YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీకి మూసుకుపోతున్న దారులు

వైసీపీకి మూసుకుపోతున్న దారులు

నెల్లూరు, మే 8
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి జగన్ సర్కార్‌‌ని ఏకి పారేశారు. అభివృద్ధి ఎక్కడా లేదని, కేవలం మాఫియా రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. ప్రచారంలో మోదీ, అమిత్ షా లేవనెత్తిన పలు అంశాలపై క్లారిటీ ఇవ్వలేక చేతులెత్తేశారు సీఎం జగన్. ఇందుకు కారణాలు లేకపోలేదు.ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులను కొందరిని కీలకమైన శాఖలకు, మరికొందరిని ముఖ్యమైన జిల్లాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇక తమకు తిరుగులేదని భావించారు ముఖ్యమంత్రి జగన్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొందరు అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝులిపించింది. ఫలితంగా వై నాట్ 175 స్లోగన్ నినాదం మెల్లగా చతికిలపడింది. కనీసం జగన్ సభలు, రోడ్ షోల్లో మచ్చుకైన ఆ స్లోగన్ ఎక్కడా వినిపించలేదు.దాదాపు డజనకు పైగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది ఈసీ. కొందరికి పోస్టింగ్ ఇవ్వగా, మరికొందర్ని పెండింగ్‌లో పెట్టింది. ఈ జాబితాలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీస్ కమిషనర్లు, ఐజీ ర్యాంకు అధికారులు ఉన్నారంటే ఏపీలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరకు వైసీపీ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జ్‌పై సీఐడీ కేసు నమోదు చేయడం అధికార ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు.వరుసగా అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేయడంతో సీఎం జగన్‌లో నిరాశ మొదలైంది. ఈ క్రమం లో ఏపీలో ఎన్నికలు సజావుగా సాగుతాయనే నమ్మకం లేదని సోమవారం రోడ్ షోల్లో చెప్పారు సీఎం జగన్. చివరకు పథకాలకు సంబంధించిన నిధులను కూడా ఆపేసిందని దుయ్యబట్టారు. మరో అడుగు ముందుకేసిన సజ్జల.. నిధుల విడుదల  విషయంలో ఏపీలో ఒక రూల్, తెలంగాణలో మరో రూలా అంటూ ధ్వజమెత్తారు. దీంతో ఆయనలో నిరాశ మొదలైందన్నది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సేఫ్ అని అంటున్నారు. ఆయనపై ఎలాంటి వేటు వేయకుండా నిధులు రిలీజ్ చేయకుండా ఆంక్షలు విధించింది ఈసీ. ఎందుకంటే ఎన్నికలకు కేవలం ఆరు రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో వైసీపీ సర్కార్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. పలు సంక్షేమ పథకాలకు నిధులు విడుదలకు ఈసీ నిరాకరించింది.ఈ విషయమై ప్రభుత్వం రాసిన లేఖలకు రిప్లై ఇచ్చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే ఇన్‌ఫుట్ సబ్సిడీ విడుదలకు అనుమతి ఇవ్వలేదు. ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న రైతులకు అందే ఇన్‌ఫుట్ సబ్సిడీకి నో చెప్పేసింది. అలాగే విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలకు అంగీకరించలేదు. పోలింగ్ అయ్యేవరకు ఆగాల్సిందేనని క్లారిటీ ఇచ్చేసింది.ఈ లెక్కన సీఎస్ అధికారులకు దాదాపు కత్తెర పడినట్టే. దీంతో వైసీపీ సర్కార్ గింజుకుంటోంది. ఏపీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను గమనిస్తున్నవాళ్లు మాత్రం 2019 ఎన్నికల్లో జగన్ అనుసరించిన విధానాన్నే టీడీపీ అనుసరిస్తోందని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ది కోసమే పోలింగ్ ముందు బటన్ నొక్కి రైతుల ఖాతాలో నగదు జమ చేసేలా ప్రభుత్వం జాప్యం చేసిందన్నది కొందరు అధికారులు చెబుతున్నమాట.జరుగుతున్న పరిణామాలను గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఈసారి జగన్ మళ్లీ అధికారంలోకి రారని తేల్చేశారు. ఇదిలావుండగా సీఎం జగన్ వాస్తు నిపుణుల మేరకు ఈ మధ్య తన ఇంటికి మార్పులు చేర్పులు చేశారు. అయినా కాలం కలిసిరాలేదు. ఒకవైపు విపక్ష టీడీపీ, మరోవైపు ఇంటి పోరు మధ్య ముఖ్యమంత్రి జగన్ గిలగిల కొట్టుకుంటున్నారని ఆ పార్టీలోని దిగువస్థాయి నేతలు చెప్పుకోవడం కొసమెరుపు.

Related Posts