YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ట్యూబ్‌ గ్యాస్!

ట్యూబ్‌ గ్యాస్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద కొన్ని వర్గాలకు ఉచితంగా, మరికొన్ని వర్గాలకు సబ్సిడీపై గ్యాస్‌ కనెక్షన్‌లు మంజూరు చేస్తున్నాయి. మొత్తంగా దేశంలో ప్రతి ఇంటికి గ్యాస్‌ సదుపాయం కల్పించాలన్నది కేంద్రప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యం సత్ఫలితాలనే ఇస్తోంది. కట్టెల పొయ్యితో నానాపాట్లు పడే వారు గ్యాస్ పొయ్యి ద్వారా సులువుగా వండివార్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇంట్లో గ్యాస్‌ అయిపోగానే మరో సిలిండర్‌ కోసం బుకింగ్‌ చేయడం.. ఏజెన్సీ వద్దకు వెళ్లడం... ఇంటికి చేరేవరకు నిరీక్షించడం లాంటి ఇబ్బందులు ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంత వాసులకు మరో సిలిండర్ కావాలంటే ఎదురుచూపులు తప్పని పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలో గొట్టాల ద్వారా నేరుగా ఇంటికే గ్యాస్‌ సరఫరా చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉంది. మరో రెండేళ్లలో దేశంలోని కోటి గృహాలకు గొట్టాల ద్వారా గ్యాస్‌ సరఫరా చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈక్రమంలో పెట్రోలియం, సహజ వాయువుల నియంత్రణ బోర్డు బిడ్లు ఆహ్వానించింది. తెలంగాణ జిల్లాల్లోనూ గొట్టాల ద్వారా గ్యాస్‌ సరఫరా చేయాలని నిర్ణయించింది.
 
గొట్టాల ద్వారా గ్యాస్ అందుకునే జిల్లాల్లో మెదక్ సైతం ఉంది. స్థానికంగా దాదాపు 2 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దీంతో జిల్లాకు గ్యాస్ అవసరం పెద్దగానే ఉంటుందని అంచనా. జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 2,19,392 కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం 1,55,917 గ్యాస్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. ఇక 71,775 పేద కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్‌ లేనట్టు అధికారులు గుర్తించారు. అర్హులైన వారందరి నుంచి కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ మంజూరు కోసం పౌర సరఫరాల శాఖ దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు ఆహారభద్రత, ఆధార్‌ కార్డుల ఆధారంగా విచారించిన రెవెన్యూ అధికారులు ఆయా మండలాల పరిధిలో మొత్తం 40,768 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారందరికి దీపం గ్యాస్‌ కనెక్షన్‌లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌లు మంజూరు చేసే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా పూర్తి స్థాయిలో మెదక్ జిల్లాకు గ్యాస్ కనెక్షన్లు లభిస్తే గ్యాస్ వినియోగం పెరుగుతుంది. మరి గొట్టాల ద్వారా వినియోగదారులకు గ్యాస్ అందించే విధానం మెదక్ లో ఎలా అమలవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Related Posts