YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మూడో విడతకు రంగం సిద్ధం

మూడో విడతకు రంగం సిద్ధం
జల వనరుల పరిరక్షణ నిమిత్తం తెలంగాణ సర్కార్ ప్రారంభించిన మిషన్ కాకతీయ మంచి ఫలితాలనిస్తోంది. చెరువుల పునరుద్ధరణ, కొత్త చెరువుల ఏర్పాటు ద్వారా.. రైతులకు సాగు నీరు అందడమే కాక మత్స్యకారులకు ఉపాధి సైతం లభిస్తోంది. ఈ చెరువుల్లో చేప పిల్లలను ప్రభుత్వమే విడిచి పెడుతూ అవి పెరిగిన తర్వాత స్థానికంగా మత్సకారులు ఉచితంగా పట్టుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో చేపలు పట్టుకుంటూ మత్స్యకారులు మంచి ఆదాయమే దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో చెరువుల్లో చేపలు వదిలేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో చెరువుల్లో చేపల విడుదలకు సంబంధించిన చర్యలు మొదలయ్యాయి. ఈ దఫా 99 లక్షల చేపపిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో 37 మత్స్య సహకార సంఘాలు ఉండగా 2,574 మంది మత్స్యకారులు సభ్యత్వం పొంది ఉన్నారు. చేపల వేటే ఆధారంగా ఉన్న మత్య్సకారులందరికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీని కోసం వంద శాతం రాయితీపై ప్రభుత్వం చేపపిల్లలను సరఫరా చేస్తోంది. సర్కార్ నిర్ణయం ప్రకారమే జిల్లా మొత్తంలో ఈ ఏడాది రెండు సైజులున్న చేపపిల్లలను వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఇటీవలి కాలంలో చేప పిల్లల ధర పెరిగింది. గతంలో 35-40 ఎంఎం సైజుతో ఉన్న చేప పిల్లల ధర రూ. 57పైసలు ఉండగా ప్రస్తుతం రూ.59పైసలుగా ఉంది. 82-100 ఎంఎం పరిమాణం ఉన్న చేప పిల్లల ధర రూ. 1.15 నుంచి రూ.1.30కి చేరుకుంది. ధర పెరిగినప్పటికీ గ్రామాల్లోకి చెరువుల్లో చేప పిల్లల విడుదలపై అధికార యంత్రాంగం వెనకడుగేయడంలేదు. సాధారణ చెరువులతోపాటు ఈ ఏడాది  పంచాయతీ పరిధిలో ఉండే చెరువుల్లో కూడా చేపపిల్లలను వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాకు సరఫరా చేసే చేపపిల్లల ధరలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో చేపపిల్లల పెంపకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సంఘాలతో పాటు రైతులు చేపల పెంపకం పట్ల దృష్టి సారిస్తే, లబ్ధి పొందడానికి వీలుంటుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధికి పెద్దమొత్తంలోనే నిధులు కేటాయించిందని రెండు విడతలుగా రూ.లక్షల విలువగల చేపపిల్లలను ఉచితంగా నీళ్లల్లో వదిలామని వివరించారు. మూడో విడతలో లక్ష్యం పెరిగిందని.. ఈ దఫా లబ్ధిదారులకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉందని అన్నారు. ఇదిలాఉంటే ఆదిలాబాద్ వ్యాప్తంగా మత్స్య పరిశ్రమకు అనుకూల వాతావరణం ఉంది. అపారమైన వనరులు అందుబాటులోనే ఉన్నాయి. నీటి ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు బాగానే ఉంటుంది. వర్షాకాలంలో ప్రాజెక్టులు, చెరువులు నిండుతాయి. దీంతో చేపల పెంపకానికి పెద్ద సమస్య ఉండదు. ఈ అనుకూలతలను ఆసరాగా మలచుకుని ఏటా అయిదు లక్షల  చేప పిల్లలను ఉత్పత్తి చేసి సంఘాలకు సరఫరా చేస్తున్నారు. గత ఏడాది నుంచి ప్రభుత్వమే టెండర్ల ద్వారా అవసరం మేరకు వాటిని తెప్పించి ఉచితంగా చేప పిల్లలను వదులుతుంది. జిల్లా మొత్తంలో సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారు, లేనివారు కలిపి ఆరువేల మంది మత్స్యకారులు ఉన్నారు. స్థానిక నీటి వనరులను ఉపయోగించుకొని, చేప పిల్లల ఉత్పత్తిని మరింత పెంచి, రిజర్వాయర్లలో వేస్తే, 15వేల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యే వీలుందని అంచనా. దీంతోపాటు గ్రామాల వారీగా ఉన్న చెరువుల్లో కూడా చేప పిల్లలను వదులడం వల్ల ఉత్పత్తి లక్ష్యం మరింత పెరుగుతుందని లబ్ధిదారులు అంటున్నారు.  

Related Posts