అనకాపల్లి, ఏప్రిల్ 29
ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని మోసాలు చేయడానికైనా వెనుకాడరని వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి... అవి కొనసాగలంటే మాత్రం వైసీపీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబును ఎన్నుకంటే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయని ప్రజలకు హెచ్చరించారు. శనివారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన జగన్... రోజుకు మూడు నాలుగు సభల్లో మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ఇవాళ అనకాపల్లి జిల్లా చోడవరంలో మొదట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థును గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
గతంలో ఎప్పుడూ చూడని సంక్షేమం వైసీపీ పాలనలో ప్రజలు చూశారని అన్నారు జగన్. ఇంటి వద్దకే అన్ని ప్రభుత్వ పథకాలు లంచాలకు పక్షపాతానికి తావులేకుండా వలంటీర్ల ద్వారా చేరవేశామని గుర్తు చేశారు. అలాంటి సంక్షేమ పాలన ఇంకా కొనసాగలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్‌కు సంబంధించినవి అని అన్నారు జగన్. అందుకే ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి వేయాలని ప్రజలకు సూచించారు. మరోసారి మాయ మాటలు చెప్పి మోసం చేసేందుకు చంద్రబాబు కూటమితో వస్తున్నారని హెచ్చరించారు. 2014లో అలవి కాని హామీలు ఇచ్చి మోసం చేసినట్టుగానే ఈసారి కూడా చంద్రబాబు మోసం చేస్తారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి హామీలు, ఎంత ఖర్చైనా పెట్టేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నరని ఆరోపించారు జగన్. చంద్రబాబు ఓటుకు ఎంతైనా ఇవ్వడానికి రెడీ అన్నారు. ఆయన డబ్బులు ఇస్తే తీసుకొని తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని రిక్వస్ట్ చేశారు. మరోసారి చంద్రబాబును నమ్మితే ప్రజల పరిస్థితి గోవిందా అంటూ సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలను చదవి వినిపించారు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు మరోసారి అలానే మాయ చేద్దామాని చూస్తున్నారని అన్నారు. ఆయన్ని నమ్మితే పులి నోట్లో లేదా కొండ చిలువ నోట్ల తలపెట్టినట్టే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.