారు. రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయని చెప్పారు.
బుట్టా రేణుకా
నామినేషన్ సందర్భంగా ఆస్తుల చిట్టా ప్రకటించారు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక. అఫిడవిట్ ప్రకారం రూ.161.21 కోట్ల ఆస్తులతో బుట్టా రేణుక అత్యధిక ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే.. రూ.7.82కోట్ల అప్పులు ఉన్నాయి. అటు.. చరాస్తులు రూ.142.46 కోట్లు.. స్థిరాస్తులు రూ.18.75 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు బుట్టా రేణుక. ఇక.. అత్యధిక ఆస్తులు ఉన్న వారి జాబితాలో మూడో స్థానంలోనూ వైసీపీ అభ్యర్థే ఉన్నారు.
శిల్పా చక్రపాణి
 శ్రీశైలం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఆస్తుల విలువ పదేళ్లలో భారీగా పెరిగింది. ఆయన, ఆయన సతీమణి, కుమారుడి పేరిట రూ.131.71 కోట్లు ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.28.24 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. అయితే.. శిల్పా చక్రపాణిరెడ్డి ఆస్తులు.. 2014లో రూ.49.89 కోట్లుగా ఉండగా.. 2019లో రూ.37.27 కోట్లకు పడిపోయాయి. కానీ.. ఈ ఐదేళ్లలో ఆస్తులు దాదాపు వంద కోట్లు పెరగడం హాట్‌టాపిక్‌గా మారుతోంది.
నందమూరి బాలక్రిష్ణ
మరోవైపు.. నందమూరి బాలకృష్ణ ఆస్తులు- అప్పుల వివరాలు కూడా కూడా బయటకొచ్చాయి. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన.. తన నామినేషన్ పత్రాల్లో ఆస్తులు- అప్పుల వివరాల్ని బాలకృష్ణ వెల్లడించారు. బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63 కోట్లు కాగా.. రూ.9 కోట్ల అప్పు ఉన్నట్టు బాలకృష్ణ ప్రకటించారు. బాలకృష్ణ భార్య వసుంధర ఆస్తుల విలువ అక్షరాలా రూ.140 కోట్లు కాగా.. రూ.3 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.
రోజా
మంత్రి  రోజా ప్రకటించిన వివరాల ప్రకారం.. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.4.58 కోట్లకు పెరిగింది. అలాగే 2019 స్థిరాస్తులు రూ.4.64 కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.6.05 కోట్లు అయ్యింది. ఐదేళ్లలో రూ.81 లక్షలు పెరిగాయి. 2019లో ఆరు కార్లు, ఒక బైక్‌ ఉండగా.. వాటి విలువ రూ.1.08 కోట్లు. ఇప్పుడు 9 కార్లుండగా.. విలువ రూ.1.59 కోట్లు. 2019 నాటి కంటే కార్ల విలువను ఇప్పుడు బాగా తగ్గించారు. ఐదేళ్లలో నగరి నియోజకవర్గంలో భర్త పేరిట 6.39 ఎకరాల భూమి కొన్నారు. మంత్రి రోజాకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.39.21 లక్షల విలువైన చీటీ ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
పెద్దిరెడ్డి
మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆయనతో పాటూ భార్య స్వర్ణలత ఆస్తులు ఐదేళ్లలో బాగా పెరిగాయి. 2019లో పెద్దిరెడ్డి చరాస్తులు రూ.11.27 కోట్లు, స్థిరాస్తులు రూ.80.47 కోట్లు. తాజాగా చరాస్తులు రూ.10.59 కోట్లు, స్థిరాస్తులు రూ.114.25 కోట్లుగా ఉన్నాయి. స్వర్ణలతకు 2019లో రూ.10.01 కోట్ల చరాస్తి, రూ.29.2 కోట్ల స్థిరాస్తి ఉండగా.. ప్రస్తుతం చరాస్తి రూ.14.55 కోట్లు, స్థిరాస్తి రూ.66.79 కోట్లకు పెరిగింది. మొత్తంగా పెద్దిరెడ్డి ఆస్తి గత ఎన్నికల్లో రూ.91.74 కోట్లుండగా, నేడు రూ.124.84 కోట్లకు చేరింది. ఆయన భార్య ఆస్తి రూ.39.22 కోట్ల నుంచి రూ.110.55 కోట్లకు పెరిగింది. అయినా పెద్దిరెడ్డికి ఒక్క కారూ లేదు.. కేసులు కూడా లేవు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక స్వర్ణలత పేరిట తిరుచానూరు, మదనపల్లె, పుంగనూరు మండలాల్లో ఎక్కువగా భూములు కొనుగోలు చేశారు.
కేఏ పాల్
నామినేషన్ పత్రాల్లో స్థిర, చరాస్తులు, కేసుల వివరాలను కేఏ పాల్ పొందుపరిచారు. అయితే ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో బాగా పాపులర్ అయిన వ్యక్తి పాల్. వివిధ దేశాల అధ్యక్షులతో పరిచయాలు ఉన్న మత ప్రబోధకుడు. ప్రపంచంలో బోయింగ్ 707 విమానం కలిగి ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్‌లో తన వద్ద కేవలం… రూ.1.86 లక్షల నగదు మాత్రమే ఉన్నట్లు చూపించారు. తన వద్ద  అకౌంట్లలో 1లక్ష 37 వేల 71 రూపయాలు ఉన్నట్టు అఫిడవిట్‌లో చూపించారు.రుణాలతో పాటు.. వాహనాలు, స్థిరాస్తులు లేవని పేర్కొన్నారు.

Related Posts