విజయవాడ, మే 4,
సార్వత్రిక ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పరస్పరం మహిళా నేతలు తలపడుతున్న ఆ నియోజకవర్గాలు ఈ ఎన్నికలకే హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇటు అధికార వైసీపీ, అటు విపక్ష కూటమి కూడా ఆ నియోజకవర్గాల నుంచి మహిళా నేతలను బరిలోకి దింపడం ప్రత్యేకంగా చెప్పొచ్చు. అంతేకాకుండా పోటీ చేస్తున్నవారిలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా, మరొకరు మాజీ పార్లమెంట్ సభ్యురాలు. మరి ఈ ఎన్నికల్లో వీరి జాతకాలు ఎలా ఉండనున్నాయి? ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు?ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో ఎందరో మహిళా నేతలు పోటీ పడుతుండగా, ఐదు నియోజకవర్గాల్లో మాత్రం పోటీ రసవత్తరంగా కనిపిస్తోంది. మహిళా నేతలు ఆర్‌కే రోజా, తానేటి వనిత, మేకతోటి సుచరిత, పురందేశ్వరి, వైఎస్ షర్మిల, వంగలపూడి అనిత వంటివారితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ప్రస్తుత సిట్టింగ్‌లతోపాటు, కొత్తగా పోటీ చేస్తున్న వారు కూడా కొందరు ఉన్నారు. ఐతే ఐదు చోట్ల మాత్రం మహిళలే నువ్వా నేనా అని సవాల్ విసురుకుంటూ బ్యాటిల్ ఫీల్డ్‌లో హైలెట్‌గా నిలుస్తున్నారు.ఇలా మహిళామణులు తలపడుతున్న ఐదు నియోజకవర్గాల్లో ఇద్దరు మహిళా మంత్రులతోపాటు మాజీ డిప్యూటీ సీఎం, మరో మాజీ ఎంపీ ఉన్నారు. ఇరుపక్షాలు ఎందరో మహిళలకు అవకాశమిచ్చినా ఈ ఐదు నియోజకవర్గాల నుంచి మహిళలను రంగంలోకి దింపడంతో పోటీ మాత్రం రసవత్తరంగా మారింది.మంత్రులు ఉషశ్రీచరణ్, విడదల రజని, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి.. తమ ప్రత్యర్థులైన మహిళా నేతల నుంచి గట్టి సవాల్ ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి పోటీచేస్తున్న ఉషశ్రీచరణ్‌కి ప్రత్యర్థిగా టీడీపీ నేత సవితమ్మకు అవకాశం వచ్చింది. ప్రస్తుతం కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఉషశ్రీచరణ్‌ను పెనుగొండకు మార్చగా, పెనుగొండలో టీడీపీ తరఫున పోటీ చేయాల్సిన పార్థసారధిని తప్పించి మహిళా నేతకు అవకాశం ఇచ్చారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఇక చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు మారిన మంత్రి విడదల రజనిపై బీసీ సామాజికవర్గానికి చెందిన పిడుగురాళ్ల మాధవిని పోటీకి పెట్టింది టీడీపీ. మహిళ, బీసీ సామాజివకర్గం కోణంలో విడదల రజనికి ప్రత్యర్థిగా మాధవికి అవకాశం ఇచ్చారు.ఇక అరకు పార్లమెంట్ నుంచి ఇద్దరు మహిళా నేతలు పోటీ పడుతుండగా, ఈ పార్లమెంట్ పరిధిలోని రంపచోడవరం, కురుపాం నియోజకవర్గాల నుంచి కూడా మహిళలే పరస్పరం తలపడుతున్నారు. లోక్‌సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా తనూజారాణి, ఆమె ప్రత్యర్థిగా కూటమి మద్దతుతో బీజేపీ నేత కొత్తపల్లి గీత అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తనూజారాణి తొలిసారి పోటీ చేస్తుండగా, గీత గతంలో ఎంపీగా పనిచేశారు. గత రెండు ఎన్నికల్లోనూ అరకు నుంచి వైసీపీయే గెలిచింది. దీంతో ఈ స్థానంలో హోరాహోరీ పోటీ నెలకొంది. ఇక రంపచోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మికి మరోసారి అవకాశం దక్కగా, ఆమెకు దీటైన అభ్యర్థిగా అంగన్‌వాడీ మాజీ కార్యకర్త శిరీషను బరిలోకి దింపింది వైసీపీ. ఇదే సీటును టీడీపీ నుంచి మరో మహిళా నేత వంతం రాజేశ్వరి ఆశించడం గమనార్హం.అరకు ఎంపీ, రంపచోడవరంతోపాటు కురుపాంలోనూ మహిళా నేతలే ఢీకొంటున్నారు. కురుపాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ప్రత్యర్థిగా గిరిజన నేత తోయిక జగదీశ్వరి రంగంలోకి దిగారు. కురుపాం రాజవంశానికి చెందిన వీరేశ్ చంద్ర టికెట్ కోసం ప్రయత్నించినా, మహిళా నేత పుష్పశ్రీవాణికి దీటైన నేతగా మరో మహిళకే అవకాశం ఇచ్చింది టీడీపీ.అతివలు పోటీ చేస్తున్న ఈ ఐదు స్థానాలూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ప్రచారంతోపాటు ఎన్నికల వ్యూహ రచనలోనూ తమదైన స్టైల్‌లో దూసుకుపోతున్నారు ఈ మహిళామణులు. పుష్పశ్రీవాణి, ఉషశ్రీచరణ్, విడదల రజిని, కొత్తపల్లి గీత, నాగులాపల్లి ధనలక్ష్మికి ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. టీడీపీ అభ్యర్థులు సవితమ్మ, తోయక జగదీశ్వరి, శిరీష, పిడుగురాళ్ల మాధవి, వైసీపీ ఎంపీ అభ్యర్థి తనూజా రాణి తొలిసారిగా ఎన్నికల రంగంలోకి దిగారు. మరి ఈ పది మందిలో ఏ ఐదుగురు అసెంబ్లీలో అడుగు పెడతారనేది ఆసక్తిరేపుతోంది.