మొత్తమ్మీద నరేంద్రమోడీ,అమిత్ షా ల నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీని ఓడించగలమన్న మనోస్థైర్యం విపక్షాలకు ఏర్పడింది. పాన్ ఇండియా ప్రాతిపదికన ఉప ఎన్నికల ఫలితాలు కల్పించిన భరోసా ఇది. అంతా కలిసి సాధించామని బహిరంగంగా బాగానే చెబుతున్నారు. జబ్బలు చరుచుకుంటున్నారు. కానీ కలిసికట్టుగా 2019 ఎన్నికలకు వెళ్లగలిగే అంశంపై నమ్మకం వెలిబుచ్చలేకపోతున్నారు.ప్రీపోల్ పొత్తు లేదా పరస్పరం సహకరించుకోవడం ద్వారా బీజేపీని బలమైన రాష్ట్రాల్లో సైతం నిలువరించవచ్చు. ఉత్తరప్రదేశ్, బిహార్ ల ఉప ఎన్నికలు దీనినే చాటిచెప్పాయి. బీజేపీ డీలా పడిపోయింది. తాజా ఫలితాలు విపక్షాల్లో అతివిశ్వాసానికి దారితీసే అవకాశం ఉంది. కలిస్తేనే గెలుస్తామన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. కానీ దీనికి ఎవరు నేతృత్వం వహించాలి. ప్రధాని అభ్యర్థి సంగతేమిటన్న అంశాల్లో తీవ్ర విభేదాలు తొంగి చూస్తున్నాయి. విపక్షాల్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెసు. 2019 ఎన్నికల తర్వాత సైతం అదే పెద్ద పార్టీగా నిలుస్తుంది. ఇందులో ఎవరికీ సందేహాలు లేవు. కానీ దాని నాయకత్వ పటిమపై మాత్రం విశ్వాసం నెలకొనడం లేదు. ఈ అంశమే ప్రీ పోల్ అలయన్స్ కు ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. విడిగా వెళ్లి పోస్టు పోల్ అలయన్స్ పెట్టుకుందాం అనేది కొన్ని పార్టీల యోచన. ఇది ఓట్ల చీలికకు దారితీస్తుంది. బీజేపీకి లాభసాటిగా మారుతుంది. దీనికి అనేక రాజీలు, సర్దుబాట్లు , సమన్వయాలు అవసరం. ఇందుకు తిమ్మినిబమ్మి చేయగల, అందరినీ సముదాయించగల సమర్థ సారథి కావాలి. సీజన్డ్ పొలిటీషయన్ మాత్రమే కాకుండా పెద్దరికం వహించగల సీనియర్ అయి ఉండాలి. ముఖ్యంగా తాను పదవి ఆశించకుండా అందరినీ కలుపుకుని పోగల చతురుడై ఉండాలి. తలలో నాలుకలా ఉంటూనే తల ఎగరవేసే వాళ్లను కంట్రోల్ చేయగల సామర్థ్యం అవసరం. ప్రస్తుతమున్న పరిస్థితులలో అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా?వచ్చే ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయడానికి శివసేన తనవంతు కృషి చేస్తుంది. అది ఖాయం. ఇక్కడ కాంగ్రెసు, ఎన్సీపీకి రూట్ క్లియర్ అవుతుందనే భావిస్తున్నారు. విడివిడిగా మాత్రం కష్టం. ఎన్సీపీ అధినేత శరద్ పవర్ కు పెద్ద ఆశలే ఉన్నాయి. ప్రధాని పదవికి అనుభవం రీత్యా ఆయనే అర్హుడనేది సొంత పార్టీ వర్గాల భావన. మరాఠా గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అభ్యర్థిత్వానికి శివసేన వత్తాసు పలికే అవకాశం ఉంది. ఆర్థికంగా పరిపుష్టమైన రాష్ట్రమే కాకుండా ఉత్తరదక్షిణాలకు బ్యాలెన్సింగ్ ఫాక్టర్ గా మహారాష్ట్రను చూడవచ్చు. కాంగ్రెసు అధినేత్రితోనూ పవార్ కు సత్సంబంధాలే ఉన్నాయి. కానీ విపక్షాలను ఒకే గొడుగు కిందకు తెచ్చినడిపేంతటి చాకచక్యమూ, సహనమూ లేవనేది ఆయనపై విమర్శ. తాను కచ్చితంగా ప్రధాని రేసులో ఉంటానని భావిస్తే మాత్రమే పవార్ విపక్షాలను కలిపే ఫ్రంట్ పట్ల మొగ్గు చూపుతారనేది రాజకీయ వర్గాల అంచనా. ప్రతి సందర్బంలోనూ దళిత్ కార్డును వాడుకోవడంలో మాయావతి దిట్ట. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీల మధ్య అవగాహన చాలా కీలకం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా నిరోధించాలంటే ఈరెండు పార్టీలు పొత్తు పెట్టుకోకతప్పదు. రాజీ ఫార్ములాగా ఉత్తరప్రదేశ్ లో పవర్ పగ్గాలు ఎస్పీకి అప్పగించి, తనను దళిత మహిళగా ప్రధాని రేసులో నిలబెడతానంటే మాయా అంగీకరించవచ్చు. ములాయం సింగ్ కు ఆశలు ఉన్నప్పటికీ తనయుడు అఖిలేశ్ ఇప్పటికే ఆయనను పక్కనపెట్టేశారు. ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ కి ప్రధాని పదవిపై ఆశలు పెరుగుతున్నట్లుగా తాజా పరిశీలన. పెద్ద రాష్ట్రమైన పశ్చిమబంగ లో అధికారాన్ని స్థిరపరుచుకున్న మమత తన దృష్టిని జాతీయ తెరపైకి సారిస్తున్నారు. ఫెడరల్, సెక్యులర్, థర్డ్, యూపీఏ ఫ్రంట్.. అన్నిటి పట్లా మమత సానుకూల థృక్పథాన్ని కనబర్చడంలోని మర్మమిదే నంటున్నారు. అయితే మమతలో కనిపించే అసహనం, ఆధిపత్య ధోరణి సారథ్యానికి పనికిరాదనేది రాజకీయ పార్టీల భావన.యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా వ్యవహరించి ఎన్డీఏలోనూ కీలకపాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు సైతం జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. తెలుగుదేశం 2019 ఎన్నికల్లో కీలకంగా మారుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల సారాంశమదేనంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ప్రాంతీయ పార్టీల్లో చక్రం తిప్పుతున్న నాయకులందరితోనూ పరిచయాలున్నాయి. అందర్నీ కలుపుకుని పోవడం, అనునయించడం, సంప్రతింపులు, సర్దుబాట్ల వ్యవహారాల్లో చంద్రబాబు దిట్ట. గతంలో అవకాశాలున్నప్పటికీ ప్రధాని పదవిని క్లెయిం చేయకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశం. కానీపక్కలో బల్లెంలో మారుతున్నారు కేసీఆర్. అన్నిపార్టీలు చేతులెత్తేసిన స్థితిలో ముందుగా మూడో ఫ్రంట్ రాగం ఎత్తుకున్నది కేసీఆర్. చంద్రబాబు నాయకత్వాన్ని ఆయన అంగీకరించకపోవచ్చు. పైపెచ్చు ఫ్రంట్ ఏదైనప్పటికీ చివరికి కాంగ్రెసు సహకారం తప్పదని మెజార్టీ నాయకులు పరోక్ష సంభాషణల్లో చెబుతున్నారు. దీనికి కేసీఆర్ ససేమిరా అంటున్నారు. మొత్తమ్మీద యూపీఏ ని విస్తరించుకోవడం, లేదా దాని స్థానంలో ప్రాంతీయ పక్షాల కూటమిని నెలకొల్పడం అత్యవసరంగా కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా అందరికీ ఆమోదయోగ్యమైన సారథిని పట్టుకోవడం తలకుమించిన భారంగా మారింది . అదే విపక్షాలకు శాపం. బీజేపీకి వరం.