YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

62 వేల మంది వలంటీర్ల రాజీనామా కోర్టుకు చేరిన కథ

62 వేల మంది వలంటీర్ల రాజీనామా కోర్టుకు చేరిన  కథ

విజయవాడ, ఏప్రిల్ 25
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వాలంటీర్ల అంశం కీలకంగా మారింది. ఇప్పుడీ విషయం హైకోర్టుకు కూడా చేరింది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో వారిలో చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు. వారితో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో వారిని బూత్ ఏజెంట్లుగా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ హైకోర్టులో వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి.  వాదనల సందర్భంగా 62 వేల మంది వాలంటీర్లు ఇప్పటి వరకూ రాజీనామా చేశారని ఈసీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అలాగే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున 900 మంది వాలంటీర్లపై చర్యలు తీసుకున్నామన్నారు. రాజీనామా చేసిన  వాలంటీర్ల విషయంలో ఈసీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. రాజకీయ కారణాలతోనే  వాలంటీర్లతో రాజీనామాలు చేయిస్తున్నారని వారితో పార్టీ ప్రచారం చేయించుకుంటున్నందున రాజీనామాలను ఆమోదించుకండా చూడాలని పిటిషన్ తరపు న్యాయవాది కోరారు. అయితే రాజీనామాలు చేసిన వారిపై ఈసీకి ఎలాంటి అదుపు ఉండదని ఈసీ తరపు లాయర్ స్పష్టం  చేశారు. కానీ ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి సర్వాధికారాలు ఉంటాయని  పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై సమగ్రమైన అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఏపీలో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వారు అధికార పార్టీ కోసం పని చేస్తున్నారన్న ఆరోపణలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్లను బెదిరిస్తారన్న ఫిర్యాదులు వెళ్లడంతో వారి ద్వారా ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఓటర్లకు చేరకూడదని.. ఈసీ ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో వారి పనితీరును నిలువరించింది. వాలంటీర్లు అంతా వైసీపీ కార్యకర్తలేనని ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయిస్తున్నారు. వారిని ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవడంతో పాటు బూత్ ఏజెంట్లగా పెడతామని ప్రకటిస్తున్నారు.  వాలంటీర్లు ప్రతి యాభై ఇళ్లకు ఒకరు ఉంటారు. వారు బూత్ ఎజెంట్లుగా కూర్చుంటే.. ఓటు వేయడానికి వచ్చిన వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని.. ఓటర్లను బెదిరిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే వారిని పోలింగ్  బూత్ లలోకి వెళ్లకుండా నియంత్రించేందుకు ఇతర పార్టీలు న్యాయపోరాటం చేస్తున్నాయి.      

Related Posts