YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రచారాస్త్రంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్

ప్రచారాస్త్రంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్

విజయవాడ, మే 4,
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్. భూ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తే.. వాస్తవాలను మభ్యపెట్టి లేని పోని దుష్ప్రచారం చేస్తోందని తిప్పికొడుతోంది అధికార పక్షం. ఎన్నికల ప్రచారం మొత్తం ఇప్పుడు ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చుట్టూనే పరిభ్రమిస్తోంది. ప్రధాన మీడియాతోపాటు సోషల్‌ మీడియాలోనూ దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంతకీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ సమగ్ర స్వరూపం ఏంటి? ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత..? కొత్త చట్టంతో భూ యజమానులకు జరిగే మేలేంటి..?ఏపీ ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను గత ఏడాది ప్రవేశపెట్టింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఈ చట్టం రూపుదిద్దుకున్నా.. ఇంకా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. కానీ, ఎన్నికల సందర్భంగా ఈ చట్టంపై కొన్ని అవాస్తవాలు ప్రచారంలోకి వచ్చాయంటోంది అధికార పార్టీ. వాస్తవానికి ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్‌ రిజిస్టర్‌ రానుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితోపాటు ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.ఇప్పటివరకు వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కరించాలని సంకల్పించింది ప్రభుత్వం. ఈ టైటిల్‌ రిజిస్టర్‌నే చట్టపరంగా కన్‌క్లూజివ్‌ రికార్డుగా చూపుతున్నారు. ఈ రికార్డే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజంప్టివ్‌ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కన్‌క్లూజివ్‌ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. అయితే దీన్ని బూచిగా చూపి ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌లో అసలు కోర్టుకు వెళ్లే హక్కులేదనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చాయి విపక్షాలు.దేశంలోనే మొట్ట మొదటిసారిగా వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కనుందంటున్నారు నిపుణులు. వాస్తవానికి ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. దీన్ని గుర్తించని విపక్షాలు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేలా ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. వాస్తవానికి ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూవివాదాలు 90 శాతం మేర కనుమరుగవుతాయి. అదే జరిగితే తమ ఉనికే ప్రమాదమని భావిస్తున్న విపక్షం.. తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ రాత్రికి రాత్రే అమల్లోకి రాలేదు. వివిధ దశల్లో.. ఎన్నో మార్పులతో పకడ్బందీగా చట్టానికి తుది రూపమిచ్చారు. సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. పలు మార్పుల తర్వాత గత ఏడాది దానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం తేవాలని అన్ని రాష్ట్రాలకూ చాలా ఏళ్లుగా చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఆలోచనలను అందిపుచ్చుకుని దాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం సఫలీకృతమైంది. గత ఏడాది అక్టోబర్‌ 31 నుంచి ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌-2023 అమల్లోకి వచ్చింది.ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కి పైగా రికార్డులున్నాయి. గ్రామ స్థాయిలో 1బీ, అసైన్‌మెంట్, ఇనాం వంటి 11 రిజిష్టర్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్‌ రిజిస్ట్రార్, పంచాయతీ, మున్సిపాల్టీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్‌ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా, చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా వేరే వాళ్లు అది తనదని అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. ఈ సమస్యకు కొత్త చట్టంలో చక్కని పరిష్కారం చూపింది ప్రభుత్వం.కొత్త చట్టం ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్‌ రిజిస్టర్‌లో ఉంటాయి. వివాదాలు ఉన్న భూములను ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. చట్టం ప్రకారం టైటిల్‌ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ, సివిల్‌ కోర్టులకు వెళ్లి ఏళ్లకు ఏళ్లు వాయిదాలకు తిరిగే బదులు.. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ట్రిబ్యునల్‌ తీర్పులపై అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంత చక్కనైన వ్యవస్థపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది ప్రభుత్వం.టైటిల్‌ రిజిష్టర్‌లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు. 1బిలో ఉన్నా, అడంగల్‌లో ఉన్నా, ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్నా ప్రభుత్వ గ్యారంటీ ఉండదు. ఈ గ్యారంటీ లేకపోవడాన్నే ప్రిజంప్టివ్‌ రైట్స్‌ అనేవారు. 1బిలో ఉన్న పేరుపైన ఎవరైనా కోర్టుకు వెళ్లి అది తప్పని నిరూపించే వరకు అది కరెక్ట్‌ అని భావించే వారు. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని, రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికి రావని స్పష్టం చేసింది. టైటిలింగ్‌ చట్టం కింద రూపొందిన రిజిస్టర్‌ ప్రకారం ప్రిజంప్టివ్‌ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. ఒకసారి టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు.భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా తెలిపారు. పైగా భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నప్పుడే టైటిల్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్‌ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. దీనివల్ల మోసం జరగడానికి వీలు లేకుండా పోతుంది. భూ యజమానులకు పూర్తి రక్షణ కల్పించే ఇంత పకడ్బందీ చట్టంపై జరుగుతున్న ప్రచారాన్ని నిపుణులు కూడా తప్పుపడుతున్నారు.నిజం తెలిసేలోపు అబద్దం ఊరంతా చుట్టేసి వచ్చినట్లు.. భూ యజమానులకు మంచి చేసే చట్టంపై దుష్ప్రచారం జరుగుతోందని అంటోంది వైసీపీ. మొత్తానికి ఏపీ ఎన్నికల్లో మిగిలిన అంశాలకన్నా ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఒక్కటే ప్రధానంగా చర్చకు రావడం.. ఇది ఎవరికి ప్లస్సో.. ఎవరికి మైనస్సో అన్నది ఉత్కంఠగా మారింది.

Related Posts