విజయవాడ, కడప, ఏప్రిల్ 27,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆయన ఆకస్మిక మరణంతో అప్పటికే ఎంపీగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారసుడిగా తెరపైకి వచ్చారు. ఆయనను గుర్తించినా సీఎం పదవిని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. చాలా మంది సీనియర్లు ఉన్నందున ఉన్న పళంగా సీఎం పదవి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో ఎమ్మెల్యేలంతా సానుకూలంగా ఉన్నా సరే హైకమాండ్ అంగీకరించలేదు. కారణం ఏదైనా కాంగ్రెస్ లో భవిష్యత్ ఉండదని డిసైడ్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట కుటుంబం మొత్తం ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కొనసాగినా.. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసినా తర్వాత జగన్ దగ్గరకే చేరుకున్నారు. వైఎస్ కుటుంబం అంతా ఏకగ్రీవంగా వైఎస్ జగన్ ను వైఎస్ఆర్ తరహాలో రాజకీయ వారసుడిగా అంగీకరించింది. ఆయననే కుటుంబపెద్దగా భావించడం ప్రారంభించింది. కానీ ఎప్పుడైతే వివేకానందరెడ్డి హత్య జరిగిందో అప్పట్నుంచి కథే మారిపోయింది.జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వెంట కుటుంబం అంతా ఉంది. ఆయన ఏ నినాదం అందుకుంటే దాన్నే ప్రజలకు చెప్పారు. వైఎస్ మరణం వెనుక సోనియా ఉందని ఆరోపిస్తే అదే చేశారు. వైఎస్ మరణం వెనుక రిలయన్స్ ఉందంటే అదే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని అంటే అదే చెప్పారు. జగన్ కేసుల పాలయితే ఆయనకు అండగా ఉన్నారు. షర్మిల మూడు వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. ఇలా ఏకతాటిపైకి ఉన్న వైఎస్ ఫ్యామిలీలో వివాదాలు ఎప్పుడూ బయటపడలేదు. వైఎస్ హయాంలో ఉన్నంతే ఐక్యంగా ఉందనుకునేవారు. కానీ కుటుంబం అంతా కష్టపడి వైసీపీని అధికారంలోకి తెచ్చిన తర్వాత .. జగన్ సీఎం అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేంద్రంగా పూర్తిగా చీలిపోయింది. వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపక వివాదాలు చోటు చేసుకోవడంతో అవి పెరిగిపోయాయి. అవి ఎంత పెరిగిపోయాయంటే ఇక ముందు కలుసుకోలేనంతగా పెరిగిపోయాయి. సొంత మేనల్లుడి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి దంపతులు వెళ్లలేదు. తల్లి తర్వాత మేనమామేనే బాధ్యతలు తీసుకోవాలని చెబుతారు. కానీ రాజకీయంగా.. ఆస్తుల వివాదాలతో వచ్చిన గొడవల కారణంగా ఈ బంధాల్ని జగన్ కాదనుకున్నారు. ఫలితంగా గ్యాప్ పెరిగిపోయింది. వైసీపీ కోసం ప్రత్యక్షంగా పోరాటాలు చేసిన షర్మిల ఎప్పుడూ ఎన్నికల బరిలో దిగాలని అనుకోలేదు. పదవి కోసం ప్రయత్నించారని కూడా ఎప్పుడూ ప్రచారం జరగలేదు. కానీ రాజకీయంగా ఎంతో కష్టపడిన షర్మిల తనకు ప్రాదాన్యం కావాలని కోరుకున్నారు. కానీ ఆమె ఆకాంక్షల్ని జగన్ గుర్తించలేదు. కడప లోక్ సభ సీటు లేదా రాజ్యసభ సీటు ఇవ్వడానికి సిద్ధపడలేదు. అదే సమయంలో ఆస్తులు పంచడానికి కూడా నిరాకరించారు. చివరికి ఏమనుకున్నారో కానీ తాను సొంత పార్టీ పెట్టుకోవాలని డిసైడయ్యారు. అయితే ఏపీలో కాకుండా తెలంగాణలో పెట్టుకున్నారు. అక్కడ ఏ మాత్రం క్లిక్కయ్యే అవకాశం లేకపోవడంతో ఏపీలో అడుగు పెట్టారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. ఏపీ పీసీసీ బాధ్యతలు తీసుకున్నారు. ఇది వైసీపీ అధినేత జగన్ కు మరింత కోపం తెప్పించింది. ఆమె పార్టీ పెడితే నష్టం జరిగేది తనకేనని అర్థం కావడంతో ఇతర పార్టీల నేతల మాదిరిగానే ఆమెను టార్గెట్ చేయడం ప్రారంభించారు. అదే వివాదాస్పదమవుతోంది. ఆమె చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తున్నారని ఆరోపిస్తూ రాజకీయంగా కార్నర్ చేస్తున్నారు. కానీ షర్మిల మాత్రం ధీటుగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. షర్మిల నిన్నటి వరకూ జగన్ కు సోదరి ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ నేత. ఇక బంధులెక్కడ ఉంటాయని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విశాఖలో వ్యాఖ్యానించారు. దానికి కారణం సోదరుడు అయిన జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పసుపు చీర కట్టుకున్నారని నిందిచడం. అలాంటి వారు వైఎస్ వారసులు ఎలా అవుతారని జగన్ పులివెందుల ప్రజల్ని ప్రశ్నించారు. సోదరి కట్టుకున్న చీర గురించి మాట్లాడటం వివాదాస్పదమయింది. షర్మిల కూడా జగన్ ది గుండెనా ..బండనా అని గట్టిగా ప్రశ్నించారు. సీబీఐ చార్జిషీట్‌లో తాను తప్పించుకోవడానికి తండ్రి వైఎస్ఆర్ పేరును పెట్టించింది జగనేనని ..ఆయన ఎలా వారసుడు అవుతారని షర్మిల ప్రశ్న. వైఎస్ షర్మిల ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు కడప నుంచే బరిలోకి దిగుతున్నారు. న్యాయం చేయమని కొంగుచాపి ఓట్లు అడుగుతున్నారు. వైసీపీ తరపున అవినాష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ అభ్యర్థి అవినాష్ రెడ్డి కాదు తానే అన్నంతగా జగన్ ఆయనను సపోర్ట్ చేస్తున్నారు. చెల్లెలు షర్మిల కన్నా అవినాష్ రెడ్డి తనకు దగ్గర అని పులివెందుల సభలో చెప్పకనే చెప్పారు. అంటే ఇప్పుడు కడప బరిలో జగన్ వర్సెస్ షర్మిల పోటీ అనుకోవచ్చు. ఇప్పటి వరకూ కడప ప్రజలంతా వైఎస్ రాజకీయ వారసుడిగా జగన్మోహన్ రెడ్డినే గుర్తించారు. వారికి మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే కుటుంబం అంతా ఏకతాటిపైన ఉంది. కానీ ఇప్పుడు కుటుంబం రెండు రకాలుగా చీలిపోయింది. కుటుంబం చీలిపోయినట్లుగా ప్రజలు కూడా ఇప్పుడు జగన్ లేదా షర్మిల ఎవరో ఒకరి వైపు నిలబడాల్సి ఉంది. షర్మిల గెలవకపోయినా గట్టి పోటీ ఇచ్చినా ఆమె వైఎస్ రాజకీయ వారసత్వం చేపట్టడానికి గట్టి పోటీదారుగానే భావిస్తారు. అదే జరిగితే ఆ రాజకీయ వారసత్వ పోరాటం రాష్ట్రం మొత్తం విస్తరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాన్ని అనుభవిస్తే ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో వైఎస్ కు తానే రాజకీయ వారసుడ్నని నిరూపించుకోవడం కూడా ఒకటి.