లక్నో, మే 3,
ఎన్నికల వేళ సమాజంలో కులాలు, మతాలు.. వివిధ నియోజకవర్గాల్లో వారి సంఖ్యాబలం, ఓటుబ్యాంకు వంటి సమీకరణాలు బయటికొస్తాయి. దేశాన్ని పాలించే ప్రధాన మంత్రులను అందిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ కుల, మత సమీకరణాలకు అన్ని రాజకీయ పార్టీలు పెద్ద పీట వేస్తాయి. ఎందుకంటే ఓటర్ల వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, విచక్షణ కంటే కులం, మతం ఆధారంగా పార్టీలకు ఓట్లు పడుతుంటాయి. అందుకే ఇక్కడ కులానికొక పార్టీ అన్న చందంగా బలమైన ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. జాతీయ పార్టీలు సైతం ఈ రాష్ట్రంలో గెలుపొందాలంటే కుల, మత సమీకరణాలు బేరీజు వేసుకోక తప్పదు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో గంపగుత్తగా ఓట్లు వేసే సమూహాలుగా దళితులు, ముస్లిం వర్గాలున్నాయి. వారిలో దళితులు రాష్ట్ర జనాభాలో 21.1 శాతం ఉన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 4 దశాబ్దాల పాటు ఈ వర్గం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. 1984లో కాన్షీరాం బహుజన్ సమాజ్ పార్టీ ని స్థాపించిన తర్వాత క్రమక్రమంగా ఈ వర్గం బీఎస్పీకి దగ్గరైంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలు అన్నింటినీ కలిపి బహుజనులుగా సంబోధిస్తూ.. వారి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఏర్పాటైన ఈ పార్టీని దళితులు పూర్తిగా సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు బీఎస్పీ అధినేత్రి మాయావతి గతంలో మాదిరిగా రాజకీయాల్లో క్రియాశీలంగా లేకపోవడం, గత దశాబ్దకాలంలో ఏ ఎన్నికల్లోనూ చెప్పుకోదగిన రీతిలో విజయాలు సాధించలేకపోవడం వంటి కారణాలతో దళితులు మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ ) పేరుతో చంద్రశేఖర్ ఆజాద్ దళిత ఓటుబ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. దళిత సమాజానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించలేకపోయారు. ఫలితంగా భారతీయ జనతా పార్టీ దళిత ఓటుబ్యాంకులోకి చొచ్చుకెళ్లేందుకు ఆస్కారం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ , బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్ కలసికట్టుగా పోటీచేసినా సరే బీజేపీ జైత్రయాత్రను నిలువరించలేకపోవడం వెనుక దళిత ఓటు కూడా కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో 17 సీట్లు ఎస్సీలకు రిజర్వు చేసి ఉన్నాయి. వీటిలో 15 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా, మూడు పార్టీల కూటమి కేవలం 2 సీట్లలో మాత్రమే గెలుపొందడం ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు.యూపీలో దళితులకు రిజర్వు చేసిన స్థానాలు 17 మాత్రమే ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని కనీసం 35 నుంచి 40 స్థానాల్లో వారి సంఖ్యాబలం 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంటే ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు దళితుడేనని స్పష్టమవుతుంది. దాన్నిబట్టే ఎన్నికల్లో ఈ వర్గం చూపించే ప్రభావం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పార్టీల జయాపజయాలను శాసించే స్థాయిలో దళితులున్న నియోజకవర్గాల్లో ఖీరి, సహారన్‌పూర్, అలీగఢ్, ఎటావా, హత్రాస్, బాందా, హమీర్‌పూర్, ఝాన్సీ, అక్బర్‌పూర్, సీతాపూర్, హర్దోయ్, మోహన్‌లాల్‌గంజ్, ఉన్నావ్, రాయ్‌బరేలి, ఫైజాబాద్, ఇలాహాబాద్, ఆగ్రా, బారాబంకీ, మిస్రిక్, బిజ్నోర్, నగీనా, లాల్‌గంజ్ వంటివి ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవాలన్నా దళితుల మద్దతు కూడగట్టుకోవాలి.. లేదంటే దళితేర వర్గాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి వారి మద్దతుతో గెలవాల్సి ఉంటుంది. అది ఏ పార్టీకి సాధ్యం కాదు కాబట్టి అతిపెద్ద సమూహంగా ఉన్న దళితులను ఆకట్టుకునే పనిలో అన్ని పార్టీలు పడ్డాయి.గత 4 దశాబ్దాలుగా తమకు దూరమైన దళితులను మళ్లీ దరిచేర్చుకుని పూర్వవైభవం సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ‘దళిత్ గౌరవ్ సంవాద్ యాత్ర’ చేపట్టారు. బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం జయంతి ఈ యాత్రతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దళిత్ పంచాయితీలను నిర్వహిస్తూ ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు బీఎస్పీని బీజేపీకి బీ-టీమ్‌గా పేర్కొంటూ వారిని మాయావతి నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తోంది.సమాజ్‌వాదీ పార్టీ సైతం దళితులను ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా పీడీఏ ఫార్ములాను అనుసరిస్తోంది. పీడీఏ అంటే పిఛ్‌డా(P), దళిత్(D), అల్పసంఖ్యాక్(A). తెలుగులో పిఛ్‌డా అంటే వెనుకబడినవర్గాలు (ఓబీసీలు). ఇలా ఓబీసీ, దళిత్, మైనారిటీ కాంబినేషన్లో సమాజంలో మెజారిటీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాల్లో సైకిల్ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మధ్యప్రదేశ్‌లోని మ్హౌ పట్టణానికి వెళ్లి మరీ దళిత మేధావి, సంఘ సంస్కర్త డా. బీఆర్ అంబేద్కర్‌కు నివాళులు అర్పించి వచ్చారు. అలాగే యూపీలోని బరేలీలో బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. సమాజ్‌వాదీ పార్టీ యువజన విభాగాన్ని ఏర్పాటు చేస్తూ.. దానికి ‘బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ వాహిని’గా నామకరణం చేశారు.
పదేళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సైతం తామేమీ తక్కువకాదంటూ దళితులను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. అనేక దళిత సదస్సులు నిర్వహించింది. “సబ్ కా సాత్ – సబ్ కా వికాస్” నినాదంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దళితులను అనేక పథకాల్లో భాగస్వాములను చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని సర్కారు సైతం దళితుల మనసు గెలుచుకునే ప్రయత్నాలెన్నో చేసింది. మొత్తంగా దళిత సమూహంలో దాదాపు సగభాగం బీజేపీకి దగ్గరైనట్టు అంచనాలున్నాయి. మరో ప్రత్యామ్నాయంగా సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ.. గతంలో ఎస్పీ-బీఎస్పీ మధ్య క్షేత్రస్థాయిలో నెలకొన్న తీవ్రమైన ఘర్షణ వాతావరణం, రక్తసిక్త రాజకీయాలు నేటికీ ప్రభావం చూపుతున్నాయి. కాంగ్రెస్ వైపు వెళ్దామంటే ఆ పార్టీ అత్యంత బలహీనంగా కనిపిస్తోంది. బీజేపీ జైత్రయాత్రను నిలువరించాలని చూస్తున్న విపక్ష కూటమి (I.N.D.I.A) ఈ రాష్ట్రంలో దళితులను ఆకట్టుకోకుండా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇలా మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు దళితుల వైపే చూస్తున్న తరుణంలో ఆ వర్గం ఎటువైపు నిలుస్తుందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.