కడప, ఏప్రిల్ 29
సోదరి షర్మిలను జగన్ లైట్ తీసుకున్నారు.ఏం చేస్తుందిలే అని భావించారు. తన ముందు ఆమె ఎంత అని తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఆమె ఒక పట్టాన విడిచి పెట్టడం లేదు. ముఖ్యంగా బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యపై గట్టిగానే మాట్లాడుతున్నారు. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆమె ద్వారా గట్టిగానే డ్యామేజ్ కలుగుతోంది. అందుకే ఆమెను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు ఆమె వివేకా హత్య గురించి ప్రస్తావించకుండా చేయాలని కోర్టును ఆశ్రయించారు. అయినా సరే ఆమె వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఆమెను ఎలా కంట్రోల్ చేయాలో జగన్కు తెలియడం లేదు. ఈ అయోమయ స్థితిలో ఏవేవో మాటలు చెబుతున్నారు. మొన్నటికి మొన్న సోదరి పసుపు చీర ధరించడం పై కూడా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు షర్మిల పర్యటనకు పోలీసుల నుంచి సహాయ నిరాకరణ ఎదురయ్యేలా ఆదేశాలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.పులివెందులలో జగన్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సోదరి షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులకు ఆమె చేతులు కలిపారని కూడా ఆరోపించారు. దీనిపై షర్మిల కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అయితే అలా స్పందించిన మరుసటి రోజు ఆమెకు పోలీసుల నుంచి సహాయ నిరాకరణ ఎదురయ్యింది. దెందులూరు లో షర్మిల సభ అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు చేతులెత్తేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే షర్మిల కాన్వాయ్ గంటకు పైగా ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఇలా సభ ముగిసిందో లేదో పోలీసులు అక్కడ నుంచి జారుకున్నారు. కనీసం ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. దీంతో షర్మిల ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ట్రాఫిక్ ను క్లియర్ చేసుకోవాల్సి వచ్చింది.తనకు ఎదురవుతున్న పరిణామాలతో షర్మిల కూడా వైసీపీ సర్కార్పై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. జగన్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదని.. ప్రధాని మోదీ వారసుడంటూ చేసిన వ్యాఖ్యలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. షర్మిల ఈ తరహా వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్తుండడంతో జగన్ సైతం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందుకే షర్మిల విషయంలో ఎటువంటి రాజీవద్దని.. ఆమె తమ కుటుంబ సభ్యురాలు అని మినహాయింపు ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు పోలీసు తో పాటు ఇతర వ్యవస్థలు సహాయ నిరాకరణ చేస్తున్నాయని తెలుస్తోంది. ప్రచారపర్వం తుది అంకానికి వచ్చిన తరుణంలో.. షర్మిల అంటేనే జగన్ భయపడిపోతున్నట్లు సమాచారం. అయితే షర్మిల సభలకు ఆంక్షలు, సహాయ నిరాకరణ మొదటికే చేటు తెస్తాయని.. వైసిపి మెడకు చుట్టుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.