YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆస్తులు లెక్కలు.... షర్మిల సైలెన్స్ పై అనుమానాలు

ఆస్తులు లెక్కలు.... షర్మిల సైలెన్స్ పై అనుమానాలు

కడప, ఏప్రిల్ 25
సోదరుడు జగన్ను షర్మిల వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఆస్తి వివాదాలే. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తిని తనకు పంచలేదన్న బాధ ఆమెలో ఉంది. అన్న రాజకీయ ఉన్నతి కోసం ఎంతో బాధపడ్డానని.. కానీ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం మానేశారని జగన్ పై షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. రాజకీయంగా విభేదించడానికి అదే ప్రధాన కారణం. అయితే తాజాగా తన ఆఫిడవిట్లో అన్న, వదినల నుంచి అప్పు తీసుకున్నానని షర్మిల కొంత మొత్తాన్ని చూపడం వ్యూహంగా తెలుస్తోంది. ఆ అప్పులనే ఆస్తులుగా పరిగణించాలని జగన్ తేల్చి చెప్పి ఉండవచ్చు. అంతటితో సంతృప్తి పడాలని చెప్పి ఉండవచ్చు. అయితే షర్మిల మాత్రం మాటల్లో చెప్పలేని బాధను వ్యక్తం చేస్తున్నారు. తన పిల్లలకు ఏమీ ఇవ్వలేకపోయాను అన్న బాధ ఆమెలో కనిపిస్తోంది. అయితే ఆమె ముందు న్యాయపోరాటం ఆప్షన్ ఉంది. పిత్రార్జితంలో వాటా కూడా పొందే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ ఆమె న్యాయపోరాటానికి ముందుకు రాకపోవడం విశేషం.అయితే అన్నతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. చివరకు మేనల్లుడి వివాహానికి కూడా జగన్ వెళ్లలేని పరిస్థితికి అవి చేరుకున్నాయి. అయితే షర్మిల తాజా అఫిడవిట్లో అప్పుల వివరాలు ప్రస్తావించేసరికి వారి మధ్య ఆస్తి వివాదాలు మరోసారి ప్రస్తావనకు వచ్చాయి. అయితే షర్మిల ఇంతలా బాధపడే కంటే అన్న పై న్యాయపోరాటం చేస్తే న్యాయం జరిగేది. ఎన్టీఆర్ ఎప్పుడో ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పిస్తూ చట్టం తెచ్చారు. పిత్రార్జితంగా వచ్చిన ఆస్థిలో పిల్లలతో పాటు తల్లికి వాటా ఉంటుంది. అయితే వైయస్ ఆస్తులు ఏంటన్నది తెలియడం లేదు. సీఎం కాక మునుపు ఆయన హైదరాబాదులో ఇంటిని అమ్మకానికి చూపారు. కానీ ఆయన సీఎం అయిన తర్వాత కుమారుడు జగన్ రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున ఆస్తులు సమకూర్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఆస్తులు పిత్రార్జితం కింద రావు. ఇప్పుడు షర్మిల పడుతున్న బాధ అదే. అలా వైయస్ సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పుడు జగన్ చేతిలో ఉన్నాయి. అలాగని అవన్నీ పిత్రార్జితంగా చూపుతామంటే కాదు. జగన్ తనకు తానుగా ఉదార స్వభావంతో షర్మిలకు ఇస్తే ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ సోదరికి ఇచ్చిన అప్పులనే ఆస్తులుగా చూసుకోవాలని చెప్పినట్టు ఉన్నారు. ఒకవేళ అది అప్పులు అయి ఉంటే.. విభేదాలు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో ఏనాడో షర్మిల వాటిని తీర్చి ఉండేవారు కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.అయితే చాలా వరకు ఆస్తులను జగన్ సైతం తన అఫిడవిట్ లో చూపలేదు. లోటస్ పాండ్ ఎవరిది? తాడేపల్లి ప్యాలెస్ ఎవరిది? యలహంక ప్యాలెస్ ఎవరిది? బెంగళూరు మంత్రి మాల్ ఎవరిది? పులివెందుల, కడప నగరాల్లో భవనాలు ఎవరివి? అన్నది పొందుపరచలేదు. కానీ అవన్నీ అక్రమ మార్గంలో సమకూర్చుకున్నవన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే షర్మిల వాటిపై న్యాయపోరాటం చేయలేరు. పిత్రార్జితంగా చూపించలేరు. తన అన్న తనంతట తానుగా పంచి ఇస్తే మాత్రమే షర్మిల తీసుకోగలరు. కానీ జగన్ ఆ పని చేయడం లేదు. అందుకే రాజకీయంగా దెబ్బతీసి తన పంతాన్ని నెగ్గించుకోవాలన్న ఆలోచనలో షర్మిల ఉన్నారు. అంతకుమించి వేరే ఆలోచన కనిపించడం లేదు.

Related Posts