శ్రీకాకుళం, మే 8
సిక్కోలు జిల్లా ఆముదాలవలస నియోజవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇప్పుడక్కడ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న స్పీకర్ తమ్మినేని.. అటు వైసీపీలో వర్గపోరుతో పాటు ఇటు బామ్మరిది కూన రవి ప్రధాన ప్రత్యర్ధిగా మారడంతో పొలిటికల్ సర్కస్ తప్పడం లేదు. ఇక టీడీపీ దిగ్గజ నేత యనమల, వైసీపీ మంత్రి అంబటి రాంబాబులు సైతం ఇంటిపోరుతో సతమతమవుతున్నారు.శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో వరుసగా నాలుగో సారి బావబామ్మరుదులు తలపడుతున్నారు. అక్కడ వైసీపీ అభ్యర్ధిగా తలపడుతున్న ప్రస్తుత ఎమ్మెల్యే, స్పీకర్ తమ్మినేని సీతారాంకి వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్ నేత సువ్వారి గాంధీ రెబల్‌గా పోటీకి దిగారు. గాంధీ భార్య మాజీ ఎంపీపీ దివ్య, ఆయన మరదలు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ సువర్ణ పార్టీకి, పదవులకు రాజీనామా చేసేశారు. గాంధీ స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నట్లు ప్రకటించి ప్రజల్లోకి వెళ్తున్నారు.
అముదాలవలస టీడీపీ అభ్యర్ధిగా ప్రభువ్వ మాజీ విప్ కూన రవికుమార్ పోటీలో ఉన్నారు. కూన రవికుమార్ అక్కనే తమ్మినేని సీతారాం వివాహం చేసుకున్నారు. 2009 నుంచి ప్రత్యర్ధులుగా ఉన్న ఆ బావబామ్మరుదులు ప్రస్తుత ఎన్నికల్లోనూ వరుసగా నాలుగోసారి తలపడుతున్నారు. ఇప్పుడు బామ్మరిదిని కట్టడి చేయడానికే తమ్మినేని కష్టపడుతుంటే.. రెబల్ అభ్యర్ధి గాంధీ చీల్చే ఓట్లపై ఆయన లెక్కలు వేసుకుంటూ టెన్షన్ పడుతున్నారంట. మొత్తానికి బావబామ్మరుదుల పోరు ప్రజాక్షేత్రంలో కురుక్షేత్రాన్ని తలపిస్తుంది. దీంతో నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఇక తుని టికెట్ విషయంలో యనమల రామకృష్ణుడుపై అలిగిన ఆయన తమ్ముడు యనమల కృష్ణుడు టీడీపీకి గుడ్ బై చెప్పారు .. గత రెండు సార్లుగా తుని నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన కృష్ణుడు గెలవలేకపోయారు. దాంతో ఈ సారి యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్యను ఎన్నికల బరిలో దించారు. దాంతో విభేదించిన కృష్ణుడు టీడీపీని వీడారు. కనీసం తనను సంప్రదించకుండా అన్న తనను మోసం చేశారంటూ వైసీపీ బాట పట్టి అన్న కూతురికి వ్యతరేకంగా ప్రచారం చేస్తున్నారు.అదలా ఉంటే పోలింగ్ గడువు ముంచుకొస్తున్న టైంలో సత్తెనపల్లి వైసీపీ అభ్యర్ధి, మంత్రి అంబటి రాంబాబుపై బాంబు పేల్చారు ఆయన అల్లుడు పార్టీలో తీవ్రస్థాయికి చేరిన అసంతృప్తికి తోడు టీడీపీ నుంచి బలమైన అభ్యర్ధిగా ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణను ఢీకొనడానికి ఆపసోపాలు పడుతున్న అంబటికి .. కూతురి భర్తే షాక్ ఇచ్చారు.అంబటిలాంటి వ్యక్తికి అల్లుడు కావడం తన దురదృష్టమని అని వ్యాఖ్యానించారు డాక్టర్ గౌతమ్.. అంబటి వంటి దుర్మార్గుడు ప్రపంచంలో ఉండడని తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రజలు ఆలోచించి మంచి వ్యక్తికి ఓటేయాలని పిలుపునిచ్చి అంబటికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ సారి ఎన్నికల్లో ఇంత మంది సీనియర్లకు ఫ్యామిలీ మెంబర్లే చుక్కలు చూపిస్తున్నారు. మరి ఆ ఫ్యామిలీ సర్కస్‌లో విక్టరీ కొట్టేదెవరో చూడాలి.