YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

జోరుగా ఇసుక అక్రమ రవాణా

జోరుగా ఇసుక అక్రమ రవాణా
షార్ట్ టైమ్‌లో చేతినిండా డబ్బు అందడంతో పాటూ.. రూ.కోట్లు వెనకేసుకోవచ్చన్న దురాశతో పలువురు అక్రమార్కులు నదులను ధ్వంసంచేస్తున్నారు. నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇసుకను తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నారు. నింబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తూ అనతికాలంలోనే ధనవంతులై పోతున్నారు. నదులలోని ఇసుకను ఇష్టారాజ్యంగా తోడటంతో భూగర్భ జల మట్టాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. దీంతో పట్టణాల్లో, గ్రామాల్లో సాగు నీరు, తాగునీటి కొరత ఏర్పడుతోంది. ఈ దుష్ప్రభావాలు అక్రమార్కులకు తెలిసినా డబ్బుపై ఉన్న యావతో వారు ప్రకృతిని ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. కొందరైతే అధికారుల అండదండలతో ఇసుక అక్రమ రవాణాలో ఆరితేరిపోయారన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. వానలు కురుస్తుండడంతో ఈ దందా మరింత జోరందుకుందని స్థానికులు స్పష్టంచేస్తున్నారు. వానాకాలం ముదిరిపోకముందే.. వీలైనంత ఎక్కువగా ఇసుకను క్యాష్ చేసుకునేందుకు నదిని తవ్వేస్తున్నారని వాపోతున్నారు. భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులోని శివారు ప్రాంతంలో గోదావరి నది నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నారని చెప్తున్నారు
ఇసుక అక్రమ రావాణా పంట పొలాల్లోంచి కూడా సాగుతోంది. దీంతో రోడ్లే కాక పొలాలూ ధ్వంసమవుతున్నాయి. ఇసుక పేరుకుపోతుండడంతో రైతులు ఆవేదనలో కూరుకుపోతున్నారు. ఈ దందాను అడ్డుకున్నా అక్రమార్కులు దారికి రాని పరిస్థితి. దీంతో పొలాలు పాడవుతున్నా మిన్నకుండి చూడడం మినహా వారేమీ చేయలేకపోతున్నారు. ఇటీవల పట్టణంలో కొన్ని ప్రభుత్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇసుకను తరలించాలంటే ముందుగా అధికారుల వద్ద నుంచి అనుమతి తీసుకుని బ్యాంకులో డీడీ తీయాల్సి ఉంటుంది. డీడీ తీసిన కూపన్ల పేరిట అభివృద్ధి పనులకు కొన్ని ట్రిప్పులు మాత్రమే అందించాలి. అయితే నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమం సాగడంలేదన్న విమర్శలున్నాయి. ఆ కూపన్ల పేరుతో మిగతా ట్రిప్పుల ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే కూపన్‌పై ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇసుకను రావాణా చేస్తున్నా చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గోదావరి నదిలోని ఇసుకను రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు.  

Related Posts