- ప్రజల అలవాట్లు మారితేనే అవినీతి అంతం
- విధానపర సంస్కరణలతోనే అది సాధ్యం కాదు
- ‘ఆన్ ద ట్రెయిల్ ఆఫ్ ద బ్లాక్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర హోం మంత్రి రాజనాధ్
అవినీతిపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ పోరాటాన్ని ప్రశ్నించడానికి లేదని, దేశం నుంచి అవినీతిని తరిమేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. విధానపరమైన సంస్కరణలొక్కటే అవినీతిని అంతమొందించలేవని, ప్రజలూ తమ అలవాట్లు మార్చుకుంటేనే అవినీతిని అరికట్టడం సాధ్యమవుతుందన్నారు. ‘ఆన్ ద ట్రెయిల్ ఆఫ్ ద బ్లాక్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అంతం చేయకుండా పేదరికం, ఇతర సమస్యలపై ఎలా పోరాడడం సాధ్యమవుతుందని ప్రతి సమావేశంలోనూ మోదీ చెబుతుంటారని వివరించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో నల్ల ధనాన్ని వెనక్కు రప్పించేందుకు ప్రధాని వేసిన సిట్.. అవినీతి నిర్మూలనకు ఆయన చేస్తున్న కృషిని వివరిస్తుందని చెప్పారు.
‘‘అభివృద్ధిలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం అవినీతిని అంతమొందించే వరకు సాధ్యం కాదన్నది అక్షర సత్యం. ఆదాయ వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నప్పుడు సామాజిక అశాంతి పెచ్ఛరిల్లుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే’’ అని ఆయన అన్నారు. బినామీ ఆస్తుల చట్టం అనే ఆయుధంతో ప్రభుత్వం పోరాడుతోందని, డీబీటీ, ఈ టెండరింగ్, ఈ ప్రొక్యూర్‌మెంట్ల ద్వారా 65 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆదా చేసిందని ఆయన వివరించారు. తమ వంతు బాధ్యతగా విధానపర సంస్కరణలను తీసుకొస్తున్నామని, అయినా కూడా అదొక్కటే అవినీతిని తరిమికొడుతుందని తాను అనుకోవట్లేదని ఆయన అన్నారు. ప్రజలు కూడా తమ అలవాట్లు మార్చుకుంటేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజల ఆలోచినా విధానం మారాలంటే అందరికీ విద్య అవసరమని చెప్పారు.