హైదరాబాద్, మే2,
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. ఏపీకి సంబంధించి మే 13న పోలింగ్ జరగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో అందరి దృష్టి ఏపీ పైనే ఉంది. సాధారణంగా ఎంపీ ఎన్నికల కంటే అసెంబ్లీకి ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తారు. ఎక్కడ ఉన్నా ఓటు వేసేందుకు స్వరాష్ట్రానికి వస్తారు.సొంత గ్రామానికి వెళ్లి ఓటు వేసేందుకు ఇష్టపడతారు.అయితే వలస ఓటర్లను రప్పించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో… స్వగ్రామాలు చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది.ఏపీ నుంచి ప్రజలు ఎక్కువగా వలస పోతుంటారు.ఉద్యోగ ఉపాధి కోసం హైదరాబాద్,బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళుతుంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి వలస బాట అధికం. అటువంటి వారు ఎన్నికల సమయంలో స్వగ్రామాలకు వెళ్లడం జరుగుతుంటుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వలస ఓటర్ల తరలింపు అధికంగా జరిగేది. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వలస ఓటర్లను తెప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు ముందుగానే జరుగుతున్నాయి. ఆరోజు దాదాపు 3000 బస్సులు ఏపీకి రానున్నట్లు తెలుస్తోంది. రాను పోను ఖర్చులతో పాటు భోజనం, ఇతరత్రా ఖర్చులు పెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధపడుతున్నాయి.ఒక్క హైదరాబాదు నుంచి దాదాపు 2000 బస్సులు బుక్ అయినట్లు తెలుస్తోంది. అవి హైదరాబాదులో 11వ తేదీన బయలుదేరుతాయి. ఆ మరుసటి రోజున వలస ఓటర్లు స్వగ్రామాలకు చేరుకోనున్నారు. ఓటు వేసిన తర్వాత 13వ తేదీ సాయంత్రం తిరిగి ఆ బస్సులు బయలుదేరనున్నాయి. అయితే ఈ వలస ఓటర్లను తరలించేందుకు అన్ని పార్టీలు ప్రత్యేకంగా కొందరు మనుషులను నియమించుకున్నారు. వారే వలస ఓటర్లవివరాల సేకరణ, ఏయే ప్రాంతాల్లో ఉంటారు. వారిని ఎలా తరలించాలి. వంటి విషయాలన్నీ వారే చూసుకుంటారు.అయితే దాదాపు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందిన బస్సులు ఏపీ ఎన్నికలకు రానున్నట్లు తెలుస్తోంది.