గుంటూరు, మే 2
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్సార్సీపీలో ఇక్కడ అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. గుంటూరు లోక్ సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన మంగళగిరి.. రాజధాని అమరావతి ప్రాంతం పరిధిలోకి వస్తుంది. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో ఈ నియోజకవర్గం విస్తరించింది.మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువ. 1989 నుంచి 2009 వరకు పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన వారే మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. దీంతో 2014లో పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని టీడీపీ బరిలోకి దింపింది. కానీ ఆయన కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లోనూ తమ సామాజికవర్గ నేతకు మంగళగిరి టికెట్ కేటాయించాలని పద్మశాలీలు చంద్రబాబును కోరినప్పటికీ.. టీడీపీ లోకేశ్‌ను బరిలోకి దింపింది. దీంతో తాము టీడీపీకి ఓటు వేయబోమని పద్మశాలీ వర్గం బహిరంగ ప్రకటన చేసింది. ఫలితంగా వైఎస్సార్సీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) చేతిలో 5 వేల ఓట్ల తేడాతో నారా లోకేశ్ ఓడిపోయారు. ఆర్కే సొంతూరు పెద కాకాని అయినప్పటికీ.. ఆయన వరుసగా రెండుసార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు.2023 డిసెంబర్లో మంగళగిరి రాజకీయాలు మలుపు తిరిగాయి. 2024 ఎన్నికల్లో టికెట్ దక్కదనే సంకేతాలతో ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆర్కే రాజీనామా చేశారు. తదనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు 2022 ఆగస్టులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన గంజి చిరంజీవిని మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్‌గా జగన్ నియమించారు. ఈయన పద్మశాలీ సామాజికవర్గానికి చెందినవారు. పార్టీని వీడిన కొద్ది రోజులకే ఆర్కే మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. వైఎస్సార్సీపీ గంజి చిరంజీవిని పక్కనబెట్టి.. మురుగుడు లావణ్యకు టికెట్ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె అయిన లావణ్య.. మాజీ మంత్రి అయిన మురుగుడు హనుమంతరావు కుమారుణ్ని పెళ్లాడారు. లావణ్య కూడా చేనేత వర్గానికి చెందిన వారే.మంగళగిరిలో మొత్తం 2.68 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 55 వేల మందికిపైగా పద్మశాలీలు ఉన్నారు. మాదిగ సామాజికవర్గ ఓటర్లు 35 వేల మంది ఉండగా.. మాల వర్గానికి చెందిన ఓటర్లు 28 వేల మంది ఉన్నారు. కాపు సామాజిక వర్గం ఓటర్లు 30 వేల మంది ఉండగా.. కమ్మ సామాజికవర్గ ఓటర్లు 17 వేల మంది ఉన్నారు.2024 ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలతోపాటు రెడ్డి సామాజికవర్గం తమతో కలిసి వస్తుందని జగన్ ఆశిస్తున్నారు. అయితే కమ్మ, కాపు సామాజికవర్గాలతోపాటు.. రాజధాని అంశం తమకు కలిసొస్తుందని టీడీపీ భావిస్తోంది. జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదన చేయడం, అమరావతిని విస్మరించడాన్ని తమకు అనుకూలంగా వాడుకోవాలనేది టీడీపీ వ్యూహంగా ఉంది. 2024లో మంగళగిరి పోరు క్యాస్ట్ వర్సెస్ క్యాపిటల్‌గా ఉండనుంది.2019 ఎన్నికల్లో ఓడినప్పటికీ.. ఈసారి కూడా తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తానని లోకేశ్ ప్రకటించారు. వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1983లో టీడీపీ తరఫున పోటీ చేసిన కోటేశ్వరరావు మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985 ఎన్నికల్లో ఆయన సినీ నటి జమునపై విజయం సాధించారు. ఆ తర్వాత పొత్తులో భాగంగా టీడీపీ మంగళగిరి స్థానాన్ని కమ్యూనిస్టులకు కేటాయిస్తూ వచ్చింది. మళ్లీ 2014లో అంటే దాదాపు 35 ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీ పోటీ చేసింది.మంగళగరిలో కాంగ్రెస్ ఆరుసార్లు గెలవగా.. సీపీఐ నాలుగుసార్లు గెలిచింది. టీడీపీ, వైఎస్సార్సీపీ చెరో రెండుసార్లు విజయం సాధించాయి. జనతా పార్టీ ఒకసారి గెలుపొందింది. 1952లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన దర్శి లక్ష్మయ్య మంగళగిరి తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. సీపీఐకి చెందిన వేములపల్లి శ్రీకృష్ణ 1962, 72ల్లో గెలిచారు. సీపీఐ చివరిసారిగా 1994లో మంగళగిరిలో గెలిచింది. నిమ్మగడ్డ రామ్మోహనరావు ఆ ఎన్నికల్లో గెలిచారు.ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. మేకా కోటి రెడ్డి (1955), తులబండ్ల నాగేశ్వర రావు (1967), గోలి వీరాంజనేయులు (1989), మురుగుడు హనుమంతరావు (1999, 2004), కాండ్రు కమల (2009) హస్తం పార్టీ తరఫున మంగళగిరి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1978లో జనతా పార్టీకి చెందిన గాదె వెంకట రత్తయ్య ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.