విశాఖపట్టణం, ఏప్రిల్ 23
ఈ ఎన్నికల్లో ప్రత్యేకమైన నేతల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. ఆయన ఏ స్థాయిలో లాబీయింగ్ చేసి భీమిలి సీటును పొందారో అందరికీ తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు సీట్లు మార్చే గంటా శ్రీనివాసరావుకు ఈసారి టిక్కెట్ డౌటేనని అందరూ భావించారు. చేస్తే చీపురుపల్లి నుంచి చెయ్.. లేకుంటే టిక్కెట్ లేదని చంద్రబాబు తేల్చినట్లు వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో గంటా వైసీపీలో చేరతారని కూడా ప్రచారం సాగింది. కానీ చివరి నిమిషంలో తాను ఆశించి, ఇష్టపడిన భీమిలి సీటును గంటా శ్రీనివాసరావు దక్కించుకున్నారు.అంతలా ఉంటుంది ఆయన మేనేజ్మెంట్. ఇప్పుడు భీమిలిలో గెలిచేందుకు అదే శక్తి యుక్తులను వినియోగిస్తున్నారు గంటా శ్రీనివాసరావు.ప్రస్తుతం భీమిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. అదే సమయంలో భీమిలి సీటును జనసేన ఆశించింది. ఈ నియోజకవర్గంలో జనసేన బలంగా కూడా ఉంది. గత ఎన్నికల్లో 20 వేలకు పైగా ఓట్లను సాధించింది. కూటమి కుదిరిన తర్వాత ఈ సీటు జనసేనకు కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ వ్యూహాత్మకంగా గంటా శ్రీనివాసరావు ఈ సీటును దక్కించుకున్నారు. దీంతో టీడీపీ తోపాటు జనసేన శ్రేణులను కొంతవరకు గంటా తనవైపు తిప్పుకున్నారు. అయితే చాలామంది మాత్రం ఆ రెండు పార్టీల్లో అసంతృప్తికి గురయ్యారు. అటువంటివారు వైసిపి వైపు మొగ్గు చూపారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ పై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. అటువంటివారు గంటా వైపు వచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీలో చేరిన వారి విషయంలో దక్కుతున్న ప్రచార ప్రాధాన్యత.. వైసీపీలో చేరిన వారి విషయంలో మాత్రం దక్కడం లేదు. ఇది వైసీపీకి తీరని లోటే.ప్రస్తుతం జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారు. దీంతో ఎక్కడికక్కడే జనసేన, టిడిపి ల నుంచి పెద్ద ఎత్తున నాయకులు చేరుతున్నారు. అందులో భాగంగా భీమిలి నియోజకవర్గం నుంచి జనసేన నియోజకవర్గ స్థాయి నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కానీ ఈ వార్తకు అంత ప్రాధాన్యం దక్కలేదు. కానీ అదే సమయంలో గంటా శ్రీనివాసరావు తన మాస్టర్ బ్రెయిన్ ను ఉపయోగించారు. నియోజకవర్గంలోని ఓ సర్పంచ్ వైసీపీ నుంచి టిడిపిలో చేరగా.. ఒక కథను క్రియేట్ చేశారు. భీమిలి పర్యటనలో ఉండగా జగన్ కు వలస పోటు అంటూ.. స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, ఆయన సోదరుడు వైసీపీని వీడొద్దు అంటూ బతిమలాడుకున్నా.. స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున టిడిపిలో చేరుతున్నారని పతాక శీర్షికన ఒక కథనం వచ్చింది. అదే సమయంలో నియోజకవర్గస్థాయి జనసేన నేతలు వైసీపీలో చేరినా ఆ వార్తకు ప్రాధాన్యం దక్కలేదు. ఒక విధంగా చెప్పాలంటే గంటా శ్రీనివాసరావు జగన్ కు షాక్ ఇచ్చినట్టే.