YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గ‌ర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు అసాధార‌ణ తీర్పు

గ‌ర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు అసాధార‌ణ తీర్పు

న్యూఢిల్లీ ఏప్రిల్ 22
 గ‌ర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు అసాధార‌ణ తీర్పు ఇచ్చింది. అత్యాచారానికి గురై గ‌ర్భం దాల్చిన ఓ 14 ఏండ్ల బాలికకు సుప్రీంకోర్టు ఊర‌ట క‌ల్పించింది. దాదాపు 30 వారాల ఆమె గ‌ర్భాన్ని వైద్య‌ప‌రంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు అత్యున్న‌త న్యాయ‌స్థానం అనుమ‌తి ఇచ్చింది.వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ట‌కు చెందిన ఓ 14 ఏండ్ల బాలిక లైంగిక‌దాడికి గురై గ‌ర్భం దాల్చింది. కూతురు గ‌ర్భం దాల్చింద‌న్న విష‌యం త‌ల్లికి తెలియ‌డంతో, ఆమె బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న బిడ్డ 28 వారాల గ‌ర్భాన్ని తొల‌గిచేందుకు అనుమ‌తించాల‌ని ఏప్రిల్ మొద‌టి వారంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. బాంబే హైకోర్టు విచార‌ణ జ‌రిపి అబార్ష‌న్‌కు నిరాక‌రించింది. దీంతో బాలిక త‌ల్లి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఏప్రిల్ 4న కోర్టు కొట్టేసింది.బాంబే హైకోర్టు తీర్పుపై బాధితురాలి త‌ల్లి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ చేప‌ట్టిన కోర్టు.. ముంబైలోని సియాన్ ఆస్ప‌త్రి మెడిక‌ల్ బోర్డును నివేదిక కోరింది. గ‌ర్భ‌విచ్ఛిత్తిపై తీసుకునే నిర్ణ‌యం వ‌ల్ల బాలిక శారీర‌క‌, మాన‌సిక ప‌రిస్థితి ఎలా ఉండ‌నుందో చెప్పాల‌ని కోర్టు కోరింది. ఈ స‌మ‌యంలో అబార్ష‌న్ చేస్తే కొంత ప్ర‌మాదం ఉన్న‌ప్ప‌టికీ, కాన్పు త‌ర్వాత ఎదుర‌య్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువ కాదు. ఈ గ‌ర్బాన్ని కొన‌సాగించ‌డం వ‌ల్ల బాలిక‌పై శారీర‌కంగా, మాన‌సికంగా ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌ని మెడిక‌ల్ బోర్డు త‌న నివేదిక‌లో తెలిపింది.ఈ నివేదిక‌ను ప‌రిశీలించిన సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం బాలిక 30 వారాల గ‌ర్భ‌విచ్ఛిత్తికి అనుమ‌తించింది. ఈ కేసులో బాధిత బాలిక‌కు సంపూర్ణ న్యాయం అందించేందుకు రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 142 కింద ఉన్న విస్తృత అధికారాల‌తో ఈ తీర్పు వెలువ‌రిస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది. ఆ బాలిక‌కు త‌క్ష‌ణ‌మే వైద్య‌ప‌రంగా అబార్ష‌న్ చేయాల‌ని సియాన్ ఆస్ప‌త్రి డీన్‌ను కోర్టు ఆదేశించింది.మెడిక‌ల్ ట‌ర్మినేష‌న్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చ‌ట్టం ప్ర‌కారం.. వివాహిత మ‌హిళ‌లు, ప్ర‌త్యేక అవ‌స‌రాలున్న వారు, అత్యాచార బాధితులు 24 వారాల వ‌ర‌కు త‌మ గ‌ర్భాన్ని వైద్యుల సూచ‌న‌ల మేర‌కు అబార్ష‌న్ చేసుకునేందుకు అనుమ‌తి ఉంది. 24 వారాలు దాటితో కోర్టు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి.

Related Posts