విజయాడ, మే 4
నాల్గో విడత పోలింగ్‌కు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరింత ఫోకస్డ్‌గా చర్యలు తీసుకోంటోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం ఈ పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు రోజుల పాటు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ వేయొచ్చు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం ఆయా నియోజకవర్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంది ఎన్నికల సంఘం. ప్రత్యేక ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే హోం ఓటింగ్ ప్రారంభమైంది. వాటిపై కూడా అవగాహన కల్పించే ప్రక్రియ చేపట్టింది. అయితే పోస్టల్ బ్యాలెట్ వేయడంలో చాలా మంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ప్రక్రియలో ఏదో తప్పు చేయడంతో వారి ఓటు చెల్లకుండా పోతుంది. అలాంటి సమస్య రాకుండా ఈ స్టెప్స్‌ను ఫాలో అయితే మీ ఓటు చెల్లుబాటు అవుతుంది. ఓటు వేసేందుకు వెళ్లిన మీకు అక్కడి అధికారులు నాలుగు ఫారాలు ఇస్తారు. అంటే ఇవి ఫిల్ చేయాల్సిన పని లేదు. ఒక డిక్లరేషన్, బ్యాలెట్, రెండు కవర్‌లను మీ చేతిలో పెడతారు. ఓటు వేసిన అనంతరం పోస్ట్ చేయడానికి ఇచ్చే కవర్‌ని కూడా ఫారం అంటారు.
నాలుగు ఫారాలు ఏంటంటే
13ఏ- పోస్టల్ బ్లాలెట్
13బీ- చిన్న కవర్
13సీ- పెద్ద కవర్
13డీ- డిక్లరేషన్ ఫామ్
ఇందులో 13ఏ ఉంటుంది. ఇది డిక్లరేషన్ ఫామ్, రెండోది 13బీ చిన్న కవర్, మూడోది 13సీ పెద్ద కవర్, నాల్గోది 13డీ.... అసలు ఓటు ఎలా వేయాలి... వేయాల్సినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెబుతారు. ఇందులో 13ఏ చాలా ముఖ్యమైంది. ఉద్యోగికి సంబంధించిన ఎన్నికల విధుల ఆర్డర్, ఉద్యోగి గుర్తింపు కార్డు, ఓటర్ ఐడీ చూపించి 13ఏ ఫామ్‌పై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాలి. దీని కోసం కంగారు పడాల్సిన పని లేదు. ఈ అధికారి కూడా ఫెసిలిటీ కేంద్రంలోనే అందుబాటులో ఉంటారు. మీ గుర్తింపు పత్రాలు చూపించి సంతకం చేయిస్తే సరిపోతుంది. ఇలా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన తర్వాత మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ బ్యాలెట్ పేపర్‌పై కూడా మీ నియోజకవర్గంలో పోటీలో ఉన్న వ్యక్తుల పేర్లు, గుర్తులు ఉంటాయి. వాటిపై టెక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని నిలువుగా మడతపెట్టిన తర్వాత మీకు ఇచ్చిన 13బీ అంటే చిన్న ఎన్వలప్‌లో పెట్టాల్సి ఉంటుంది. బ్యాలెట్‌తోపాటు మీకు ఇచ్చిన డిక్లరేషన్ పేపర్‌పై కూడా సంతకం చేసి చిన్న కవర్‌లో పెట్టాలి. 13బీ పేరుతో ఉన్న ఈ చిన్న కవర్‌పై బ్యాలెట్ పేపర్ సీరియల్ రాసి ఉంటుంది. అందులో మీరు ఓటు వేసిన బ్యాలెట్ పేపరు పెట్టాలి. సీరియల్ నెంబర్ రాసి ఉన్న 13బీ చిన్న కవర్‌ను జాగ్రత్తగా 13సీ పేరుతో ఇచ్చిన పెద్ద కవర్‌లో పెట్టాలి. దానిపై మీరు అందులో పెట్టింది అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బ్యాలెట్ పేపరు అయితే అసెంబ్లీ నియోజకవర్గం పేరు, పార్లమెంట్ నియోజకవర్గం అయితే ఆ పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీకి, పార్లమెంట్‌కు రెండు వేర్వేరు పోస్టల్ బ్యాలెట్‌లు ఇస్తారు. అలా నియోజకవర్గం పేరు రాసిన తర్వాత అక్కడ ఉంచిన బాక్స్‌లో ఈ పోస్టల్ బ్యాలెట్‌ను వేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పోలింగ్ ఫెసిలిటీ కేంద్రంలోనే పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారి ఉంటారు. వాళ్లు మీకు సహాయం చేస్తారు. మీకు ఎలాంటి అనుమానం ఉన్నప్పటికీ వారిని అడవగవచ్చు. ఈ ప్రక్రియలో ఏది తప్పినా మీ పోస్టల్ బ్యాలెట్ చెల్లకుండా పోతుంది. మీ ఓటు వృథా అవుతుంది.