అనంతపురం, ఏప్రిల్ 25
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగుతానని పరిపూర్ణానంద స్వామీజీ పలుమార్లు చెప్పారు. హిందూపురం బీజేపీ అభ్యర్థిగా తానే పోటీలో ఉన్నానని సైతం చెప్పారు. కానీ టిడిపి, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా హిందూపురం నుంచి పరిపూర్ణానంద స్వామి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. కానీ అనుకొని పరిణామాలతో హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి ఛాన్స్ ఇవ్వడంతో పరిపూర్ణానంద స్వామీజీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీజేపీ అధిష్టానంతో చర్చల అనంతరం తన రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని చెప్పిన పరిపూర్ణానంద స్వామీజీ హిందూపురం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ గత రెండు ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎలాగైనా నెగ్గి, హ్యాట్రిక్ కొట్టాలని బాలయ్య భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర దేవి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ ఓట్లు అడుగుతున్నారు. చంద్రబాబు హయాంలోనే హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటూ బాలకృష్ణ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతానని ఎమ్మెల్యే బాలకృష్ణ దీమా వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు వైసీపీ నెగ్గలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే హిందూపురంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈసారి ఎలాగైనా హిందూపురంలో వైసిపి జెండా ఎగరేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూపురం వైసీపీ అభ్యర్థిగా కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికా రెడ్డి ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలే తమను గెలిపిస్తాయని అభ్యర్థి దీపికా రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.హిందూపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలన్న ఆశలు గల్లంతు కావడంతో స్వామీజీ కీలక నిర్ణయం తీసుకున్నారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నేత బికే పార్థసారని కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పరిపూర్ణానంద స్వామీజీ హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గత ఆరు నెలలుగా హిందూపురం వ్యాప్తంగా స్వామీజీ తన ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నియోజకవర్గంలో హిందుత్వాన్ని బోధిస్తూ హిందూపురంలో యువతకు ఉపాధి కల్పించే దిశగా తాను కృషి చేస్తానంటూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ఇప్పటివరకు హిందూపురంలో తెలుగుదేశం, వైసిపి పార్టీల మధ్య ప్రధాన పోటీ అని అంతా అనుకున్నారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామీజీ నామినేషన్ వేయడంతో త్రిముఖ పోరు మొదలైంది. అయితే పరిపూర్ణానంద స్వామీజీ.. బాలకృష్ణ ఓట్లు చీల్చుతారా, లేక వైసీపీ వర్గీయుల ఓట్లు క్యాష్ చేసుకుంటారా అనేది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.