YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భారతావనికి దిక్సూచిగా నిలుద్దాం రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ సభలో సీఎం కేసీఆర్

భారతావనికి దిక్సూచిగా నిలుద్దాం  రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ సభలో సీఎం కేసీఆర్
సకల జనుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పాటుపడుతున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తున్నారు. అంతకు ముందు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సభలో మాట్లాడుతూ తెలంగాణ అవతరించి నేటికి నాలుగు సంవత్సరాలు. మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ నాలుగేళ్లలో బలమైన అడుగులు వేయగలిగాం. ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ప్రభుత్వం ప్రవేశ  పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయని అన్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దారుణమైన అణచివేతకు, దోపిడీకి గురైంది. అన్ని రంగాల్లో తీవ్రమైన వెనుకబాటుతనం ఆవహించింది. బతుకుమీదనే ఆశను కోల్పోయేంతగా నిరాశ నిస్పృహలు ఆవరించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తమ  తలరాత మారదనె వాస్తవం గ్రహించి, ఉవ్వెత్తున ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు.  ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, కడగండ్లు, వాటి కారణాలు, పరిష్కారాలను స్పష్టంగా అర్థం చేసుకోగలిగాం. ఆ ఆలోచన పునాదుల మీదనే మానిఫెస్టోను రూపొందించి, ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి మానిఫెస్టోలోని అంశాలను వెంటవెంటనే అమలు చేస్తున్నాం. విస్తృత ప్రజా ప్రయోజనం కలిగిన కొత్త పథకాలనెన్నింటినో ప్రవేశపెట్టా౦. ఒకవైపు ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తూ, మరోవైపు నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేశాం. ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా నేను భావిస్తున్నాను. నేడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణాలని కేసీఆర్ అన్నారు.
దేశంలో మరే రాష్ట్రం అమలుచేయని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలకడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. పలు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు  ఇక్కడికి వచ్చి మన పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి, ఆయా రాష్ట్రాలలో అమలుచేసేందుకు పూనుకోవడమే ఇందుకు నిదర్శనం. అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ రోల్ మోడల్ అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతుండడం మనందరికీ గర్వకారణమన్నారు. 21 శాతం ఆదాయాభివృద్ధి రేటు కలిగిన ధనిక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. “సంపద సృష్టించాలి. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి’’ అనే సూత్రం ప్రాతిపదికగా ప్రభుత్వం పురోగమిస్తున్నది. సకలజనుల సంక్షేమానికి పాటుపడుతున్నదని అయన వెల్లడించారు. 
బతుకు దెరువు లేక ఆగమైపోయిన తెలంగాణ ప్రజలకు ముందు కనీస జీవన భద్రత కల్పించాలని, భవిష్యత్తు పట్ల ఆశలు చిగురింపచేయాలని ప్రభుత్వం  ప్రజాసంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత నిచ్చింది. 42 లక్షల మంది అసహాయులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్లు అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నదన్నారు.            గ్రామీణ ఆర్థికవ్యవస్థ బాగుంటేనే వివిధ వృత్తులను నమ్ముకొని జీవించే ప్రజానీకానికి చేతినిండాపని, కడుపునిండా అన్నం దొరుకుతుంది. వ్యవసాయ రంగం, వృత్తి పనులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని అయయ విశ్వాసం వ్యక్తం చేసారు. ఏది ఏమైనా సరే తెలంగాణ రైతులు కన్న కలలు నిజం చేయాదానికి ప్రభుత్వం నడుం కట్టింది. తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరాలనే దృఢ సంకల్పంతో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా కొనసాగిస్తున్నదని అన్నారు. 
చమటోడ్చి లోకానికి అన్నం పెట్టే రైతు కుటుంబానికి అటువంటి దుర్గతి పట్టనివ్వవద్దని ప్రభుత్వం యోచించింది. కుటుంబాన్నిపోషించే పెద్ద  దిక్కును కోల్పోయినా వారి కుటుంబానికి తగిన ఆర్థిక భరోసా ఉండాలనే ఉదాత్తమైన ఆలోచనతో రైతులకు జీవితబీమా పథకాన్ని ప్రారంభిస్తున్నదని అయన అన్నారు. 
మరే ఇతర రాష్ట్రంలోనూ, ఎవరూ సాహసించని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని మనం కేవలం వంద రోజుల్లో విజయవంతంగా పూర్తిచేయగలిగాం. ఏ భూమికి ఎవరు యజమానులన్న విషయంలో స్పష్టత వచ్చింది. పంట పెట్టుబడి చెక్కులతోపాటు పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా రైతులకు అందిస్తున్నాం. జూన్ 20లోగా రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తి చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమయిందని అన్నారు. నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గృహ నిర్మాణ పథకం అమలుచేయడంలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. నిరుపేద మహిళలు గర్భవతులుగా వున్న సమయంలో కూడా కూలీకి పోవాల్సి రావడం బాధాకరం. ఈ పరిస్థితుల నుంచి వారిని ఆదుకొనేందుకు మానవీయ కోణంతో కె.సి.ఆర్ కిట్స్ పేరుతో అపూర్వమైన పథకాన్ని అమలుచేస్తున్నామన్నారు. . రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా  ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగుదాం. అవిశ్రాంతంగా పరిశ్రమించి,  బంగారు తెలంగాణా గమ్యాన్ని ముద్దాడుదాం. యావత్భారతావనికి దిక్సూచిగా నిలుద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

Related Posts