విజయవాడ, ఏప్రిల్ 29
ఏపీలో పోలింగ్ కు రెండు వారాల వ్యవధి మాత్రమే ఉంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈరోజు ఏపీ సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. అద్భుతమని వైసిపి శ్రేణులు చెబుతుండగా.. విపక్షాలు మాత్రం బాగాలేదని చెబుతున్నాయి. అయితే తటస్టులు, ఏ పార్టీకి చెందినవారిలో మాత్రం బలమైన చర్చ నడుస్తోంది. అయితే ఊహించినంత స్థితిలో జగన్ మేనిఫెస్టో లేకపోవడం మైనస్ గా మారింది. ఇంతకుముందే టిడిపి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. దీంతో తాజాగా జగన్ ప్రకటించిన మేనిఫెస్టోతో.. టిడిపి సూపర్ సిక్స్ పథకాలను బేరీజు వేసుకొని.. ఏది మంచిదా? ఏది మంచిది కాదా? అని చర్చించుకుంటున్నారు.ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే ఉచిత పథకాలు అమలు చేయాలన్నది వైసిపి అభిమతం. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేసిన పని ఇదే. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. అదే సమయంలో అభివృద్ధి చేయలేదన్న అపవాదును కూడా మూటగట్టుకుంది. ఇటువంటి సమయంలో వైసీపీ మేనిఫెస్టో ను భారీగా ఊహించుకున్నారు ఏపీ ప్రజలు. కానీ ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తామని.. వాటికి కొద్దిపాటి మొత్తాలను పెంచి జగన్ మేనిఫెస్టోను ప్రకటించారు. అమ్మ ఒడి, రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు రుణాలు వంటి వాటి విషయంలో ఇప్పుడు ఇస్తున్న మొత్తానికి.. కొద్దిపాటి నిధులను పెంచి అమలు చేస్తామని జగన్ ప్రకటించారు. కేవలం రెండు పేజీల్లో.. 9 అంశాలను పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టోను రూపొందించారు. అయితే ప్రజలకు భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో.. ఈ మేనిఫెస్టోలో భారీ ఊరట దక్కలేదు. భారీ కేటాయింపులు ప్రకటించలేదు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ శ్రేణులకే ఈ మ్యానిఫెస్టో అంతగా నచ్చలేదని తెలుస్తోంది. అయితే ఈ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలను భారీ స్థాయిలో ప్రకటించి ఉంటే.. జగన్ పాలనలో అభివృద్ధికి చోటు లేదన్న విపక్షాల విమర్శలకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే జగన్ వెనుకడుగు వేసినట్లు సమాచారం.అయితే ఇప్పటికే టిడిపి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదు. అయితే తాజాగా వైసిపి మేనిఫెస్టో ప్రకటనతో.. టిడిపి సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. పేద, సామాన్య వర్గాలకు ఇది ఊరట కలిగించే విషయం. మరోవైపు చదువు ప్రోత్సాహకానికి 20వేల రూపాయల చొప్పున సాయం అందిస్తానని ప్రకటించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. అటు సాగు భరోసా కింద రైతుకు 20వేల నగదు అందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే వీటికి మించి జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ గత మేనిఫెస్టోకే కొద్దిగా మెరుగులు దిద్ది ప్రకటించడంతో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు హైలెట్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు కేవలం సూపర్ సిక్స్ పథకాలను మాత్రమే టిడిపి ప్రకటించింది. ఇప్పుడు టిడిపి, బిజెపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే ఛాన్స్ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి భాగస్వామ్య పార్టీగా ఉండడంతో.. కేంద్ర పథకాలు కలిపి.. సంక్షేమ పథకాలకు భారీ కేటాయింపులు జరిపి ప్రకటించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే టిడిపి మేనిఫెస్టో కే ప్రజల మొగ్గు చూపే ఛాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.