YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కలిసి రాని కాలంతో తిప్పలు

కలిసి రాని కాలంతో తిప్పలు

హైదరాబాద్, మే3,
పాలకులు ఎంత సమర్థులు అయినా.. కాలం కలిసి వస్తేనే ప్రజలు, పాలకులు సంతోషంగా ఉంటారు. వనరులు పెరుగుతాయి. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాలం కలిసిరానప్పుడు ఎంత చేసినా పాలకుల శ్రమ వృథా ఆవుతోంది. అప్పులు పెరుగుతాయి. ప్రభుత్వ ఆదాయం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు పదేళ్లు రాష్ట్రం కరువుతో కొట్టుమిట్టాడింది. తాగు, సాగునీటి కొరతతో ప్రజలు అల్లాడారు. కరెంటు కోతలతో పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయి. అందుకే చంద్రబాబు పాలన అంటేనే కరువు అని అంతా భావిస్తారు. బాబు వస్తే కరువు వస్తుందంటారు. బాబు, కరువు కవల పిల్లలు అని వైఎస్ఆర్, జగన్ లాంటి వాళ్లు విమర్శిస్తూనే ఉండేవారు. చంద్రబాబు తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఆయన ప్రమాణస్వీకారం రోజే భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరణుడు కాంగ్రెస్‌లో చేరారన్న ప్రచారం చేశారు ఆ పార్టీ నాయకులు.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పదేళ్లు మంచి వర్షాలే కురిశాయి. కరువు అంటేనే తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది చంద్రబాబు పాలన. విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడే అయ్యారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో కూడా వర్షాలు సాధారణంకన్నా తక్కువగా కురిశాయి. ఇప్పుడు దీంతో బాబు వస్తే కరువొస్తది అన్న నానుడి స్థిరపడింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడి పాలన కూడా అలాగే ఉందనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి అయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. పదేళ్లు బీఆర్‌ఎస్‌ పాలనతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఆ పాలన మారగానే కరువు అలుముకుంటోంది. ఇప్పటికే యాసంగి పంటలు సాగునీరు అందక ఎండిపోయాయి. కొంతమంది రైతులు పంటలను పశువులకు వదిలేయగా, మరికొందరు నిప్పు పెట్టారు.పదేళ్లు తెలంగాణలో తాగునీటి ఆందోళనలు కనిపించలేదు. నీళ్ల కోసం రోడ్లు ఎక్కిన సందర్భాలు చాలా తక్కువ. కానీ, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మళ్లీ తాగునీటి సమస్య కూడా మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. మిషన్‌ భగీరథ పథకం ఉన్నా.. నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. మంచినీళ్లు మహాప్రభో అని ప్రజలు మొత్తుకుంటున్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా ఫలితం ఇవ్వడం లేదు.ఇక చంద్రబాబు పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా విపరీతమైన కరెంటు కోతలు ఉండేవి. ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా బాబు పాలన సాగించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ పాలనతోనూ కరెంటు కోతలు మొదలయ్యాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్‌ ఏం చేశారో తెలియదు కానీ కరెంటు సమస్య మాత్రం లేకుండా చేశారు. ఇప్పుడు మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి. ఎక్కడా కరెంటు కోతలు లేవని పాలకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది.ఇక పదేళ్లలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. ప్రస్తుతం మే నెల రావడంతో ఈ నెలంతా ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చాలా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తున్నారు.దీంతో కరువు పాలనకు కేరాఫ్‌ చంద్రబాబే కాదు.. ఆయన శిష్యుడు కూడా అని కామెంట్‌ చేస్తున్నాయి విపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు.

Related Posts