హైదరాబాద్, మే 3
వైఎస్ వివేకా హత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్ రద్దు చేయాలని కోరారు. దస్తగిరి తరఫున జై భీమ్ రావ్ భారత పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్ రద్దు చేస్తూ.. అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్నికల వేళ ఆయనకు భారీ ఊరట దక్కింది. అలాగే, ఇదే కేసులో అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఇక, ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. కాగా, వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దస్తగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.