ముంబై, మే 2,
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వచ్చిన తర్వాత ఏప్రిల్‌లో అత్యధిక పన్ను వసూళ్లు నమోదయ్యాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి సంబంధించి ఎక్స్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘ఏప్రిల్ నెలలో ఎన్నడూ లేనివిధంగా రూ.2 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయినట్లు’ పోస్ట్ చేశారు. ప్రభుత్వ పత్రికా ప్రకటన ప్రకారం కేంద్ర జీఎస్టీ రూ.43,846 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.53,538 కోట్లు, కేంద్ర-రాష్ట్రాల ఉమ్మడి జీఎస్టీ రూ.99,623 కోట్లు, సెస్ పన్ను రూ.13,260 కోట్లుగా ఉన్నట్లు గణాంకాలను విడుదల చేశారు. పెరిగిన దేశీయ వాణిజ్యం కారణంగా జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.ఈ పోస్టులో అన్ని రాష్ట్రాలకు చెందిన జీఎస్టీ కలెక్షన్స్‌ను వివరించారు. మార్చి 2023తోపాటు ఏప్రిల్ 2024 లెక్కలను ఈ ఎక్స్‌లో పంచుకున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. గత ఏడాది అంటే మార్చి 2023లో తెలంగాణ నుంచి రూ. 5,622 వేల కోట్లు రెవెన్యూ జీఎస్టీ ద్వారా లభించగా.. అదే 2024 మార్చి ముగింపు నాటికి రూ. 6,236 కోట్లు వసూలు అయినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గణాంకాలను కూడా వెలువరించారు. గత ఏడాది అంటే 2023 మార్చి నాటికి ఏపీ నుంచి కేంద్రానికి జీఎస్ టీ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 4,329 కోట్లు కాగా ఈ ఏడాది అనగా 2024 మార్చి నాటికి లభించిన ఆదాయం రూ. 4,850 కోట్లుగా తెలిపారు.