ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారా? ప్రధాని నరేంద్ర మోడీని దీటుగా ఎదుర్కొనేందుకు ఆయన పావులు సిద్ధం చేసుకుంటున్నారా? అంటే తాజా పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. ఇటవల మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను కేజ్రీవాల్ ప్రశంసించారు.మన్మోహన్ లాంటి ప్రధానిని ప్రజలు కోల్పోయారని ఆయన ట్విటర్ లో వ్యాఖ్యానించడం తీవ్రస్థాయిలో సంచలనం రేపింది. మళ్లీ అలాంటి ప్రధానినే ప్రజలు కోరుకుంటున్నారని, దేశ ప్రధాన మంత్రి కచ్చితంగా విద్యావంతుడై ఉండాలని కూడా కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం మరింతగా రాజకీయాల్లో మంటలు రేపింది. కేజ్రీవాల్ గతంలోనే కాంగ్రెస్‌తో కలిసి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది ఎక్కువ కాలం నిలబడలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఢిల్లీ సీఎం అయ్యారు. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం ఢిల్లీలో నియంతృత్వ ధోరణితో వెళుతుండడంతో పాటు ప్రతి చిన్న పనిలోనూ తీవ్రమైన జోక్యం చేసుకోవడంతో కేజ్రీవాల్ విసిగిపోయారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌కు దగ్గరవుతుండడం విశేషం. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా స్వపక్షాలతో పాటు విపక్షాలు కూడా ఏకమవుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ సీఎం లాంటి న్యూట్రల్ పర్సన్స్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జతకడితే ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బే. ప్రధాని నరేంద్ర మోడీ పెద్దగా ఏమీ చదువుకోలేదని, ఆయన చెబుతున్న డిగ్రీలన్నీ బూటకమేనని గతంలో ఇదే పార్టీ నేతలు భారీగా ఆరోపించారు. తాజాగా కేజ్రీ చేసిన ట్వీట్ మరింతగా మంటలను రాజేసింది. తాజా ట్వీట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించిన కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నట్టుగానే అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం సహా నరేంద్ర మోడీ వ్యవహారంతో కేజ్రీవాల్ పూర్తిగా విసిగిపోతున్నారు. ఏం మాట్లాడినా కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావాలు వేస్తున్నారు బీజేపీ నాయకులు.ఇటీవల కాలంలో రెండు సార్లు.. సీబీఐ అధికారులు కేజ్రీవాల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మోడీ తనపై కక్షగట్టి.. ఇలా వ్యవహరిస్తున్నారంటూ.. కేజ్రీవాల్ ఆరోపించారు. అంతేకాదు, లెఫ్టినెంట్ గవర్నర్ కూడా తన ప్రభుత్వంపై దూకుడు పెంచారని చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చర్చలకని పిలిచి చేయి చేసుకున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై స్వయంగా ప్రధాన కార్యదర్శే ఫిర్యాదు చేశారు. అయితే, ఇలాంటి ఏవీ జరగలేదని, కేవలం తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మోడీ.. బీజేపీ నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.మొత్తంగా ఈ పరిణామాల నేపథ్యంలో మోడీకి వ్యతిరేకంగా వచ్చే ఏ పార్టీకైనా తాము మద్దతిస్తామని ఎప్పటి నుంచో కేజ్రీవాల్ ప్రకటిస్తున్నారు. తాజాగా ఆయన కర్ణాటకలో జరగిన ఫెడరల్ ఫ్రెంట్ కూటమి అనధికార సమావేశానికి కూడా హాజరయ్యారు. తమ మద్దతు ఉంటుందని ప్రచారం చేశారు. మొత్తానికి దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి.. కేజ్రీవాల్ తన దైన శైలిలో కాంగ్రెస్‌కు దగ్గరయ్యే అవకాశం మెండుగా ఉందని చెబుతన్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.