విజయవాడ, మే 4,
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ తర్వాత మోడీ మళ్లీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. అంతవరకు బానే ఉన్నా షెడ్యూల్ చూస్తుంటే ఆయన కేవలం తన పార్టీ వారి కోసమే వస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పొత్తు ధర్మం విస్మరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు, రోడ్‌షోల్లో ఆయన పాల్గొంటారు. రాజమండ్రి లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు.అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొని, రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్, కార్యక్రమ నిర్వాహకుల వివరాల్ని బీజేపీ వెల్లడించింది.వాస్తవానికి ఈ నెల 5నే మోడీ ఏపీ ప్రచారానికి వస్తారని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దాన్ని ధృవీకరించారు. ఏడున దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ ఉండటంతో మోడీ షెడ్యూల్ మారిందంటున్నారు. ఏదేమైనా మోడీ రాగానే 7 సాయంత్రం రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి బీజేపీ ఎంపీ కేండెట్ పురంధేశ్వరి ప్రచార సభలో పాల్గొననున్నారు.అక్కడ నుంచి నేరుగా విశాఖ జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ విశాఖ, అనకాపల్లి రెండు నియోజకవర్గాలున్నాయి. 2014లో పొత్తుల్లో భాగంగా విశాఖ నుంచి బీజేపీ ఎంపీ గెలిచారు. అయినా ప్రధాని విశాఖలో కాకుండా అనకాపల్లి లోక్‌సభ సెగ్మెంట్లోని రాజుపాలెంలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పోటీలో ఉండటం వల్లే షెడ్యూల్ అలా ఫిక్స్ చేశారు.8వ తేదీ షెడ్యూల్ లోనూ బీజేపీ నేతలకే ప్రచారానికి ఆయన పరిమితమయ్యారు. అనకాపల్లి నేరుగా ఆయన రాజంపేట ఎంపీ అభ్యర్థి, బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆ సెగ్మెంట్ పరిధిలోని పీలేరులో నిర్వహించే సభలో ఆయన ప్రసంగిస్తారు అనంతరం విజయవాడలో రోడ్ షో.. విజయవాడ వెస్ట్ నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కోసమే అంటున్నారు. ఏదేమైనా ప్రధాని షెడ్యూల్ బీజేపీ అభ్యర్థుల ప్రచారానికే పరిమితం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది