YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై త్వరలో ప్రత్యేక పాలసీ - మంత్రి కె.టి.ఆర్

ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై త్వరలో ప్రత్యేక పాలసీ - మంత్రి కె.టి.ఆర్
తెలంగాణ రాష్ట్రాన్ని పర్యావరణహిత రాష్ట్రంగా రూపొందించేందుకు త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని ప్రకటించనున్నట్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో గురువారం నిర్వహించిన పర్యావరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కె.టి.రామారావు హాజరయ్యారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యు.ఎన్.ఇ.పి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కె.టి.ఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఆర్టీసి, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాహనాల స్థానాల్లో దశలవారిగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతామని తెలిపారు. మొదటి దశలో 500ఎలక్ట్రిక్ వాహనాలను ఆర్టీసిలో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయడంతో పాటు అన్ని శాఖల్లో విధిగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేలా చేసేందుకు త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని రూపొందించనున్నామని వెల్లడించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఇతర రాష్ట్రాల కన్నా ముందంజలో ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో 3,300 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో దీనిని 5000 మెగావాట్లకు పెంచనున్నామని తెలిపారు. జల వనరుల పరిరక్షణ, హరితహారం ద్వారా గ్రీనరి పెంపొందించడం, వ్యర్థపదార్థాల నిర్వహణ, ద్రవ వ్యర్థాల నిర్వహణ తదితర చర్యల ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహిత నగరంగా రూపొందించేందుకు రూ. 540కోట్ల వ్యయంతో 40చెరువుల అభివృద్ది చేపట్టనున్నామని తెలిపారు. ఇప్పటికే నగరంలో 2,500 చెత్త తరలింపుకు స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టామని, 45లక్షల డస్ట్బిన్ల పంపిణీ, ఎలక్ట్రిక్ వాహనాల ప్రవేశం, ఎల్.ఇ.డి లైట్ల మార్పిడి, వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడం, జలం జీవంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణం, ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాధాన్యత తదితర కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరంలో సాంప్రదాయక 4.50లక్షల వీధిదీపాల స్థానంలో ఎల్.ఇ.డి లైట్లను ఏర్పాటు చేయడం ద్వారా సంవత్సరానికి 45శాతం విద్యుత్ బిల్లుల ఆదా చేస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే హైదరాబాద్ నగరం వ్యర్థపదార్థాల నిర్వహణలో అగ్రస్థానంలో వచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం జవహర్నగర్లో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తిచేసే ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని, దీంతో పాటు నగరానికి నలువైపులా ఈ చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జులై మాసాతంలో ఎల్బీనగర్ కారిడార్లో మెట్రోరైలు సేవలను ప్రారంభించనున్నామని, దీని అనంతరం హైటెక్ సిటీ మార్గంలో కూడా సాధ్యమైనంత త్వరగా మెట్రో రైలును ప్రారంభించనున్నట్టు కె.టి.రామారావు తెలిపారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణలో జీహెచ్ఎంసీ దాదాపు వందకుపైగా వినూత్న కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి ఇప్పటికే 50మైక్రాన్లకన్నా తక్కువ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేదించామని, దీంతో పాటు హైదరాబాద్లోని మటన్, చికెన్ దుకాణాల్లో ప్లాస్టిక్ నిషేదించి టిఫిన్ బాక్స్ లేదా జూట్ బ్యాగ్లను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వీటితో పాటు ప్లాగింగ్, బ్లాక్ బ్యాగ్ క్యాంపెన్ తదితర కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. 2022 సంవత్సరం నాటికి హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించేందుకు ప్రణాళికాబద్దంగా పనిచేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 20 ఎలక్ట్రిక్ వాహనాలను, 100 స్వచ్ఛ ఆటోలను ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యు.ఎన్.ఇ.పి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్, మంత్రి కె.టి.ఆర్, మేయర్ రామ్మోహన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయరెడ్డి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు భారతి హోలికేరి, ముషారఫ్ అలీ, ఇఇఎస్ఎల్ ప్రతినిధులు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
*పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రాధాన్యత - ప్రశంసించిన ఎరిక్ సోల్హెమ్
పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అద్బుతంగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యు.ఎన్.ఇ.పి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో 2022సంవత్సరంలోగా ప్లాస్టిక్ను పూర్తిగా నిషేదించడంపై పిపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరిక్ సోల్హెమ్ మాట్లాడుతూ పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ను నిషేదంపై గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. స్వచ్ఛ నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఎరిక్ సోల్హెమ్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలువడం హర్షనీయమని అన్నారు. హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కల పంపిణీ, వ్యర్థపదార్థాల నిర్వహణలో చేపట్టిన చర్యలు ఈ చారిత్రక, అందమైన హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరమైన నగరంగా రూపొందించేందుకు దోహదపడుతాయని అన్నారు. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడం వంటి చర్యలను ఆయన ప్రశంసించారు

Related Posts