హర్దోయి నియోజక వర్గ బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్ ప్రకాశ్ తమ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో అవినీతి అధికంగా ఉందంటూ, అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారంటూ పేర్కొని అలజడి రేపారు. తమ ప్రభుత్వం పట్ల రైతులు వ‍్యతిరేకతతో ఉన్నారని, ఇలాంటి పలు కారణాల వల్లే తాము ఇటీవల జరిగిన కైరానా లోక్‌సభ ఉప ఎన్నికలో ఓడిపోయామని అన్నారు. అంతేగాక, గత రాష్ట్ర సర్కారుతో పోల్చి చూస్తే ప్రస్తుతం అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందన్నారు.మరోవైపు, తన ఫేస్‌బుక్ పేజీలో తమ పార్టీపై విమర్శిస్తూ ఒక పద్యం సైతం పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ వల్లే సీఎం ఆదిత్యనాథ్ అధికారం దక్కించుకోగలిగారని, అధికార పగ్గాలు సంఘ్ చేతిలో ఉన్నాయని, అందుకే ముఖ్యమంత్రి అయినప్పటికీ యోగి ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వం గాడి తప్పిందని, విఫలమైందని అన్నారు.సీఎం యోగిని విమర్శిస్తూ వ్యంగ్యంగా ఉన్న ఒక గేయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అవినీతి కారణంగానే ఉప ఎన్నికల్లో భాజపా ఓడిపోయిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న దాని కంటే ఇప్పుడు అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఎమ్మెల్యే శ్యాం ప్రకాశ్ తెలిపారు.మరో శాసనసభ్యుడు సురేంద్ర సింగ్ కూడా యూపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. అవినీతి అధికారులు రాష్ట్రంలోని ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని.. 2019 ఎన్నికలు వస్తోన్న తరుణంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి మంచి సందేశమని ఆయన పేర్కొన్నారు. సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టిన తర్వాత భాజపా గోరఖ్‌ఫూర్, పూల్పూర్‌తో సహా నాలుగు ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. తాజాగా నూర్పూర్, కైరానా స్థానాలను కూడా భాజపా కోల్పోయింది. కైరానాలో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ గెలుపొందగా.. నూర్పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి గెలుపొందాడు. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు ప్రాంతాల్లోనూ సీఎం యోగినే స్వయంగా ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.