విజయవాడ, మే 9,
అవును.. మొన్న అమిత్ షా ఒకసారి వచ్చి వెళ్లిన వెంటనే ఏపీ డీజీపీ బదిలీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. వాయిస్ పెంచారు. జగన్ అవినీతిపై గళమెత్తారు. ఎన్నికలకు ఇంకా ఆరు రోజులు సమయం ఉన్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు అందరూ కమ్మేశారు. జగన్ ఒక్కడే అయ్యాడు. టీ 20లో పవర్ ప్లే లో పరుగులు రాకుండా చేసినట్లే.. బలమైన నేతలందరూ ఒక్కటై జగన్ టీంను కట్టడి చేస్తున్నారనే అనుకోవాలి. ఎందుకంటే ఏపీ ఎన్నికలు టీ 20 క్రికెట్ మ్యాచ్ ను తలపిస్తుందనే చెప్పాలి. అందరూ కలసి వస్తున్నారని గత కొంత కాలంగా జగన్ చెబుతూ వస్తున్నారు. అయితే మొన్న ఐదో తేదీ వరకూ పెద్దగా జగన్ కు ఇబ్బంది జరగలేదు. ఎందుకంటే తొలుత కూటమి సభకు ప్రధాని మోదీ హాజరయినప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. జగన్ పేరు కానీ, కనీసం వైసీపీ పేరు కూడా ఆయన ప్రస్తావించకపోవడంతో పాటు డీజీపీ, చీఫ్ సెక్రటరీలను కొనసాగిస్తుండటంతో కొంత అనుమానాలు తలెత్తాయి. జగన్ తో లోపాయి కారీ ఒప్పందాన్ని బీజేపీ కుదుర్చుకుందన్న కామెంట్లు కూడా వినిపించాయి. కానీ ఈ నెల 5వ తేదీ నుంచి అమిత్ షా రాకతో మాత్రం మొత్తం సీన్ మారిపోయింది. ఆ తర్వాత ఆరో తేదీ ప్రధాని మోదీ పర్యటించారు. ఈరోజు ప్రధాని పర్యటనలో కూడా నేరుగా జగన్ పై విమర్శలు చేశారు. అంటే జగన్ ఒక్కడే ఇటు వైపు.. మిగిలిన హేమాహేమీలందరూ మరొక వైపు. ఎన్నికల ముందు పది రోజుల వరకూ జగన్ పట్ల కొంత సానుకూలతతో వ్యవహరించినట్లే కమలం పార్టీ కనిపించింది. కానీ తర్వాత మాత్రం సీన్ మారింది. ఎంతగా అంటే జగన్ టీం ఒక్క పరుగు చేయకుండా, బంతి బౌండరీ లైన్ దాటనివ్వకుండా చుట్టూ ఫీల్డర్లను మొహరించినట్లే కనపడుతుంది. ఒక్క పరుగుల చేసినా అది జగన్ విజయానికి కారణమవుతుందేమోనన్న భయంతో పరుగులే లేకుండా చేయాలన్న కసితో మాత్రం విపక్షాలన్నీ ఒక్కటిగా మారాయి. కేవలం కూటమి మాత్రమే కాదు.. జగన్ టీం ను నిలువరించడానికి వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ సునీత రూపంలో కూడా ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉనట్లే కనపడుతంది. దీంతో రాష్ట్రంలో అనేక చోట్ల ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. వారిద్దరూ వచ్చిన తర్వాతే... అమిత్ షా, మోదీ రాష్ట్రానికి వచ్చి వెళ్లిన తర్వాత అనేక నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ క్యాడర్ కూడా బాహాబాహీలకు దిగుతుంది. టీడీపీ క్యాడర్ లో తెలియని ధైర్యం వచ్చిందనే చెప్పాలి. మొన్నటి వరకూ కేసులకు భయపడి బయటకు రాని వాళ్లు నేడు అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమయినట్లే కనిపిస్తుంది. చివరకు పోస్టల్ బ్యాలట్ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా యుద్ధ వాతావరణమే నెలకొంది. ఒకరినొకరు ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. బీజేపీ అగ్ర నేతల పర్యటన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తమ వెనక కేంద్ర ప్రభుత్వం ఉందన్న ధీమా వారిలో ధైర్యాన్ని తెచ్చి ఉండవచ్చు. అదే ఇప్పుడు ఏపీలో శాంతిభద్రతలకు సమస్యగా మారిందని చెప్పాలి. ఈరోజే ఇలా ఉంటే మరి పోలింగ్ రోజున ఏ తీరును ఉంటుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది.