చంద్రబాబు పరివారం అవినీతికి పాల్పడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ పోరాటయాత్ర విజయనగరం జిల్లా భోగాపురం చేరుకున్న సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూతాను ప్రజలను రెచ్చగొట్టేవాడిని కాదని, నిజాలు చెప్పేవాడినని అన్నారు. అలాగే, దోపిడీ చేస్తూ ప్రజలను నష్టపర్చే విధానాలను అవలంబిస్తే తాను చేతులు కట్టుకుని కూర్చునేవాడిని కాదని హెచ్చరించారు. వై ఎస్ హయాంలో వేల ఎకరాల్లో పెట్టిన సెజ్ లు ఏ ఉపయోగం లేకుండా పోయాయన్నారు. పచ్చని భూముల్ని అభివృద్ది పేరిట తీసుకొని కబ్జాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలందరికీ వందల ఎకరాల భూములు ఎక్కడ్నుంచి వచ్చాయని పవన్ ప్రశ్నించారు. ఇలాగే దోపిడీ చేస్తూ ఉంటే.. అప్పుడు జనాన్ని రెచ్చగొడతానన్నారు. బీజేపీ రాసిచ్చే స్క్రిప్ట్ చదువుతాడని ఆరోపిస్తున్నారు.. వారు రాసిస్తే చదవడానికి తాను వ్యక్తిత్వం లేని వ్యక్తిని కాదని అన్నారు. అలాగే తాను మాటలు మార్చే వ్యక్తిని కాదని, ఎప్పుడూ ఒకే మాటపై ఉంటానని అన్నారు. తనకూ బీజేపీకి సంబంధమే లేదని స్పష్టం చేశారు. తుఫాన్ల నుంచి రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం తీసుకోలేదన్నారు. మత్స్యకారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. భోగాపురంలో భూములు తీసుకున్నారు కానీ, అభివృద్ధి మాత్రం చేయట్లేదని అన్నారు. భూములు లాక్కోవడంలో చూపించిన ఆసక్తి, అభివృద్ధి చేయడంలో చూపడం లేదని విమర్శించారు.