YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎమ్మెల్యే గిరే కావాలి... డీసీసీ వద్దు

ఎమ్మెల్యే గిరే కావాలి... డీసీసీ వద్దు
వామ్మో ఆ పదవులు మాకొద్దంటున్నారు కాంగ్రెస్ నేతలు. డీసీసీ అధ్యక్షులుగా ఉంటే వారికి టిక్కెట్లు ఇచ్చే సంప్రదాయం కాంగ్రెస్ లో లేదు. ఇదే ప్రచారం గత కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే తాజాగా డీసీసీ అధ్యక్షులను ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు. ఇటీవల ఏఐసీసీ డీసీసీ అధ్యక్షుల జాబితాను ప్రకటించారు. ఖమ్మం మినహా మిగిలిన అన్ని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. తెలంగాణలో ఇటీవల కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. కాని డీసీసీఅధ్యక్షుల నియామకం మాత్రం పాత జిల్లాలనే ప్రాతిపదికగా తీసుకుని నియమించారు.డీసీసీ అధ్యక్షులుగా ఉంటే వారికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వరని, వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సి ఉంటుందని, జిల్లాలో ఉన్న నేతలందరినీ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది కనుక వారిని ఒక నియోజకవర్గానికి పరిమితం చేయలేమని చెబుతోంది అధిష్టానం. అయితే ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుల జాబితాను పరిశీలిస్తే అందులో చాలా మంది గెలుపు గుర్రాలే కావడం విశేషం. బలమైన నాయకులను పోటీకి దూరంగా ఉంచుతారా? లేక నిబంధనను గట్టు మీద పెడతారా? అన్నది కూడా గాంధీభవన్ లో హాట్ టాపిక్ అయింది.ఇటీవల ప్రకటించిన జాబితాను పరిశీలిస్తే దాదాపు అందరూ పాతవారికే అవకాశమిచ్చారు. గతంలో ఉన్నవారినే ఎక్కువమందిని డీసీసీ అధ్యక్షులుగా కొనసాగిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా కొనసాగిన వారిలో ఒబెదుల్లా కొత్వాల్ (మహబూబ్ నగర్), బూడిద బిక్షమయ్య గౌడ్ (నల్లగొండ), రాజేందర్ రెడ్డి (వరంగల్), తాహెర్బిన్ అహ్మద్ (నిజామాబాద్), సునీతా లక్ష్మారెడ్డి (మెదక్), మహేశ్వర్ రెడ్డి (ఆదిలాబాద్) మృత్యుంజయం (కరీంనగర్) లు ఉన్నారు. కొత్తగా హైదరాబాద్ సిటీ అధ్యక్షులుగా దానం నాగేందర్ స్థానంలో అంజనీకుమార్ యాదవ్ ను నియమించారు.ఖమ్మం జిల్లాలో మాత్రం డీసీసీ అధ్యక్షుడి నియామకం జరగలేదు. జిల్లా నేతల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనే ఈ నియామకం జరగలేదని చెబుతున్నారు. రేణుకచౌదరి, భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి వారితో తెలంగాణ పార్టీ ఇన్ ఛార్జి కుంతియా పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో దీనిని పెండింగ్ లో పెట్టారు. అయితే కొందరు డీసీసీ అధ్యక్షులు పదవి తీసుకునేందుకు వెనడుగు వేస్తున్నారు. తమకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని హామీ ఇస్తేనే పదవులు చేపడతామని చెబుతున్నారు. మరికొందరు మాత్రం తమకు గాక టిక్కెట్ ఎవరికి దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం జిల్లా స్థాయిలో పార్టీ నేతలను నియమించినా నేతలు మాత్రం బాధ్యతలను తీసుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.

Related Posts