శ్రీకాకుళం, ఏప్రిల్ 27
శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో ఐదోసారి విజయం కోసం ధర్మాన కృష్ణ దాస్ ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో బగ్గు రమణమూర్తిపై కృష్ణదాస్ 19వేల ఓట్లతో గెలిచారు. 2014లో టీడీపీ తరపున గెలుపొందిన రమణ మూర్తి 2019లో ఓటమిపాలయ్యారు. తాజా ఎన్నికల్లో వైసీపీ తరపున ధర్మాన, టీడీపీ అభ్యర్థిగా రమణమూర్తి పోటీ చేస్తున్నారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
నరసన్న పేటకు జగన్ హామీలు:
నరసన్నపేట టౌన్ పరిధిలో ఆర్అండ్ బీ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ కు రూ.10 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మధ్యలోనే నిలిచిపోయిన విస్తరణ పనులకు మరో రూ.10కోట్లు అవసరమని ఆర్అం డ్ బీ శాఖ అధికారులు ప్రతిపాదించారు. సీఎం నిధులు ప్రకటించినా ఇంతవరకు రూపాయి మంజూరు కాలేదు.
మడపాం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.15 కోట్ల సాయం ప్రకటించారు. 1,653 ఎకరాలకు సాగునీటి వసతి అందించేందుకు మడపాం వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు గతంలో ప్రతిపాదించారు. ఇందుకు రూ.15 కోట్లు అవసరం. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభించలేదు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మార్పుతో అవి రద్దయ్యాయి.
నరసన్నపేట రాజుల చెరువు అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.50 లక్షలు మంజూరు చేసి పనులు చేపట్టారు. వైసీపీ హయంలో జగన్ రూ.10కోట్ల నిధులు ప్రకటించి ఏడాది దాటినా ఎలాంటి మార్పు లేదు.
గుడిపేట, కిరికి వద్ద రివర్స్ ఫ్లో ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్లు ఏర్పాటు బీ డీఎల్ పురం వద్ద లోలెవల్ కాజ్వే మంజూరుకు హామీ ఇచ్చారు. అవి నెరవేరలేదు.
బొంతు ఎత్తిపోతల పథకం మిగులు పనుల పూర్తికి రూ.40 కోట్లు ప్రకటించినా విడుదల కాలేదు.
జగన్నాథపురంతో పాటు పలు ప్రాంతాలకు తాగునీటి వసతులు కల్పిస్తామని ప్రకటించారు. నరసన్నపేటలోని జగన్నాథపురంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో అక్కడి ప్రజ లకు తాగునీటికి ఇబ్బందిలేకుండా చూస్తామని చెప్పినా ఇక్కడ తాగునీటి పథకం ఇంకా నిర్మాణదశలో ఉంది.
సారవకోట మండలంలోని రంగసాగరం ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. సారవకోట మండలం బొంతు ఎత్తిపోతల పథకం పెద్ద ప్రాజెక్టు. ఇది పూర్తయితే ఆ మండలమే కాక, చుట్టుపక్కల మండలాలకు సాగునీరందుతుంది. పథకం నిర్మాణ పనులు ఇప్పటికి 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
నరసన్నపేట నియోజకవర్గంలో సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు. వంశధార కాలువల ఆధునికీకరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. తంపర భూముల అభివృద్ధి ఆగిపోయింది. జలుమూరు మండలం లింగాలపాడు ఎత్తిపోతల పథకం అభివృద్ధి చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ సమస్యను పరిష్కరించలేదు.
ఎమ్మెల్యేపై ప్రధాన ఆరోపణలు…
ధర్మాన కృష్ణదాస్ కుటుంబంపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రెండున్నరేళ్ల కాలంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఎవరూ అవినీతికి పాల్పడవ ద్దంటూ చెబుతూనే ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అవినీతిలో మునిగిపోయారు.
మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంతో పాటు జిల్లాలో ప్రభుత్వ స్థలాల కబ్జాలకు సహకరించారనే విమర్శలు ఉన్నాయి.
నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ ధరకు తీసుకునేందుకు ప్రయ త్నాలు చేసినా వీలుకాలేదు.
మంత్రి భార్య ధర్మాన పద్మప్రియ, పెద్దకుమారుడు ధర్మాన రామలింగం నాయుడు మంత్రి తరపున చక్రం తిప్పుతుంటారు. పోలాకి మండలంలో ఓ క్వారీని నిర్వహిస్తున్నారు.
రెండో కుమారుడు కృష్ణచైతన్య కృష్ణ చైతన్యకు విశాఖ, శ్రీకాకుళంలో మెడికల్ ల్యాబ్‌లు ఉన్నాయి.
నరసన్నపేట పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ధర్మానకు చెందిన విల్లా ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థ లం కూడా ఆక్రమించుకున్నారు.
ప్రధాన సమస్యలు:
నరసన్నపేట మండలం:
నరసన్నపేట ప్రధాన రహదారి ఆధునీకరణ పనులు మధ్యలో నిలిచిపోయాయి. ప్రధాన రహదారి అభివృద్ధి, విస్తరణపై ఎమ్మెల్యే ఎన్నికల హామీగా చెప్పారు. కేవలం 30 శాతం పనులు మాత్రమే నిర్వహించినా నిధుల లేమితో మిగిలిన పనులు జరగలేదు. నాలుగున్నరేళ్లుగా ఈ రహదారి అభివృద్ధికి నోచుకోలేదు.
మడపాం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి సాగునీటి సమస్య తీరుస్తామని ఎన్నికల హామీలు ఇప్పటికీ నెర వేరలేదు. గతేడాది ముఖ్యమంత్రి మడపాం ఎత్తిపోతల పథకానికి రూ.15కోట్లు ప్రకటించినా ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. దీంతో సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
నరసన్నపేటలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు స్కిల్ డవలప్మెంట్ కళాశాల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు నీటి మీద రాతల్లా మిగిలాయి. ఇప్పటి వరకు కళా శాల ఏర్పాటు ఒక్క అడుగు ముందుకు పడలేదు.
రావులవలస గ్రామ రహదారి నిర్మాణానికి ప్రస్తుత ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు. దీనిని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధ్వాన రహదారితో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు.
సారవకోట మండలం:
హిరమండలం మండలం సిది నుంచి సారవకోట మండలం బొంతు కూడలి. పెద్దలంబ మీదుగా పాతపట్నం మండలం తెంబూరు వరకు ఉన్న 15 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధికి రూ. 25కోట్లు మంజూరయ్యాయి. గుత్తేదారు 10కిలోమీటర్ల పొడవున పనులు పూర్తి చేశారు. బిల్లు చెల్లింపులు లేకపోవడంతో పెద్దలంబ నుంచి తెంబూరు వరకు ఉన్న 5 కిలో మీటర్ల రోడ్డు పనులు చేపట్టకుండా గత మూడు నెలలుగా విడచిపెట్టేశారు. ఈ రోడ్డంతా గోతుల మయంగా మారడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
సారవకోట మండలం అలుదు నుంచి కోటబొమ్మాళి మండలం పాకివలస వరకు ఉన్న రోడ్డు అభివృ ద్ధికి రూ.15 కోట్లు, సారవకోట మండలం వడ్డినవలస నుంచి జలుమూరు మండలం కరకవలస వరకు ఉన్న రోడ్డు అభివృద్ధికి రూ.15కోట్లు మంజూరు కావడంతో 2.3.22న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేశారు. గుత్తేదారు పనులు ప్రారంభించి కల్వర్టుల నిర్మాణ పనులు పూర్తి చేశారు. బిల్లు చెల్లింపులు లేక గత ఆరు నెలలుగా పనులు నిలిపేశారు. అరకొర పనులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
బైదలాపురం గ్రామం వద్ద వంశధార ఎడమ కాలువపై వంతెన 2020లో కూలిపోయింది. ఈ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రూ.1.33 కోట్లు మంజూరు చేసింది. నేటికీ టెండరు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.
జలుమూరు మండలం:
శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రం అభివృద్ధికి రూ.55 కోట్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. గత ప్రభుత్వం సమయంలో మాస్టరు ప్లాన్ కింద చేపట్టిన మాఢ వీధుల పనులు ముందుకు సాగలేదు.
తలతరియా ప్రాంతానికి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి చాలావరకు పనులు చేపట్టింది. ప్రభుత్వం మారిన తర్వాత పనులు ముందుకు సాగ లేదు. దీంతో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
తాజా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ధర్మాన కృష్ణదాస్, టీడీపీ తరపున బగ్గు రమణమూర్తి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.