విజయవాడ, ఏప్రిల్ 23
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీకి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ తరపున టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో భారీ జనసందోహం మధ్య టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు డాక్టర్ సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. మడకశిర పట్టణంలో భారీ సంఖ్యలో ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. తొలి విడత జాబితాలో మడకశిర నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ పేరును అధిష్టానం ప్రకటించింది. సునీల్ కుమార్ ను తప్పించి ఎంస్ రాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించారు. బీఫారంసైతం ఇచ్చారు.ఎంఎస్ రాజును అభ్యర్థిగా ప్రకటించడంతో సునీల్ కుమార్ అనుచరులు ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలను కాళ్లకింద వేసి తొక్కుతూ చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. నమ్మించి మోసం చేసిన మోసకారులు చంద్రబాబు, లోకేశ్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ ప్లెక్సీలను తగలబెట్టారు. ఎంఎస్ రాజు గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నాన్ లోకల్ ఎంఎస్ రాజు వద్దు.. లోకల్ సునీల్ ముద్దు అంటూ నినాదాలతో మడకశిర పట్టణం హోరెత్తింది. టీడీపీ రెబల్ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ నామినేషన్ కు భారీగా టీడీపీ అసమ్మతి శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు.ఏలూరు జిల్లాలోనూ టీడీపీని రెబల్ అభ్యర్థుల బెడద వేదిస్తోంది. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమికి రెబల్ అభ్యర్ధిగా టీడీపీ నేత మొడియం సూర్య చంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు