YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈజీ మనీ కోసం 5 హత్యలు

ఈజీ మనీ కోసం 5 హత్యలు

కాకినాడ, మే 9
అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం జంపెన గ్రామానికి చెందిన పి.ఉపేంద్ర.. జల్సాల కోసం ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. అందులో భాగంగా నేరాలను ప్రారంభించాడు. చోరీలు, మోసాలు అయితే ఏమో… డబ్బుల కోసం ఏకంగా హత్యలకు పాల్పడుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకు అతని ఖాతాలో ఐదు హత్యలు చేరాయి.అచ్చుతాపురంలోని ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు ఉపేంద్ర. తన టార్గెట్ కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అదే కంపెనీలో పనిచేస్తున్న మాకవరపాలెం మండలం జడ్. గంగవరంనకు చెందిన రుత్తల శివ శంకర్‌తో ఉపేంద్రకు పరిచయం ఏర్పడింది. అతన్ని మాయమాటలతో నమ్మించి ట్రాప్ చేశాడు. మాయమాటలు చెప్పి చాటుమాటు దందాకు తెరలేపాడు. రెండు లక్షల రూపాయలు తీసుకొస్తే.. లిక్విడ్ గంజాయి కొనుగోలు చేద్దామని నమ్మించాడు. దానిని అమ్మితే 4 నుంచి 5 రెట్లు లాభం సంపాదించవచ్చని నమ్మబలికాడు. దీంతో శివ శంకర్ ఎఫ్రిల్ నెల 29వ తేదీన రెండు లక్షలు పట్టుకుని ఊరి శివారుకు వచ్చాడు. అదను చూసిన ఉపేంద్ర.. శివ శంకర్ తలపై కర్రతో మోదీ హతమార్చి పారిపోయాడని పోలీసులు తెలిపారు.శివ శంకర హత్య కేసులో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిందితుడు కోసం వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో జనవరి 31వ తేదీన లచ్చన్నపాలేనికి చెందిన వాలంటీర్ నడింపల్లి హరనాధ్ హత్య కేసు మిస్టరీ వీడింది. హరినాధ్‌ను కూడా ఉపేంద్ర ట్రాప్ చేసి హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. తన ప్లాన్ లో భాగంగానే ఉపేంద్ర.. హరినాధను నమ్మించాడు. అప్పటికే తన వద్ద ఉన్న పింఛన్ల సొమ్ముతో ఊరి బయటకు రప్పించి ఉపేంద్ర హత్య చేసినట్టు సిఐ హరి చెప్పారు.అయితే.. హత్య చేశాక ఆధారాలు దొరక్కుండా ఉపేంద్ర జాగ్రత్త పడుతున్నాడు. తనపై పోలీసులకు అనుమానం రాకుండా ఆధారాలు తారుమారు చేస్తున్నాడు. వాలంటీర్‌ను హత్య చేసిన ప్రాంతంలో గాజులు, కండోమ్ ప్యాకెట్లు వేసి, పోలీసులనూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడని పోలీసులు అంటున్నారు.కేవలం ఈ రెండు హత్యలే కాదు.. ఇదే తరహాలో 2022 అక్టోబర్ 12న మునగపాకకు చెందిన మహాలక్ష్మి నాయుడు అనే యువకుడిని మరో హత్య చేసి లక్ష రూపాయలకు పైగా నగదు తీసుకుని పరారయ్యాడు. ఒక హత్య కోసం కూపీ లాగితే మూడు హత్యలు బయటపడ్డాయి. అయితే ఉపేంద్ర అంతకుముందు కూడా వి. మడుగులలో రెండు హత్యలు చేసి జైలుకెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడని, మళ్లీ మూడు హత్యలు చేయడం ప్రారంభించాడని సిఐ హరి వెల్లడించారు.ఎట్టకేలకు సీరియల్ కిల్లర్ ఉపేంద్ర అరెస్ట్ అవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Posts