విశాఖపట్టణం, ఏప్రిల్ 26
ఉత్తరాంధ్ర పై అన్ని పార్టీలు కన్నేశాయి. మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా చంద్రబాబుతో పాటు జగన్ ఉత్తరాంధ్ర పైనే ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ప్రజాగళం పేరిట సభలు నిర్వహిస్తుండగా.. జగన్ బస్సు యాత్రలో భాగంగా అన్ని నియోజకవర్గాలను టచ్ చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు పవన్ పాల్గొన్నారు.ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లను దక్కించుకునేందుకు అధికార విపక్షాలు ప్రయత్నించడం విశేషం. అందుకోసమే అటు చంద్రబాబుతో పాటు ఇటు జగన్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉత్తరాంధ్ర ఆ పార్టీని ఆదరిస్తూ వచ్చింది. ఒకవేళ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోయినప్పటికీ.. ఉత్తరాంధ్రలో మాత్రం టిడిపి తన ప్రాబల్యాన్ని నిలుపుకునేది. కానీ గత ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. 34 నియోజకవర్గాలకు గాను.. కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలుపొందింది. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాలతో సరిపుచ్చుకుంది. విజయనగరంలో వైసిపి వైట్ వాష్ చేసింది. అందుకే ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు నాలుగు అసెంబ్లీ సీట్లను, బిజెపికి రెండు స్థానాలను కేటాయించారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఈనెల 22 నుంచి ఏకంగా నాలుగు రోజులపాటు ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చంద్రబాబు. మరోవైపు పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో తలెత్తిన అసంతృప్తులను చల్లార్చే ప్రయత్నం చేశారు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు.జగన్ తన బస్సు యాత్రను ఉత్తరాంధ్రలో ముగించారు. రాష్ట్రవ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరిట నిర్వహిస్తున్న ఈ బస్సు యాత్ర.. ఉత్తరాంధ్రలో అడుగుపెట్టేసరికి రూపు మార్చింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర వెనుకబాటు, రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఉత్తరాంధ్రలో 28 స్థానాలు దక్కాయి. ఈసారి కూడా మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారు. అందుకే ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలతో పాటు అధికారంలోకి వస్తే తామేం చేయగలమో.. చెప్పుకొస్తున్నారు. విపక్షాల ట్రాప్ లో పడొద్దని ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే పార్టీ వెనుకబడి ఉందో అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నేతల మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా పావులు కదిపారు.34 నియోజకవర్గాల్లో ఫైట్ నడుస్తోంది. విశాఖ జిల్లాలో కూటమికి అనుకూల పరిస్థితులు కల్పిస్తుండగా.. విజయనగరంలో వైసీపీ ఆశాజనకంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే నువ్వా నేనా అన్న పరిస్థితి ఉంది. జనసేన గెలుపోటములను ప్రభావితం చేయనుంది.గత ఎన్నికల్లో దాదాపు మత్స్యకార ప్రాంతాల్లో జనసేనకు గణనీయంగా ఓట్లు పడ్డాయి. అక్కడ వైసీపీకి గెలుపునకు కారణమయ్యాయి. అందుకేఈసారి జనసేన ఓటు బ్యాంకు కలిసి వస్తుందని టిడిపి అంచనా వేస్తోంది. సంక్షేమ పథకాలే తమకు కలిసి వస్తాయని వైసిపి నమ్మకంగా ఉంది. మరి ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.