అనంతపురం, ఏప్రిల్ 23
ఏపీలో టీడీపీ కూటమికి మరో షాక్. హిందూపురం పార్లమెంటు సీటును ఆశించిన పరిపూర్ణానంద స్వామి గట్టి పట్టుదలతో ఉన్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానంతో పాటు అసెంబ్లీ సీటులో ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి హిందూపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి స్వామి పరిపూర్ణానంద గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. పొత్తులో భాగంగా టిక్కెట్ దక్కుతుందని.. ఎంపీ అవుతానని గట్టి నమ్మకంతో ఉండేవారు. కానీ ఆ సీటు టిడిపికి దక్కింది. ఆ పార్టీ బి కే పార్థసారధిని అభ్యర్థిగా ప్రకటించింది.ఈ తరుణంలో హిందూపురం లోక్సభ స్థానంతో పాటు అసెంబ్లీకి ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు స్వామి పరిపూర్ణానంద రెడీ అయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ అభ్యర్థుల మార్పు నేపథ్యంలో.. స్వామి పరిపూర్ణానంద చంద్రబాబును కలిశారు. దీంతో స్వామి టిడిపిలో చేరతారని గట్టిగానే ప్రచారం సాగింది. చాలా నియోజకవర్గాల్లో టిడిపి నేతలే బిజెపిలోకి వెళ్లి టిక్కెట్లు దక్కించుకుంటున్న నేపథ్యంలో… బిజెపిలో ఉన్న స్వామి పరిపూర్ణానంద టిడిపిలోకి వచ్చి హిందూపురం లోక్సభ సీటును తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబును కలిసి వెళ్లిపోయిన తర్వాత ఒక ఆసక్తికర పరిణామం వెలుగు చూసింది.గత 70 సంవత్సరాలుగా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని.. కనీసం మంచినీరు కూడా లేకుండా పోయిందని.. దానిని దక్కించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ సాయం అవసరం అని.. అందుకే బిజెపి ఎంపీ సీటును తనకు ఇప్పించాలని చంద్రబాబును స్వామి పరిపూర్ణానంద కోరినట్లు సమాచారం. తనకు ఎంపీ సీటు దక్కకుంటే మాత్రం ఈ ప్రాంత అభివృద్ధి కోసం తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి పొత్తులో భాగంగా కేటాయించారు. కానీ ఈ నియోజకవర్గ పరిధిలో ముస్లింల ఓటు బ్యాంక్ అధికం. పరిపూర్ణానంద స్వామి హిందూ భావజాలం ఉండడంతో ఇబ్బందులు వస్తాయని ఈ సీటును టిడిపికి ఇచ్చారు. ఇప్పుడు అదే పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెబుతుండడం.. నేరుగా చంద్రబాబుకు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం షాకింగ్ పరిణామమే.