ఉత్తర, దక్షిణ తేడా లేదు. సొంత రాష్ట్రాలు, తనతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రతిపక్ష సర్కారులు అన్న వ్యత్యాసం లేదు. అన్నిటా ఒకే సందేశం. 2019 ఎన్నికలకు ముందస్తు సంకేతం. కమలం పార్టీ కాన్ఫిడెన్సుకు గండి కొట్టేలా ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రతిపక్షాలన్నీ సంఘటితమవుతూ ఐక్యతారాగం ఆలాపిస్తున్న దృశ్యం ఈ ఉపఎన్నికలతో స్పష్టమైపోయింది. బీజేపీ సొంత ఓట్లను భారీగా కోల్పోతున్న వైనమూ వెల్లడైంది. దానికి మిత్రపక్షాలు క్రమేపీ దూరమవుతున్న సూచనలూ తేటతెల్లమైపోయాయి. నిజానికి ఉప ఎన్నికలంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా స్థానికంగా అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా చాలావరకూ ఓటరు తీర్పులు వచ్చేస్తుంటాయి. కానీ ఇప్పటి ఉప ఎన్నికలు స్పెషల్. నాలుగు లోక్ సభ స్థానాలతోపాటు 11 శాసనసభస్థానాల్లో ప్రజాతీర్పు వచ్చింది. దేశంలోని ఓటరు నాడిని పట్టుకునేందుకు వీలుగా అనేక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, కాంగ్రెసు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ప్రాంతీయపార్టీలు అధీనంలో ఉన్న రాష్ట్రాలు, సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్న రాష్ట్రాలు ఇలా భిన్నమైన సమ్మేళనాలతో కూడిన వైవిధ్యం ఈ ఎన్నికల్లో దాగి ఉంది. అటు బీహార్, యూపీ, పంజాబ్, పశ్చిమబంగ, జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి ఇటు కేరళ, కర్ణాటక వరకూ ఓటరు నాడిని పట్టుకునేందుకు వీలు చిక్కింది.ఉత్తరప్రదేశ్ , బీహార్ లలోని 120 స్థానాలకు 104స్థానాల్లో 2014లో కాషాయజెండా రెపరెపలాడింది. అత్యంత కీలకమైన ఈ రాష్ట్రాల్లో బీజేపీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అందులోనూ యూపీలో అప్రతిహత విజయం. 80 సీట్లకు 71 స్థానాల్లో బీజేపీ ,2 సీట్లలో మిత్రపక్షం గెలిచాయి. ఆతర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింట మూడొంతుల పైగా ఆదిక్యంలో 325 అసెంబ్లీ స్థానాలు కమలవశమయ్యాయి. అటువంటి రాష్ట్రంలో గడచిన ఆరునెలలుగా వరసగా అపశకునాలు. ముఖ్యమంత్రి , ఉపముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్, పూల్పూర్ లోక్సభసీట్లలో ఓటమి. ఇప్పుడు ఖైరానాలో మూడో ఓటమి. ఈ మూడు సీట్లూ బీజేపీవే. ఈపరాజయాలు ఇక్కడికే పరిమితం కాదంటున్నారు. యూపీ అంతటా వ్యతిరేక గాలివీస్తోందంటున్నారు పరిశీలకులు. గోరఖ్ పూర్, పూల్ పూర్ తూర్పు యూపీలో ఉన్నాయి. తాజాగా కోల్పోయిన ఖైరానా పశ్చిమ యూపీలో ఉంది. గతంలో ఎస్పీ,బీఎస్పీలు ఏకమై బీజేపీని ఓడించాయి. ఇప్పుడు వాటికి ఆర్ఎల్ డీ, కాంగ్రెసు జతకూడాయి. గతంలో ఖైరానాలో 51 శాతం వరకూ ఓట్లు తెచ్చుకోగలిగింది బీజేపీ. అంటే అన్ని పక్షాలూ ఏకమైనా గెలిచేంత ఆధిక్యత. కానీ ఇప్పుడదంతా ఆవిరైపోయి ఓటమి పాలైంది. విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. బీజేపీ ఒంటరైపోతోంది.బీజేపీతో కూడిన సంకీర్ణ సర్కారులూ విజయం సాధించలేకపోతున్నాయి. దాని మిత్రపక్షాలు కూడా కలిసినడిచేందుకు భవిష్యత్తులో సాహసించకపోవచ్చునంటున్నారు. బీజేపీకి ఇక దేశంలో ఎదురులేదనే ఉద్దేశంతో జేడీయూ నేత నితీశ్ బీహార్ లో మోడీతో చేతులు కలిపారు. ఈ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ నేత్రుత్వంలోని ఆర్జెడీ బలపడుతుంటే జేడీయూ బలహీన పడుతోంది. గత రెండు ఉప ఎన్నికలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. జేడీయూ స్థానమొకటి ఆర్జెడీ కిట్టీలో పడింది. ఇక సంకీర్ణ సర్కారులో భాగస్వాములైనప్పటికీ శివసేన, బీజేపీ మహారాష్ట్రలో పరస్పరం తలపడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే దూరమైపోయింది. శివసేన 2019లో కలిసి పోటీ చేసే అవకాశాలు అంతంతమాత్రమే. అకాలీదళ్ తోనూ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకున్న అవసరార్థ పొత్తులు సైతం ఒడిదుడుకుల్లో సాగుతున్నాయి. కేంద్రంలో అధికార స్థానం బలహీనపడుతోందని తెలిసిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో పొత్తుల సౌధాలు పేకమేడల్లా కూలిపోవడానికి ఎంతో కాలం పట్టదు.పశ్చిమబంగ, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో అధికారపక్షాలైన తృణమూల్, కాంగ్రెసు, వామపక్షాలు ఈ ఉప ఎన్నికల్లో గెలుపు సాధించాయి. బీజేపీ తాను అధికారంలో ఉన్నచోట్ల ప్రతిపక్షాలపై ఈ రకమైన ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయింది. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించి భంగపడిన బీజేపీ ప్రజల తీర్పు తమకే అనుకూలమని ఢంకా బజాయించింది. జేడీఎస్, కాంగ్రెసులను అవకాశవాదరాజకీయంగా అభివర్ణించింది. కానీ ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ భారీ ఆధిక్యంతో గెలిచింది. నిజంగానే బీజేపీపై సానుభూతి, కమలం పార్టీ ని అన్యాయంగా గద్దె దించేశారనే భావన ప్రజల్లో ఉంటే ఉప ఎన్నికలో బీజేపీని గెలిపించేవారు.ఈ ఉప ఎన్నిక కాంగ్రెసు, జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వానికి నైతికంగా భరోసానిచ్చింది. కేరళ ఉప ఎన్నికలోనూ గతంలో తెచ్చుకున్న ఓట్లలో పదిశాతం బీజేపీ కోల్పోవాల్సి వచ్చింది. మొత్తమ్మీద ఈ ఎన్నికల ఫలితాల తర్వాత పొలిటికల్ గణాంకాల్లోనూ స్పష్టమైన తేడా ఏర్పడింది. నాలుగేళ్లుగా బీజేపీ ఏ ఇతర పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంతంగా లోక్ సభలో ఆధిక్యంతో కొనసాగింది. ఈ ఉప ఎన్నికల తర్వాత ఎన్నికల ఏడాది పార్టీ ఆధిక్యాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. సింగిల్ లార్జెస్టు పార్టీ గా ఉన్నప్పటికీ సంక్షోభ పరిస్థితి ఉత్పన్నమైతే మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మోడీ, అమిత్ షా లకు ఇదే పెద్ద సవాల్.