YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు, లోకేష్ కు మళ్లీ నోటీసులు

చంద్రబాబు, లోకేష్ కు మళ్లీ నోటీసులు

విజయవాడ, మే 6
ల్యాండ్ టైటలింగ్ చట్టం దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల వేళ ప్రతి ఒక్కరి నోట ఇదే చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ సీఎం జగన్‎పై దుష్ప్రచారం చేశారు. ఏపీలో భూములు అన్నీ సీఎం జగన్ లాక్కుంటారని అసత్య ప్రచారాలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు, లీగల్ సెల్ అధ్యక్షులు పూర్తి సాక్ష్యాధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ చర్యలు చేపట్టాలని ఏపీ సీఐడీకి ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో రంగంలో దిగిన సీఐడీ అధికారులు కేసు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారంలో ఎవరెవరు భాగస్వామ్యమయ్యారో వారిపై కేసులు నమోదు చేశారు. ఈ తరుణంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1గా, ఆయన కుమారుడు లోకేష్ ను ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరితో పాటు ఐవీఆర్ఎస్ ద్వారా కాల్స్ చేస్తున్న ఏజెన్సీపై కూడా కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ కాకుండా మరో 8 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే సీఐడీ నోటీసులు వ్యవహారంపై ఇప్పటి వరకు టీడీపీ స్పందించలేదు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు పంపించింది సీఐడీ. ఆ నోటీసులపై చంద్రబాబు, లోకేష్‎లు స్పందించకపోవడంతో ఈరోజు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‎తో తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపింది. దేశంలోఉన్న భూ వివాదాలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ ముందు భూ సర్వే జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరిహద్దు తగాదాలు వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వాటిని పరిష్కరించేందుకు కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. డిజిటలైజేషన్ పద్ధతిలో రికార్డులు కూడా అందజేయనున్నారు. ఈ యాక్ట్ ను అమలు చేసేకంటే ముందు సమగ్ర భూ సర్వే పూర్తి చేసి ఆతర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అని ప్రభుత్వం చెబుతోంది. ఈ వివరాలన్నింటినీ విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి తెలిపారు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు సీఎం జగన్ తన ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమిమీద సంపూర్ణ హక్కులను రైతులకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అని స్పష్టం చేశారు..సీఎం జగన్‌. చంద్రబాబు ముందు ఈ విషయం తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. రాబోయే రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గొప్ప సంస్కరణ అవుతుందన్నారు. ప్రస్తుతం భూ వివాదాల వల్ల ప్రజలు..అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని..ఆ పరిస్థితి ఇకపై ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ యాక్ట్‌కు రూపకల్పన జరిగిందన్నారు. సర్వే పూర్తయ్యాక ఆ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందన్నారు.

Related Posts